Prabhas | యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్లో వచ్చిన సినిమాల్లో కొన్ని బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోకపోయినా.. వాటిలోని పాటలు, సన్నివేశాలు మాత్రం ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోతుంటాయి. అలాంటి సినిమాల్లో ‘పౌర్ణమి’ కూడా ఒకటి. ప్రభాస్, త్రిష, ఛార్మి కౌర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోయింది. అయితే ఈ చిత్రంలోని పాటలకు మాత్రం ఇప్పటికీ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ముఖ్యంగా ‘భరత వేదముగా’ పాట మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. దాదాపు 20 ఏళ్ల క్రితం విడుదలైన ఈ పాట ఇప్పుడు ఏకంగా అంతర్జాతీయ స్థాయిలో వైరల్ అవుతోంది. చైనాకు చెందిన ఓ యువ డ్యాన్సర్ ఈ పాటకు చేసిన అద్భుతమైన క్లాసికల్ డ్యాన్స్ వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది.
వైరల్ అవుతున్న వీడియోలో మీరా వాంగ్ అనే చైనీస్ డ్యాన్సర్ ‘భరత వేదముగా’ పాటకు భారతీయ శాస్త్రీయ నృత్య శైలిలో ఎంతో అందంగా ప్రదర్శన ఇచ్చారు. ఆమె హావభావాలు, నృత్య భంగిమలు, పాటకు అనుగుణంగా చేసిన మూమెంట్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. తెలుగు తెలియని దేశానికి చెందిన ఓ డ్యాన్సర్ ఇంతటి ఆసక్తితో తెలుగు సినిమా పాటకు నృత్యం చేయడం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆమె ప్రదర్శనను చూసిన పలువురు ప్రేక్షకులు ప్రశంసలు కురిపించడంతో పాటు.. ఈ పాటకు మరోసారి భారీగా రీచ్ వచ్చింది. దీంతో ‘భరత వేదముగా’ పాట మరోసారి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో వైరల్ అవుతోంది.
మీరా వాంగ్ చేసిన డ్యాన్స్ కారణంగా ఈ పాటకు కొత్త తరం ప్రేక్షకులు, ముఖ్యంగా భారతదేశం వెలుపల ఉన్న సంగీత, నృత్యాభిమానుల నుంచి కూడా మంచి స్పందన వస్తోంది. మీరా వాంగ్ గురించి మరో ఆసక్తికర విషయం ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆమెకు భారతీయ శాస్త్రీయ నృత్యంపై ఎంతో ఆసక్తి ఉన్నప్పటికీ.. ఆమె ఇప్పటివరకు భారత్‌ను సందర్శించలేదట. అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురానికి చెందిన అలా వేణుగోపాల్ వద్ద ఆమె కూచిపూడి నృత్యాన్ని నేర్చుకుంటున్నట్లు సమాచారం. భారతదేశానికి రాకుండానే ఆన్లైన్ లేదా ఇతర మార్గాల్లో శాస్త్రీయ నృత్యాన్ని అభ్యసిస్తూ.. తనకు వచ్చిన నైపుణ్యాన్ని సోషల్ మీడియాలో వీడియోల రూపంలో పంచుకుంటున్నారు.ఆమెకు కూచిపూడిపై ఉన్న ఆసక్తి, తెలుగు సినిమా సంగీతంపై ఉన్న అభిమానం ఇప్పుడు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. ‘మాయాబజార్’ చిత్రంలోని ‘అహా నా పెళ్లంట’ పాటకు కూడా ఆమె డ్యాన్స్ చేసిన వీడియో ఉందని తెలుస్తుంది..