సిటీబ్యూరో: ఎన్టీపీసీలో పనిచేస్తున్న ఓ ఉద్యోగిని డిజిటల్ అరెస్ట్ చేసిన సైబర్‌నేరగాళ్లు రూ. 27 లక్షలు దోచేశారు. నేరెడ్మెట్ ప్రాంతంలో నివాసముండే బాధితుడికి తాను క్రైమ్ బ్రాంచ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నరేష్నంటూ ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. మీపై క్రిమినల్ కేసు నమోదయ్యిందంటూ బెదిరించాడు. కేసుకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని బాధితుడు అడిగినా వివరాలు ఇవ్వకుండా నిన్ను అరెస్ట్ చేసేందుకు వస్తున్నామని, నీవు వెంటనే మ్యాటర్ సెటిల్ చేసుకొని జరిమానా చెల్లించాలని లేదంటే జైలుకు వెళ్లక తప్పదంటూ భయపెట్టించాడు.
కొద్దిరోజుల తరువాత తిరిగి ఫోన్ చేసి ఇప్పటి వరకు నీవు కేసు సెటిల్ చేసుకోలేదంటూ భయపెట్టించడంతో రూ. 7 వేలు ఫోన్‌పేలో బాధితుడు సదరు నకిలీ పోలీస్‌కు పంపించాడు. అనంతరం వివిధ కారణాలు చెబుతూ దఫ దఫాలుగా రూ. 27,22,500 వసూలు చేశారు. అయినా సైబర్‌నేరగాళ్ల వేధింపులు ఆగకపోవడంతో కుటుంబ సభ్యులకు ఈ విషయాన్ని చెప్పాడు. దీంతో ఇదంతా మోసమని, నిజమైన పోలీసులు ఎవరు కూడా డబ్బులు అడుగరని చెప్పడంతో ఆయన మల్కాజిగిరి సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.