హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి) : వర్షాకాల సమావేశాలు అధికార, ప్రతిపక్షాల మధ్య మరోసారి హోరాహోరీ రాజకీయ సమరానికి వేదిక కానున్నాయి. అసెంబ్లీలో అధికార కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీఆర్ఎస్ అస్త్రశస్త్రాలతో సిద్ధమవుతుండగా.. ప్రతిపక్షం దాడిని డైవర్షన్ రాజకీయంతో ఎదురొనేందుకు అధికారపక్షం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నది. కాంగ్రెస్ ‘వెయ్యి రోజుల వైఫల్యాల’పై బీఆర్ఎస్ తరఫున కేటీఆర్ బుల్లెట్లు ఎక్కుపెట్టనుండగా 22ఏ నిషేధిత భూముల వివాదం, సాగునీటి ప్రాజెక్టులు, పాలిటెక్నిక్, విద్యార్థుల సమస్యల అస్ర్తాలను సంధించేందుకు బీఆర్ఎస్ శాసనసభా పక్ష ఉపనేత హరీశ్‌రావు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు, సంక్షేమ పథకాల బకాయిలు.. ఇలా ఒకో అంశాన్ని తీసుకొని ప్రభుత్వాన్ని సభలో నిలదీసేందుకు గులాబీ పార్టీ స్క్రిప్ట్ రెడీ చేసుకుంటున్నట్టు సమాచారం.
ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేసీఆర్ సమావేశం నిర్వహించి అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేసినట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఏ అంశాన్ని ఎవరు ప్రస్తావించాలి? ఏ సమయంలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలి? ఏ అంశంపై పట్టుబట్టాలి? అనే అంశాలపై అధినేత సూచనలు చేసినట్టు తెలిసింది. ఈ తరహా దాడిని ముందుగానే పసిగట్టిన అధికార పక్షం.. ప్రతిపక్షం లేవనెత్తే ప్రజా సమస్యల నుంచి చర్చను పకదారి పట్టించేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా? రారా? అనే అంశాన్ని రాజకీయ చర్చగా మలిచే వ్యూహాన్ని అనుసరించనున్నట్టు సమాచారం. ఇదే అంశాన్ని రక్షణ కవచంగా చేసుకొని అవసరమైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కవ్వించి సభ నుంచి బహిష్కరించాలనే ఆలోచనతో ఉన్నట్టు తెలిసింది. వెయ్యి రోజుల ఫెయిల్యూర్ పాలన, ఆరు గ్యారెంటీల హామీలు, తదితర అంశాలను చర్చించేందుకు కనీసం 30 రోజులు శాసన సభ నడుపాలని ప్రతిపక్ష బీఆర్ఎస్ పట్టుబడుతుండగా.. కేవలం ఐదు బిజినెస్ రోజుల్లోనే సభ ముగించాలని అధికార పక్షం నిర్ణయించినట్టు తెలిసింది.
అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి (సోమవారం) నుంచి ప్రారంభం కానున్నాయి. తొలి రోజు సభ అనంతరం స్పీకర్ నేతృత్వంలో జరిగే బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశంలో సభ ఎన్ని రోజులు నిర్వహించాలనేది ఖరారు కానున్నది. ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం ఈనెల 11 వరకే శాసనసభ నిర్వహించాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్టు తెలిసింది. ఈనెల 13 నుంచి 19 వరకు 6 రోజుల పాటు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌లో జరిగే కామన్వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్‌లకు హాజరు కానున్నట్టు సమాచారం. వీరి ప్రయాణాన్ని సాకుగా చేసుకొని సాధ్యమైనంత త్వరగానే సమావేశాలు ముగించే ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్టు తెలిసింది. ఈ 5 రోజుల సమయంలో ప్రభుత్వం కొన్ని కీలక బిల్లులు, తీర్మానాలను సభ ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ ప్రాంత సమగ్రాభివృద్ధి, క్యూర్-2026 బిల్లుతోపాటు.. ఎన్నికల్లో పోటీచేసే కనీస వయస్సును 25 నుంచి 21 ఏండ్లకు తగ్గించాలని కేంద్రాన్ని కోరే తీర్మానం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉన్నదని అసెంబ్లీ వర్గాలు చెప్తున్నాయి.
మరోవైపు.. బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు 22ఏ భూముల వివాదాన్ని ప్రధాన అస్త్రంగా సంధించేందుకు సిద్ధమైనట్టు తెలిసింది. తాతల కాలం నుంచి అనుభవిస్తున్న భూమి.. చేతిలో పట్టా ఉన్నా రిజిస్ట్రేషన్ చేసుకోలేని దుస్థితి.. అమ్మాలన్నా, కొనాలన్నా వీలులేని పరిస్థితి.. అవసరానికి భూమిని తాకట్టు పెట్టి రుణం తెచ్చుకోలేని వేదన ఎదురొంటున్న రైతులు, భూ యజమానుల సమస్యను సభలో బలంగా వినిపించాలని బీఆర్ఎస్ వ్యూహరచన చేసినట్టు తెలిసింది. 22ఏ నిషేధిత జాబితాలో భూములు ఎలా చేరుతున్నాయి? ఏండ్లుగా రైతుల ఆధీనంలో ఉన్న భూములు ఒకసారిగా రిజిస్ట్రేషన్‌కు ఎందుకు దూరమవుతున్నాయి? జాబితా నుంచి భూముల తొలగింపునకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంది? అనే అంశాల మీద సరార్ను హరీశ్ నిలదీయనున్నట్టు తెలిసింది. ఇప్పటికే ఆయన 22ఏ బాధితులను ప్రత్యక్షంగా కలిశారు.
వాళ్ల ఆవేదనను అర్థం చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 22ఏ కింద పెట్టిన భూముల జాబితాను తెప్పించి పెట్టినట్టు తెలిసింది. భూమి ఉన్నా హకు అనుభవించలేని బాధితుల గోడు సభా సాక్షిగా వినిపించేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. అవసరమైతే ఈ అంశంపై చర్చకు పట్టుబట్టి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే వ్యూహంతో హరీశ్ ఉన్నట్టు తెలిసింది. ఇదే సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలు, ఉద్దేశపూర్వకంగా ప్రాజెక్టు జలాలను ఒడిసిపట్టకుండా ప్రభుత్వం చేస్తున్న తాత్సారాన్ని నిలదీసేందుకు హరీశ్ సిద్ధమైనట్టు బీఆర్ఎస్ వర్గాల సమాచారం. ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టుల నుంచి రైతులకు సకాలంలో నీరు అందించకపోవడాన్ని ప్రస్తావిస్తూ.. ప్రభుత్వం చెబుతున్న సాగునీటి లెకలకు, క్షేత్రస్థాయిలో రైతుల పరిస్థితికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని సభలో ఎత్తిచూపాలని చూస్తున్నట్టు సమాచారం. మహిళలు, దివ్యాంగులు, రైతులు, విద్యార్థులు, యువత తదితర వర్గాలకు ఇచ్చిన హామీల అమలు ఏ దశలో ఉన్నదనే అంశాన్ని లేవనెత్తాలని భావిస్తున్నట్టు తెలిసింది.
విద్యార్థుల సమస్యలపైనా బీఆర్ఎస్ గట్టిగానే గళం విప్పనున్నట్టు తెలిసింది. ముఖ్యంగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యను ప్రధాన అంశంగా మార్చాలని భావిస్తున్నట్టు తెలిసింది. ఫీజులు సకాలంలో అందక కళాశాలలు, విద్యార్థులు ఎదురొంటున్న ఇబ్బందులను ప్రస్తావిస్తూ ఉన్నత విద్యను అభ్యసించే పేద, మధ్యతరగతి విద్యార్థులపై ఆర్థిక భారం పెరుగుతున్నదని ప్రభుత్వాన్ని నిలదీయాలని బీఆర్ఎస్ యోచిస్తున్నట్టు తెలిసింది. ప్రభుత్వం ఓవైపు విద్యార్థుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని చెప్తుండగా.. మరోవైపు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పేరుకుపోవడం ఏందనే ప్రశ్నను సభలో సంధించేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఇదే క్రమంలో పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యను కూడా అసెంబ్లీలో ప్రధానంగా ప్రస్తావించాలని బీఆర్ఎస్ నిర్ణయించినట్టు సమాచారం. పాలిటెక్నిక్ విద్యావ్యవస్థలో తీసుకొస్తున్న మార్పులు, జీవో 97పై విద్యార్థులు, అధ్యాపక వర్గాల్లో నెలకొన్న ఆందోళనను సభ దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తున్నది. ఇప్పటికే ఈ అంశంపై కేటీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న నేపథ్యంలో విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయాలపై ప్రభుత్వం స్పష్టమైన వైఖరి వెల్లడించాలని డిమాండ్ చేసే అవకాశం ఉన్నది. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన అంశాలపై నిర్ణయాలు తీసుకునే ముందు వారి ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకున్నారా? అనే ప్రశ్నను సరార్ ముందుంచేందుకు ప్రతిపక్షం సిద్ధమవుతున్నది.
బీఆర్ఎస్ పక్షం నుంచి తీవ్రస్థాయిలో దాడి పొంచి ఉన్నదని, ప్రజా సమస్యలపై సరార్ను ఇరుకున పెట్టేందుకు సమగ్ర ప్రణాళిక సిద్ధమైందని నిఘా వర్గాల నుంచి సమాచారం అందుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ రాజకీయాలతో శాసనసభ సమావేశాలను నెట్టుకురావాలని నిర్ణయించినట్టు తెలిసింది. ప్రతిపక్షం ధాటికి రక్షణ వైఖరితో తట్టుకోలేమని, ప్రజల ముందు దోషులుగా మిగిలిపోతామనే ఆందోళనతో ఉన్న ప్రభుత్వం కేసీఆర్ హాజరు అంశాన్ని తెరపైకి తెచ్చి డైవర్షన్ రాజకీయం చేయడమే సరైన వ్యూహమని భావిస్తున్నట్టు తెలిసింది. ఈ క్రమంలో కేసీఆర్ గైర్హాజరు అంశాన్ని కావాలనే సాగదీసి, బీఆర్ఎస్ సభ్యులను రెచ్చగొట్టేలా మాట్లాడాలని కాంగ్రెస్ అంతర్గతంగా నిర్ణయించుకున్నట్టు సమాచారం.
కేసీఆర్‌పై విమర్శలు వచ్చినప్పుడు సహజంగానే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభాపతి పోడియం వద్దకు దూసుకువచ్చి తీవ్ర నిరసన వ్యక్తం చేస్తారని, ఆ గందరగోళాన్ని ఆసరాగా చేసుకొని, సభా కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తున్నారనే నెపంతో బీఆర్ఎస్ సభ్యులను సస్పెండ్ చేయడమో లేక సమావేశాల నుంచి బహిషరించడమో చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. ప్రతిపక్ష సభ్యులు సభలో లేకపోతే ప్రభుత్వం ప్రతిపాదించే కీలకమైన క్యూర్ బిల్లుతో పాటు ఎన్నికల వయస్సు తగ్గింపు తీర్మానం, ఇతర విధానపరమైన నిర్ణయాలను ఎలాంటి వ్యతిరేకత లేకుండా సులభంగా ఆమోదింపజేసుకోవచ్చని అధికార పక్షం భావిస్తున్నట్టు సమాచారం. అలానే సాధ్యమైనంత త్వరగా అసెంబ్లీ సమావేశాలు ముగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది.
కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి వెయ్యి రోజులు పూర్తయిన నేపథ్యంలో ఈ కాలంలో ప్రభుత్వ వైఫల్యాలు, నెరవేరని హామీలు, ప్రజలకు ఎదురైన ఇబ్బందులను ఏకరువు పెడుతూ ‘1000 రోజుల చార్జ్‌షీట్’తో సరార్‌పై విరుచుకుపడేందుకు బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిద్ధమైనట్టు తెలిసింది. వెయ్యి రోజుల పాలనను ‘ప్రజా వంచన’గా అభివర్ణిస్తూ ఎన్నికల వేళ అరచేతిలో వైకుంఠం చూపించి అధికార పీఠం దకిన తర్వాత హామీలను అటకెకించారనే ఆరోపణలను మరోసారి అసెంబ్లీ వేదికగా ప్రజల ముందుకు తీసుకెళ్లాలని కారు పార్టీ వ్యూహరచన చేసినట్టు సమాచారం. ప్రభుత్వ ప్రచారానికి, క్షేత్రస్థాయిలో నెలకొన్న వాస్తవ పరిస్థితులకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని సభ సాక్షిగా ఎత్తిచూపుతూ ‘మాటలకు, చేతలకు మధ్యం అంతరాన్ని విడమరచి ఎండగట్టేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతున్నది.
ప్రధానంగా యువజన, విద్యార్థి, నిరుద్యోగుల ఆకాంక్షలను కాంగ్రెస్ ప్రభుత్వం గాలికొదిలేసిందనే విషయాన్ని కేటీఆర్ బలంగా ప్రస్తావించనున్నట్టు తెలిసింది. ఎన్నికల సమయంలో ఉద్యోగాల భర్తీ, యువతకు అవకాశాలు, విద్యార్థుల భవిష్యత్తుపై ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ మేరకు అమలు చేశారనే దానిపై ప్రభుత్వాన్ని నిలదీయాలని భావిస్తున్నట్టు సమాచారం. కేవలం రాజకీయ ఆరోపణలకే పరిమితం కాకుండా.. ప్రభుత్వ ప్రకటనలు, అధికారిక గణాంకాలు, హామీల అమలు పరిస్థితి, క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదురొంటున్న సమస్యలతో ముడిపెట్టి సరార్ను ఇరుకున పెట్టేలా సమాచారంతో కూడిన ‘బుల్లెట్ల’ను కేటీఆర్ సిద్ధం చేసుకున్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనను ఒకరోజు రాజకీయ ప్రసంగంగా కాకుండా.. హామీలు, అమలు, వైఫల్యాలు, ప్రజా సమస్యల ఆధారంగా ‘చార్జ్‌షీట్ ’ రూపంలో సభ ముందుంచాలనేది బీఆర్ఎస్ వ్యూహంగా కనిపిస్తున్నది.