హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ సమావేశాల తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రణరంగంలోకి దిగుతారని మాజీ మంత్రి, పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు ప్రకటించారు. అన్ని వర్గాలను వంచిస్తున్న దుర్మార్గపు ప్రభుత్వంపై లక్షలాది మందితో ప్రత్యక్ష ఉద్యమానికి శ్రీకారం చుడుతారని వివరించారు. కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి జలాల ఎత్తిపోతలపై కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ మహాపోరాటం చేస్తారని చెప్పారు.
గతంలో ఎన్టీఆర్, జయలలిత, చంద్రబాబు లాంటి నాయకులను సభలో అవమానిస్తే వారు అసెంబ్లీని బహిష్కరించి, ప్రజాక్షేత్రంలో గెలిచి తిరిగి ముఖ్యమంత్రులుగా అడుగుపెట్టారని గుర్తుచేశారు. కేసీఆర్‌ది సైతం అదేబాట అని తేల్చిచెప్పారు. అయినా అసెంబ్లీలో రేవంత్‌రెడ్డి వాడే బజారు భాష వినేందుకు కేసీఆర్ అసెంబ్లీకి రావాల్సిన అవసరంలేదని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. సోమవారం నుంచి ప్రారం భం కానున్న శాసససభ, మండలి సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాంపై బీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఆదివారం ఎర్రవల్లిలో బీఆర్ఎస్ఎల్పీ సమావేశం నిర్వహించారు. అనంతరం బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.
ప్రాణాలకు తెగించి రాష్ర్టాన్ని సాధించి.. తెచ్చుకున్న తెలంగాణకు రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్‌కు భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని హరీశ్ స్పష్టంచేశారు. కానీ సీఎం రేవంత్‌రెడ్డి కేసీఆర్ భద్రతకు కోట్లు ఖర్చుచేస్తున్నామని ఆరోపణలు చేయడం సిగ్గుచేటని నిప్పులు చెరిగారు. ‘పక్క రాష్ట్రమైన ఏపీలో మాజీ ముఖ్యమంత్రులకు భద్రత కల్పించడంలేదా? ఇవేం సిగ్గులేని మాటలు?’ అని నిలదీశారు.
‘కేసీఆర్ భద్రతపై ఏడుస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డీ.. మరి ఏనాడూ వార్డు మెంబర్ కూడా కానీ నీ తమ్ముడు తిరుపతిరెడ్డికి నలుగురు గన్మెన్లను ఏవిధంగా పెట్టారు? ఆయన భద్రతకు రూ.40 కోట్లు ఎందుకు ఖర్చుచేస్తున్నారు?’ అని సూటిగా ప్రశ్నించారు. నాలుగుకోట్ల ప్రజలను కదిలించి, అసమాన పోరాటంతో తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్ రాజీనామా కోరే హక్కు రేవంత్‌రెడ్డికి ఎక్కడిదని నిలదీశారు. ‘దేవుండ్ల మీద ఒట్టుపెట్టి రుణమాఫీ ఎగ్గొట్టినందుకు.. వంద రోజుల్లో ఇస్తామన్న ఆరు గ్యారెంటీలు వెయ్యి రోజులైనా ఇవ్వకుండా ధోకా చేసినందుకు.. జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా నిరుద్యోగులను, ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకుండా విద్యార్థులను దగా చేసినందుకు రేవంత్‌రెడ్డే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి’ అని డిమాండ్ చేశారు. మరోసారి కేసీఆర్‌పై నోరుపారేసుకుంటే ఊరుకునేదిలేదని హెచ్చరించారు.
సీఎం రేవంత్‌రెడ్డికి పాలన చేతగాక కేసీఆర్ రాజీనామా చేయాలంటూ కొత్త డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరతీశారని హరీశ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్‌రెడ్డి వాడుతున్న భాష బజారు భాషను తలపిస్తున్నదని నిప్పులుచెరిగారు. ‘బడివె, బట్టలిప్పి కొడుతం..తిర్రేసి మర్రేసి కొడుతం’ అంటూ అసెంబ్లీలో మాట్లాడటం చూసి సభ్యసమాజం తలదించుకుంటున్నదని చెప్పారు.
‘అలాంటి గౌరవంలేని కౌరవసభకు కేసీఆర్ లాంటి గొప్ప నాయకుడు వెళ్లాల్సిన అవసరంలేదు.. ఈ చిల్లర సీఎంతో చర్చల్లో పాల్గొనాల్సిన అవసరం లేదు’ అని పార్టీ ఎమ్మెల్యేలందరం నిర్ణయించామని ప్రకటించారు. కేసీఆర్ తయారు చేసిన సిఫాయిలమైన తాము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే సత్తా సీఎం రేవంత్‌రెడ్డికి లేదని దెప్పిపొడిచారు. కేసీఆర్‌పై కాంగ్రెస్ మొదటి నుంచీ దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నదని, సీఎం రేవంత్‌రెడ్డి దిగజారి మాట్లాడుతున్నాడని చెప్పారు. చిల్లర మాటలు మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకులకు ప్రజా క్షేత్రంలోనే బుద్ధిచెప్తామని హెచ్చరించారు.
ప్రభుత్వానికి దమ్ముంటే..ఇచ్చిన హామీలు అమలు చేశామనే నమ్మకముంటే ప్రజా సమస్యలపై చర్చించాలని, చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీ సమావేశాలను కనీసం నెల రోజులు నిర్వహించాలని హరీశ్ సవాల్ విసిరారు. ‘కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా రాబోయేరోజుల్లో కేసీఆర్ స్వయంగా లక్షలాది మందితో ప్రత్యక్ష ఉద్యమానికి నాయకత్వం వహించాలని ఈ సమావేశంలో నిర్ణయించినం’ అని పునరుద్ఘాటించారు.
22ఏ కింద సాగు భూములను నిషేధిత జాబితాలో పెట్టి రైతులను ఇబ్బందులు పెడుతున్న తీరుపై, కరెంట్ కోతలు, రుణమాఫీ వైఫల్యం, పాలిటెక్నిక్ జీవో 97 రద్దు, సింగరేణిలో సైట్ విజిట్ సర్టిఫికెట్ పేరిట కుంభకోణాలు, పీఆర్సీ, డీఏలు, ఈహెచ్ఎస్ ఫెయిల్యూర్స్, జాబ్ క్యాలెండర్ విడుదల చేయకుండా దగా చేసిన తీరుపై నిలదీస్తామని ప్రకటించారు. ఇందిరాపార్క్ వద్ద రోజూ ధర్నాలు చేస్తున్న అంగన్వాడీలు, వీఆర్ఏలు, ఆశా కార్యకర్తలకు సమాధానం చెప్పలేని కాంగ్రెస్ అదే వేదికపై కేసీఆర్ రాజీనామా కోసం ధర్నా చేయడం సిగ్గుచేటని విమర్శించారు.