గ్రామాలు, పట్టణాల్లోని పట్టా భూములను 22ఏ నిషేధిత జాబితాలో పెట్టడం వల్ల పేద, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నరు. పిల్లల పెండ్లిళ్లు, దవాఖాన ఖర్చులు, ఇతర అత్యవసర పరిస్థితుల్లో భూమి అమ్ముకొనే అవకాశం లేక అరిగోస పడుతున్నరు. 22ఏ సమస్యపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలె. కాంగ్రెస్ ఇచ్చిన మోసపూరిత హామీలను ప్రశ్నిస్తున్న నిరుద్యోగులు, ఉద్యోగులు, రైతులు, మహిళల తరఫున అసెంబ్లీలో బీఆర్ఎస్ పోరాటం చెయ్యాలె.
-కేసీఆర్
హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): సాగునీటి కోసం బీఆర్ఎస్ మరో సమరానికి సిద్ధమైంది. నీళ్లు అందుబాటులో ఉన్నా కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ప్రా జెక్టుల ద్వారా ఎత్తిపోతలపై నిర్లక్ష్యం వహిస్తున్న కాంగ్రెస్ సర్కార్‌ను ఎండగట్టేందుకు రెడీ అయింది. ఈ మేరకు ఆదివారం ఎర్రవల్లిలో నిర్వహించిన బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం వేదికగా పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సుమారు రెండుగంటల పాటు సాగిన సమావేశంలో సోమవారం నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. లేవనెత్తాల్సిన ప్రజాసమస్యలను ప్రస్తావించారు.
ఈ విషయంలో ముందుకెళ్లే తీరుపై దిశానిర్దేశం చేశారు. అన్నివర్గాలను మోసం చేసిన సర్కార్‌ను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. ప్రాజెక్టుల్లో నీళ్లున్నా విడుదల చేయకుండా ప్రజలు, రైతులను ప్రభుత్వం ఆందోళనకు గురిచేయడంపై కేసీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనకు మూడేండ్లు పూర్తవుతున్న తరుణంలో పార్టీ నాయకులు మౌనంవీడాలని పిలుపునిచ్చారు. అసెంబ్లీలో ప్రజాసమస్యలపై గట్టిగా పోరాడాలని, ప్రజాక్షేత్రంలో నిలదీయాలని దిశానిర్దేశం చేశారు. తెలంగాణ ఉద్యమం సాగింది. త్యాగాలు చేసి తెలంగాణను తెచ్చుకున్నది సాగునీటి కోసమేనని స్పష్టంచేశారు.
తెలంగాణకు జీవధార అయిన కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ చేసింది దుష్ప్రచారమని, కుట్రపూరితంగానే నీటిని ఎత్తిపోయడంలేదనే వాస్తవం ఎన్డీఎస్ఏ ప్రకటనతో తేటతెల్లమైందని వివరించారు. బీఆర్ఎస్ పాలనలో 90 శాతం పూర్తయిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును నిర్లక్ష్యం చేస్తే సహించేదిలేదని హెచ్చరించారు. నాగార్జునసాగర్, శ్రీశైలం లాంటి ప్రాజెక్టుల్లో నీళ్లున్నా పంటలకు విడుదల చేయకపోవడం దారుణమని మండిపడ్డారు. సాగునీటి రంగంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై కాంగ్రెస్ ప్రభుత్వంపై జలయుద్ధానికి సిద్ధం కావాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పిలుపునిచ్చారు. ఇందుకు సంబంధించి పార్టీలోని ముఖ్యనేతలతో చర్చించి ప్రత్యక్ష కార్యాచరణ విధివిధానాలు ఖరారు చేస్తామని చెప్పారు.

త్యాగాలు చేసి తెలంగాణను తెచ్చుకున్నది సాగునీటి కోసమే.. తెలంగాణకు జీవధార అయిన కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ చేసింది దుష్ప్రచారం.. కుట్రపూరితంగానే నీటిని ఎత్తిపోయడంలేదనే వాస్తవం.. ఇది ఎన్డీఎస్ఏ ప్రకటనతో తేటతెల్లమైంది. బీఆర్ఎస్ పాలనలో 90 శాతం పూర్తయిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును నిర్లక్ష్యం చేస్తే సహించేదిలేదు.
గ్రామాలు, పట్టణాల్లోని పట్టా భూములను 22ఏ నిషేధిత జాబితాలో పెట్టడం వల్ల పేద, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నరు. పిల్లల పెండ్లిళ్లు, దవాఖాన ఖర్చులు, ఇతర అత్యవసర పరిస్థితుల్లో భూమి అమ్ముకొనే అవకాశం లేక అరిగోస పడుతున్నరు. 22ఏ సమస్యపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలె.
– బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
అప్రజాస్వామిక విధానాలను తిప్పికొట్టాలి
కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలను ప్రజాసమస్యలపై చర్చావేదికగా కాకుండా బూతు కూతలకు నిలయంగా మార్చడంపై కేసీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ప్రతిపక్ష సభ్యులను సభలో తూలనాడుతున్న కాంగ్రెస్ అప్రజాస్వామిక విధానాన్ని ఉభయసభల్లో తిప్పికొట్టాలని బీఆర్ఎస్ సభ్యులకు పిలుపునిచ్చారు. నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టు జలాలను తెలంగాణ రైతాంగానికి దక్కకుండా, పక్క రాష్ట్రం వాడుకొనేలా ప్రభుత్వం సహకరిస్తున్నదని విమర్శించారు.
నిరసనల విజయవంతంపై సంతృప్తి
వంద రోజుల్లో అమలు చేస్తామన్న ఆరు గ్యారెంటీలు, 420 హామీలను వెయ్యి రోజులైనా నెరవేర్చకపోవడంపై సర్కార్ తీరును అసెంబ్లీ సమావేశాల్లో ఎండగట్టాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ పిలుపునిచ్చారు. వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనా వైఫల్యంపై బీఆర్ఎస్ చేపట్టిన నిరసన కార్యక్రమాల విజయవతంపై సంతృప్తి వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ ముఖ్య నేతలు, జిల్లా నాయత్వాన్ని అభినందించారు.
పేదల సంక్షేమంపై కాంగ్రెస్ చేస్తున్న నిర్లిప్త వైఖరిని అసెంబ్లీ, మండలిలో గట్టిగా నిలదీయాలని దిశానిర్దేశం చేశారు. గ్రామాలు, పట్టణాల్లోని పట్టా భూములను 22ఏ నిషేధిత జాబితాలో చేర్చడంతో పేద, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, పిల్లల పెండ్లిళ్లు, దవాఖాన ఖర్చులు, ఇతర అత్యవసర పరిస్థితుల్లో తమ భూమిని అమ్ముకొనే అవకాశం లేక ప్రజలు అరిగోస పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. 22ఏ సమస్యపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని ఉద్బోధించారు. రాష్ట్రంలో కరువు మేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో మిషన్ భగీరథ లాంటి తాగునీటి వ్యవస్థను నిర్వీర్యం చేసి ప్రజల తాగునీటి అవసరాలను తీర్చని ప్రభుత్వానికి సిగ్గుండాలని నిప్పులు చెరిగారు. ఈ విషయంపై సభలో ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని చెప్పారు.

రీయింబర్స్‌మెంట్‌పై పోరాడండి..
నిరుపేద పిల్లల ఉన్నత చదువుకు అలంబనగా నిలిచే ఫీజు రీయింబర్స్మెంట్ స్కీమ్‌ను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నదని కేసీఆర్ ధ్వజమెత్తారు. బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులు ఇబ్బందుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ సమస్యపై అసెంబ్లీలో విద్యార్థుల తరఫున గొంతెత్తాలని సూచించారు. పాలిటెక్నిక్ విద్యను భ్రష్టు పట్టించే జీవో 97 తీసుకొచ్చిన దుర్మార్గ కాంగ్రెస్ సర్కార్‌ను అసెంబ్లీ సాక్షిగా ఎండగట్టాలని ఆదేశించారు.
సాంకేతిక విద్యను అభ్యసించిన విద్యార్థులు, వృత్తి నైపుణ్యాన్ని సొంతం చేసుకొని ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకుంటారని చెప్పారు. ఈ పరిస్థితుల్లో సాంకేతిక విద్యను అందించే పాలిటెక్నిక్‌ను స్వార్థ ప్రయోజనాల కోసం బలిపెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని విద్యార్థిలోకం ముందు నిలబెట్టాలని దిశానిర్దేశం చేశారు. ఎన్నికల ముందు నిరుద్యోగులను ఉసిగొల్పి, ఏటా 2 లక్షల ఉద్యోగాలిస్తామని నమ్మబలికిన కాంగ్రెస్ హామీలు ఎక్కడ పోయాయని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఇచ్చిన మోసపూరిత హామీలను నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారని, వారి తరఫున బీఆర్ఎస్ సభ్యులు అసెంబ్లీలో పోరాటం చేయాలని సూచించారు. జాబ్ క్యాలెండర్ అమలు కోసం అసెంబ్లీలో గట్టిగా ప్రశ్నించాలన్నారు.
ఫ్యూచర్‌సిటీ కుట్రలను ఎత్తిచూపాలి
ప్రపంచస్థాయి నాణ్యతతో కూడిన ఫార్మా ఇండస్ట్రీని పెద్ద ఎత్తున నెలకొల్పే లక్ష్యంతో నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫార్మాసిటీని రద్దు చేసిన కాంగ్రెస్ సర్కార్, పేదల భూములను రియల్ ఎస్టేట్ దందా కోసం ఉపయోగించుకొనే విధంగా ఫ్యూచర్‌సిటీ పేరిట భారీ అవినీతి వ్యవహారానికి తెరలేపిందని కేసీఆర్ విరుచుకుపడ్డారు. ఈ సమస్యపై ఉభయసభల్లో ప్రస్తావించి ప్రభుత్వాన్ని కడిగిపారేయాలని సూచించారు. తెలంగాణ సిరుల వెలుగు సింగరేణి గనుల్లో అవినీతి పెచ్చుమీరిందని, కాంగ్రెస్ ప్రభుత్వం గనులను కుంభకోణాలకు నెలవుగా మార్చిందని తూర్పారబట్టారు.
ప్రభుత్వ అవినీతిని ఉభయసభల సాక్షిగా బయటపెట్టాలని సూచించారు. ప్రభుత్వ భూ ములను భవిష్యత్తు అవసరాలకు ఏమా త్రం మిగల్చకుండా, ఇష్టారాజ్యంగా అమ్మకాలు చేపడుతున్న ప్రభుత్వ చర్యలను బహిర్గతం చేయాలని ఆదేశించారు. సజావుగా నడుస్తున్న మెట్రో రైలు నిర్వహణను అనాలోచిత విధానాలతో రాష్ట్ర ప్రభుత్వం తన చేతిలోకి తీసుకున్నదని విమర్శించారు. తద్వారా రాష్ట్ర ఖజానాపై విపరీతమైన భారాన్ని మోపడమే గాకుండా, నిర్వహణ చేతగాని పరిస్థితుల్లోకి నెట్టిందని మండిపడ్డారు. ఇలాంటి సర్కార్ తప్పుడు నిర్ణయాలను శాసనసభ, మండలిలో ప్రశ్నించాలని స్పష్టంచేశారు. గోదావరి- కావేరి నదుల లింకు ప్రాజెక్టు పేరుతో రాష్ట్రానికి తీవ్ర నష్టానికి ఒడిగడుతున్న రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై ఉభయసభల్లో ప్రశ్నించాలని ఆదేశించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లపై కుట్రలను ఎత్తిచూపాలని చెప్పారు.

విద్యారంగంపై ప్రభుత్వ కుట్రలు
విద్యారంగంలో అనాలోచిత నిర్ణయాల ద్వారా ప్రభుత్వ పాఠశాలలను తగ్గించే కుట్ర చేస్తూ, రాష్ట్ర విద్యా విధానానికి విఘాతం కలిగిస్తున్నారని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. గురుకులాలను అత్యంత గొప్పగా, ప్రపంచ స్థాయి విద్యాకేంద్రాలుగా తీర్చిదిద్దిన చరిత్ర బీఆర్ఎస్ సర్కార్కే దక్కిందని గుర్తుచేశారు. బడుగు, బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులను ప్రపంచస్థాయిలో పోటీకి తట్టుకొని, ఉన్నత ఉద్యోగాలు సంపాదించుకొని, సుందరమైన భవిష్యత్తును నిర్మించుకునేందుకు వీలుగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు వేలాది గురుకులాలను స్థాపించామని చెప్పారు. కాంగ్రెస్ వచ్చాక గురుకులాల నిర్వహణను గాలికొదిలేసిందని ధ్వజమెత్తారు. విద్యార్థుల మరణాలపై తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు.
ఈ సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించాలని సూచించారు. శాంతిభద్రతలు అదుపు తప్పాయని, మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని, ఈ సమస్యల మీద రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని చెప్పారు. బంధుప్రీతి, ఆశ్రితపక్షపాతంతో కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ వ్యవస్థలను అవినీతిమయంగా మార్చి పాలన కొనసాగిస్తున్నారని, అవినీతి వ్యవహారాలపై ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలని చెప్పారు.
ఎన్నికల ముందు నిరుద్యోగులను ఉసిగొల్పి, ఏటా 2 లక్షల ఉద్యోగాలిస్తామని నమ్మబలికిన కాంగ్రెస్ హామీలు ఎక్కడ పోయినయ్? రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగ యువత ఆందోళన చెందుతున్నది. కాంగ్రెస్ మోసపూరిత హామీలను నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నరు. వారి తరఫున బీఆర్ఎస్ సభ్యులు అసెంబ్లీలో పోరాటం చెయ్యాలె. జాబ్ క్యాలెండర్ అమలు కోసం ప్రశ్నించాలె.
-కేసీఆర్
ఫ్రీ కరెంట్ ఎత్తేసే మోసం
ఉచిత విద్యుత్తుకు ఎసరు పెట్టేలా రైతు డిస్కమ్ పేరిట చేస్తున్న మోసాన్ని ఉభయసభల్లో బట్టబయలు చేయాలని కేసీఆర్ సూచించారు. అడ్డగోలుగా వస్తున్న కరెంట్ బిల్లులు చెల్లించలేక పేదలు, మధ్యతరగతి ప్రజలు ఇప్పటికే బాధ పడుతున్నారని, రాష్ట్రంలో విద్యుత్తు సరఫరా అస్తవ్యస్తంగా మారిందని, రైతు డిసమ్ ఏర్పాటులో వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్తు ఎత్తివేసే కుట్ర దాగి ఉన్నదని తెలిపారు. రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించాల్సిన ప్రయోజనాలను పెండింగ్‌లో పెట్టడం సిగ్గుచేటని నిప్పులు చెరిగారు. తమ జీవితకాలం నిర్వర్తించిన వృత్తిలో దాచుకున్న డబ్బును తిరిగి ఇవ్వడానికి ఈ ప్రభుత్వానికి చేతులు రావడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
కొంతమంది డబ్బు అందక మరణించారన్న వార్తలపై కేసీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. ఉద్యోగులు తమ సమస్యల గురించి అడిగితే రెండేండ్ల పాటు ఏమీ అడగవద్దు అనడం అన్యాయమని వాపోయారు. ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు, పీఆర్సీ పెండింగ్ వంటి సమస్యల మీద అసెంబ్లీలో ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. దాదాపు 3 గంటలు సాగిన సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మం డలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్లు తన్నీరు హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, మండలి ఉప నాయకులు, ఎమ్మెల్సీలు ఎల్ రమణ, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
రాష్ట్రంలో కరువు మేఘాలు కమ్ముకున్న క్రమంలో మిషన్ భగీరథ లాంటి తాగునీటి వ్యవస్థను నిర్వీర్యం చేసి ప్రజల తాగునీటి అవసరాలను తీర్చని ప్రభుత్వానికి సిగ్గుండాలె. ఈ విషయంపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నించాలె.
-కేసీఆర్
రైతులకు అన్యాయం చేస్తే ఊరుకోం
కట్టిన ఇల్లు..పెట్టిన పొయ్యిలా 90 శాతం పాలమూరు ప్రాజెక్టులు పూర్తిచేశామని కేసీఆర్ గుర్తుచేశారు. కృష్ణా జలాలను ఎత్తిపోసి ఉమ్మడి నల్లగొండ, పాలమూరు, రంగారెడ్డి జిల్లాల ప్రజలకు సాగు, తాగునీరు ఎందుకు అందించడంలేదని ప్రశ్నించారు. మేడిగడ్డ రిజర్వాయర్‌కు చిన్న రిపేర్‌చేసి కాళేశ్వరం ప్రాజెక్టును అందుబాటులోకి తెస్తే 13 జిల్లాల్లో రైతులు పంటలు పండించుకుంటారని, కానీ ప్రభుత్వం మాత్రం ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నదో ప్రజలకు తెలియజేయాలని సూచించారు. కాళేశ్వరంపై నిర్లక్ష్యాన్ని కొనసాగిస్తే దగా పడుతున్న రాష్ట్ర రైతాంగానికి సాగునీరందించేందుకు స్వయంగా లక్షలాది మందితో కార్యాచరణ ప్రకటిస్తానని అల్టిమేటం జారీచేశారు.