హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ) : గోదావరి-కావేరి రివర్ లింకు (జీసీ) ప్రాజెక్టులో అంతర్భాగంగా ఏపీ ప్రతిపాదిస్తున్న బనకచర్ల ప్రాజెక్టుకు లైన్‌క్లియర్ చేసేందుకు సర్వం సిద్ధమైనట్టు తెలుస్తున్నది. ఏపీ ప్రతిపాదనలకు ఇప్పటికే తెలంగాణ సర్కార్ సైతం సూత్రప్రాయ అంగీకారం తెలిపినట్టు విశ్వసనీయ సమాచారం. ఈ మేరకు సాంకేతిక అంశాలపైనే సోమవారం ఢిల్లీలో కేంద్ర జల్‌శక్తి శాఖ నేతృత్వంలో జరిగే సమావేశంలో చర్చలు ఉంటాయని సమాచారం. నేటి సమావేశంలో ఆయా అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉన్నది. వాస్తవంగా ఛత్తీస్‌గఢ్ వినియోగించుకోని 148 టీఎంసీలను మళ్లించాలనే లక్ష్యంతో ఎన్డీడబ్ల్యూడీఏ (నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ) గోదావరి కావేరి లింకు ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది.
ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం ఈ మళ్లించే 148 టీఎంసీల జలాల్లో తెలంగాణకు 43, ఏపీకి 44, తమిళనాడుకు 42.5, పుదుచ్చేరికి 2.5, కర్ణాటక రాష్ర్టానికి 16 టీఎంసీలను పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ ప్రతిపాదనలపైనే ఇప్పటివరకు చర్చలు జరిగాయి. ఈ ప్రతిపాదనలపై రాష్ర్టాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. ఇక అదే సమయంలో గోదావరి నుంచి 200 టీఎంసీల వరద జలాలను తరలించేందుకు ఏపీ సర్కార్ పోలవరం-బనకచర్ల లింకు ప్రాజెక్టును తెరమీదికి తీసుకొచ్చింది. సీడబ్ల్యూసీ నిబంధనలు, కేంద్ర ఏజెన్సీల అభ్యంతరాలతో వరద జలాలను కాకుండా ఏకంగా నికర జలాల మళ్లింపుతోనే దీనిని చేపట్టేందుకు సిద్ధమైంది. కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి ఆ దిశగా ప్రణాళికలు సైతం రూపొందించింది. మొత్తంగా జీసీ లింకులో అంతర్భాగంగా బనకచర్ల లింకు ప్రాజెక్టును చేపట్టేలా ప్రతిపాదనలు సిద్ధంచేసింది.
జీసీ లింకులో భాగంగా 148 టీఎంసీలే కాకుండా, సమ్మక్కసాగర్ బరాజ్‌కు కేటాయించిన 47 టీఎంసీలు, పోలవరం ప్రాజెక్టుకు అనుమతుల మంజూరు సమయంలో మినహాయించిన 15 టీఎంసీలు, కర్ణాటకకు కేటాయించిన 16 టీఎంసీలను కలిపి మొత్తంగా 216 టీఎంసీల మళ్లింపునకు ప్రతిపాదనలు రూపొందించింది. ఈ లింకు ప్రాజెక్టులో భాగంగానే ఏపీ తనకు 148 టీఎంసీల్లో వాటాగా వచ్చే 44 టీఎంసీలు కలుపుకొని మొత్తంగా 122 టీఎంసీలను నికరంగా వినియోగించుకునేలా వ్యూహాలను రూపొందించింది. సమ్మక్కసాగర్ బరాజ్‌కు కేటాయించిన 47 టీఎంసీలను వదులుకొంటున్న నేపథ్యంలో తెలంగాణకు పాలమూరుపై ఎన్వోసీ ఇస్తామని ఎర వేసినట్టు తెలిసింది. పోలవరం డైవర్షన్ ద్వారా గతంలో ఉమ్మడి ఏపీకి కేటాయించిన 45 టీఎంసీలను తెలంగాణకే వదులుకొనేందుకు, కర్ణాటక తనకు కేటాయించిన 16 టీఎంసీలను ఎగువనే బెడితి వరద లింకులో వినియోగించుకొనేందుకు అనుమతిస్తామని ఏపీ ప్రతిపాదనలు ముందుపెట్టినట్టు తెలుస్తున్నది. ఇప్పటికే ఆ ప్రతిపాదనలపై పలుమార్లు చర్చలు కొనసాగగా, తెలంగాణ, కర్ణాటక నుంచి సైతం సూత్రప్రాయ అంగీకారం లభించినట్టు విశ్వసనీయ సమాచారం. ఆయా ప్రతిపాదనలకు సంబంధించి ఒప్పంద పత్రాలు సైతం సిద్ధంకాగా, వాటిపైనే చర్చించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబు సైతం ఇదే విషయాన్ని స్వయంగా ప్రకటించడం గమనార్హం.
సీడబ్ల్యూసీ చైర్మన్ అనుపమా ప్రసాద్ నేతృత్వంలో ఢిల్లీలోని సేవాభవన్‌లో ఉదయం 10.30 గంటలకు సమావేశం ప్రారంభమవుతుంది. ఈ భేటీలో తెలంగాణ నుంచి ఇరిగేషన్ శాఖ ప్రభుత్వ సలహాదారు ఆదిత్యానాథ్ దాస్, సెక్రటరీ శ్రీధర్, ఈఎన్సీ రమేశ్‌బాబు, జాయింట్ సెక్రటరీ శ్రీనివాస్, ఏపీ నుంచి జలవనరుల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శశిభూషణ్, సలహాదారు నారాయణరెడ్డి, ఈఎన్సీ నర్సింహమూర్తి, ఏపీ అంతర్రాష్ట్ర జలవిభాగం సీఈ హాజరుకానున్నారు. చర్చలు నామమాత్రమేనని, తదుపరి ముఖ్యమంత్రుల స్థాయిలో జరిగే ఒప్పందాలపైనే ముందస్తు కసరత్తులో భాగమేనని తెలుస్తున్నది.
బనకచర్ల వ్యవహారంలో మొత్తంగా ఏపీ సీఎం చంద్రబాబు వేస్తున్న అడుగులకు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి మడుగులొత్తుతున్నారని స్పష్టంగా తెలిసిపోతున్నది. తెలంగాణ లేవనెత్తున్న అంశాలన్నీ దాదాపు కృష్ణా జలాలకు సంబంధించినవే. పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల డీపీఆర్‌లకు అనుమతులు, నీటి వినియోగ పరిణామాల నమోదుకు టెలిమెట్రీల ఏర్పాటు, ఏపీ చేపట్టిన రాయలసీమ లిఫ్ట్ విస్తరణ, ఔట్‌బేసిన్‌కు జలాల మళ్లింపు అంశాలు ఉన్నాయి. ఇవి రాష్ట్ర విభజన నాటి నుంచీ తలెత్తుతున్న జలవివాదాలే. గత పన్నెండేండ్లుగా అనేకమార్లు విజ్ఞప్తులు సమర్పించడంతోపాటు, ఏపీ ప్రాజెక్టులపై ఫిర్యాదులు చేస్తూనే ఉన్నామని తెలంగాణ ఇంజినీర్లు చెప్తున్నారు. అయినా వివాదాల పరిష్కారానికి గతంలో ఎన్నడూలేని విధంగా కేంద్రం కమిటీ ఏర్పాటు చేస్తే, రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఉత్సాహం చూపడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అది కేవలం ఏపీలోని చంద్రబాబు సర్కార్ చేపట్టనున్న పోలవరం-నల్లమలసాగర్ లింకు ప్రాజెక్టుకు మార్గం సుగమం చేసేందుకు తప్ప మరేమీ కాదని మొదటి నుంచీ తెలంగాణ ఇంజినీర్లు మొత్తుకుంటున్నారు.