ఖైరతాబాద్ నియోజకవర్గంలో గత రెండు ఎన్నికల నుంచి విజయదుందుబి మోగిస్తూ గులాబీ తన జోరును ప్రదర్శిస్తున్నది. ఈ మేరకు హ్యాట్రిక్‌కు కూడా సిద్ధమవుతుంది. దీని వెనుక విశేష ప్రజా స్పందన ఉండటమే కారణం. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నియోజకవర్గంలో 2,96,036 ఓట్లు ఉండగా అందులో 1,54,924 ఓట్లు అంటే 52.33 శాతం పోలయ్యాయి. ఇందులో బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన దానం నాగేందర్‌కు 63,068 ఓట్లు (43.48 శాతం) వచ్చాయి.
రెండో స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి అయిన విజయారెడ్డికి 45,358 ఓట్లు (29.28 శాతం) వచ్చాయి. బీజేపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి మూడో స్థానంలో నిలువగా ఆయనకు 38,094 (24.59 శాతం) ఓట్లు వచ్చాయి. అంటే బీఆర్ఎస్ 22,010 ఓట్ల ఆధిక్యంతో ఖైరతాబాద్‌ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఇదే దానం నాగేందర్ సికింద్రాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఆ లోక్‌సభ పరిధిలోనే ఖైరతాబాద్ అసెంబ్లీ నియోకవర్గం ఉంది. అయితే లోక్‌సభ ఎన్నికల్లో ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి దానంకు కేవలం 45,358 ఓట్లు రాగా… బీఆర్ఎస్ అభ్యర్థిగా నిలిచిన పద్మారావుగౌడ్‌కు 67,368 ఓట్లు వచ్చాయి.
సికింద్రాబాద్ లోక్‌సభ స్థానాన్ని సొంతం చేసుకున్న బీజేపీ అభ్యర్థి కిషన్‌రెడ్డి మూడో స్థానంలో 38,094 ఓట్లు మాత్రమే దక్కించుకున్నారు. దీంతో ఖైరతాబాద్ నియోజకవర్గంలో గులాబీ దూకుడు కొనసాగుతుందని లోక్‌సభ ఎన్నికల్లోనూ తేటతెల్లమైంది. దానం ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తుండటంతో పాటు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ నాగేందర్ బీఆర్ఎస్ అభ్యర్థి కంటే 22,010 ఓట్ల వెనక ఉండిపోయారు. ఈ లెక్కల్ని చూసి ఉప ఎన్నిక భవిష్యత్తును అంచనా వేసిన కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా ఎన్నికను వాయిదా వేయించాలనే ఉద్దేశంతోనే పార్టీ నేత విజయారెడ్డిని మళ్లీ హైకోర్టు మెట్లు ఎక్కించారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. గతంలో నాగేందర్‌పై తాను వేసిన పిటీషన్‌ను తేల్చే వరకు ఉప ఎన్నిక జరగకుండా ఎన్నికల కమిషన్‌ను ఆదేశించాలని ఆమె కోరారు. తీరా.. సాయంత్రానికి ఎన్నికల కమిషన్ సైతం హైకోర్టులో పెండింగులో ఉన్న ఆ అంశం తేలేవరకు తాము ఉప ఎన్నిక నిర్వహించమని తేల్చి చెప్పడంతో నిన్నటిదాకా అనివార్యం అనుకున్న ఖైరతాబాద్ ఉప ఎన్నిక ప్రశ్నార్థకంగా మారింది.