హైదరాబాద్, అక్టోబర్ 1(నమస్తే తెలంగాణ): సిరిసిల్ల బహిరంగ సభ వేదికగా బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు కేవలం ప్రభుత్వ పరిపాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు చేస్తున్న చౌకబారు రాజకీయాలని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్, మాజీ మంత్రి పీ సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు. కేటీఆర్ ఆస్తులపై ఎలాంటి ఆధారాలు లేకుండా మాట్లాడటం సీఎం హోదాలో ఉన్న రేవంత్‌రెడ్డి దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఇటీవల కాలంలోనూ సిరిసిల్ల ప్రాంతంలో కేటీఆర్ దాదాపు 8 వేల ఎకరాల భూమిని ఆక్రమించారని, ఆ బాగోతాన్ని బయటపెడుతామంటూ రేవంత్‌రెడ్డి పెద్దఎత్తున అసత్య ప్రచారం చేశారని గుర్తుచేశారు. సిరిసిల్ల గడ్డపైనే అధికారిక సభ ఏర్పాటు చేసి కూడా, ఆ ఎనిమిది వేల ఎకరాల ఆక్రమణలపై ఏ ఒక ఆధారమూ ప్రజల ముందు ఎందుకు ఉంచలేకపోయారని నిలదీశారు. ఎన్నికల వేళ కట్టుకథలు, అసత్య ప్రచారాలతో ప్రజలను భ్రమల్లోకి నెట్టి ఓట్లు దండుకున్నారని, తీరా అధికారంలోకి వచ్చాక ఆరోపణలను నిరూపించలేక చేతులెత్తేశారని ఎద్దేవా చేశారు.
పరిపాలన చేతగాక..
రాష్ట్రంలో పాలన పూర్తిగా కుంటుపడిందని, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు చెల్లించలేక, రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ బకాయిలు ఇవ్వలేక ప్రభుత్వం చేతులెత్తేసిందని సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు. గ్రామాలు, పట్టణాల్లో అభివృద్ధి పనులు పూర్తిచేసిన చిన్న కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేని దీనస్థితిలో ఉన్న ప్రభుత్వం, ప్రతిపక్ష నేతలపై వ్యక్తిగత దూషణలకు దిగేందుకు కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి సభలు నిర్వహించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
తమ కుటుంబసభ్యుల ఆస్తులతోపాటు ముఖ్యమంత్రి కుటుంబసభ్యుల ఆస్తులపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణకు సిద్ధమని కేటీఆర్ ఇప్పటికే సవాల్ విసిరారని, రేవంత్‌రెడ్డికి దమ్ముంటే ఆ సవాల్‌ను స్వీకరించి వెంటనే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పాలనపై రోజురోజుకూ పెరుగుతున్న తీవ్ర వ్యతిరేకతను తట్టుకోలేకే సీఎం రేవంత్ డైవర్షన్ రాజకీయాలకు తెరలేపారని దుయ్యబట్టారు. ఇప్పటికైనా కక్షసాధింపు చర్యలు పకనబెట్టి, ప్రజలకిచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని సూచించారు.