కాంగ్రెస్ ప్రభుత్వ ‘అబద్ధాల హామీల’పై ఆటోవాలా గర్జించాడు. ఉచిత బస్సు ప్రయాణం కారణంగా ఉపాధి కోల్పోయి వీధిన పడ్డామని, ఇచ్చిన వాగ్ధానాలను నిలబెట్టుకోకుండా.. సర్కార్ దగా చేసిందంటూ.. ఆటో డ్రైవర్లు కదంతొక్కారు. వెయ్యి రోజుల కాంగ్రెస్ విఫల పాలనపై బీఆర్ఎస్ చేపట్టిన పోరుబాటలో భాగస్వాములయ్యారు. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఆదివారం భారీ ర్యాలీలు తీశారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో జరిగిన ఈ సమరభేరిలో ‘ఆటోవాలా’ గర్జనతో గ్రేటర్ వీధులు దద్దరిల్లాయి. కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, లేనిపక్షంలో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు హెచ్చరించారు.

కుత్బుల్లాపూర్‌లో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ఆధ్వర్యంలో సుచిత్ర చౌరస్తా నుంచి జీడిమెట్ల చౌరస్తాలోని గాంధీ విగ్రహం వరకు వందలాది ఆటో కార్మికులతో భారీ ర్యాలీ తీశారు. ఉప్పల్ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో మల్లాపూర్ ఎలిఫెంట్ చౌరస్తా నుంచి హబ్సిగూడ వరకు ఆటో కార్మికులతో నిరసన ర్యాలీ సాగింది.

శాంతి భద్రతలను పరిరక్షించాలని, తీవ్రమవుతున్న ట్రాఫిక్ సమస్యకు పరిషారం చూపాలని డిమాండ్ చేస్తూ మాజీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ శ్రేణులు, ఆటో డ్రైవర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో ఆల్విన్ కాలనీ డివిజన్లో బీఆర్ఎస్ శ్రేణులు, ఆటో డ్రైవర్లు భారీ ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించారు. సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపు మేరకు అమీర్ పేట డివిజన్లో కాంగ్రెస్ బాకీ కార్డుల ప్రదర్శన చేపట్టారు.

రాంగోపాల్ పేట, బన్సీలాల్ పేట డివిజన్లలోని బస్తీ దవాఖానల్లో పర్యటించి స్థానిక సమస్యలు తెలుసుకున్న అనంతరం ఆటో కార్మికులతో కలిసి నిరసన ప్రదర్శన నిర్వహించారు. మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ వైఫల్యాలపై నిరసన ర్యాలీలు చేపట్టారు.

వాజ్పేయినగర్ రైల్వే గేట్ నుంచి సఫిల్‌గూడ, ఆనంద్‌భాగ్ చౌరస్తా, మలాజిగిరి చౌరస్తా మీదుగా మీర్జల్‌గూడ చౌరస్తా వరకు హోరెత్తేలా ర్యాలీ నిర్వహించారు. సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ ఆదేశాలతో వారాసిగూడ చౌరస్తా నుంచి సీతాఫల్మండి, చిలకలగూడ, పార్సిగుట్ట మీ దుగా ద్విచక్రవాహన, ఆటో ర్యాలీ చేపట్టారు. ఇందులో మాజీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

కంటోన్మెంట్లో బీఆర్ఎస్ నేతలు మన్నె క్రిశాంక్ , గజ్జెల నగేశ్, నివేదిత, టీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు మద్దతుగా కార్ఖానా అంబేదర్ చౌరస్తా నుంచి మారేడ్ పల్లి వరకు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి స్వయంగా ఆటో నడుపుతూ చైతన్యపురి బాబు కాంప్లెక్స్ నుంచి చైతన్యపురి క్రాస్ రోడ్డు వరకు ఆటో కార్మికుల మద్దతుతో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు.

కాంగ్రెస్ సర్కార్ వెంటనే ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, లేనిపక్షంలో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని బీఆర్ఎస్ నేతలు స్పష్టం చేశారు. బీఆర్ఎస్ యువనేత ముఠా జయసింహ ఆధ్వర్యంలో ఎడ్ల హరిబాబు, ఎంఎం శ్రీనివాసరావు, బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని నిరసన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను పూర్తిగా ముంచిందని, ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు.

మేడ్చల్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని మేడ్చల్, మల్కాజిగిరి, కూకట్పల్లి, ఉప్పల్, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లో ఆటో కార్మికుల ర్యాలీల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి బీఆర్ఎస్ నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హెచ్చరించారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో జరిగిన ఆటో ర్యాలీలో ఆటో కార్మికులకు బాకీ పడ్డ రూ. 36 వేలను ఎప్పుడు చెల్లిస్తారని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ, వివేకానంద్ ప్రభుత్వాన్ని నిలదీశారు.

మల్కాజిగిరి నియోజకవర్గంలో జరిగిన ర్యాలీలో ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలకు అనేక హామీలు ఇచ్చి మోసం చేసిందని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి విమర్శించారు. కూకట్పల్లి నియోజకవర్గంలో జరిగిన నిరసన కార్యక్రమంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మండిపడ్డారు. ఉప్పల్ నియోజకవర్గంలో జరిగిన ఆటో ర్యాలీలో ప్రజా సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాటం చేస్తామని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి హెచ్చరించారు.