సాధారణంగా ప్రతి నెల ఒకటో తేదీనే వేతనాలు చెల్లించే సంప్రదాయం ఉండగా.. నెలలో రెండో వారం గడుస్తున్న ట్రై కార్పొరేషన్ల పరిధిలో కొందరు కార్మికులు, ఉద్యోగులకు వేతనాలు అందలేదు..విభజన సమయంలో తలెత్తిన సాంకేతిక సమస్యలు, డేటా మ్యాపింగ్ చివరకు సామాన్య ఉద్యోగులకు ఇబ్బందిగా మారింది. జీతాలు లేక వేలాది మంది కార్మికులు పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈఎంఐలు, ఇంటి అద్దెలు, పిల్లల స్కూల్ ఫీజులు చెల్లించలేక అల్లాడిపోతున్నామని కార్మికులు చెబుతున్నారు. ఈఎంఐలు కట్టలేక సిబిల్ స్కోరు దెబ్బ తింటోందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా శానిటేషన్ పనులు నిర్వర్తిస్తున్న సిబ్బందికి రెండు నెలలుగా జీతాలు అందక అవస్థలు పడుతున్నారు.
సిటీబ్యూరో/మల్కాజిగిరి, మార్చి 11 (నమస్తే తెలంగాణ) : మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ యాప్రాల్ వార్డులో పనిచేస్తున్న శానిటేషన్ సిబ్బందికి వేతనాలు అందకపోవడమే ఇందుకు నిదర్శనం. గతంలో మల్కాజిగిరి సర్కిల్ పరిధిలో ఉన్న యాప్రాల్ వార్డు, విభజనలో భాగంగా కొత్తగా ఏర్పడిన కీసర సర్కిల్లో కలిపారు. అల్వాల్, మల్కాజిగిరి సర్కిల్స్ పరిధిలోని ప్రాంతాలు కలిసి యాప్రాల్ వార్డు ఏర్పాటు చేశారు. దీనితో వేతనాలు ఎక్కడ నుంచి తీసుకోవాలో అర్ధం కాక శానిటేషన్‌లో పనిచేసే సిబ్బంది అయోమయానికి గురవుతున్నారు.
పాత సర్కిల్వారు మాకు సంబంధంలేదని, కొత్త సర్కిల్ వారు మాకు వివరాలు లేవని, సాంకేతిక సమస్యలతో జాప్యం చేస్తున్నారు. వార్డు పరిధిలో సుమారు 20 నుంచి 22 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. వీరికి సరైన లెక్కలు లేవని, వివరాలు సరిగాలేవనే కారణంతో వేతనాలు నిలిచిపోయినట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని మల్కాజిగిరి జోన్ జోనల్ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లారు. అసలే పేదరికం, చాలిచాలని వేతనాలు, సమయానికి అందక వారు అవస్థలు పడుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి తమకు వేతనాలు ఇప్పించాలని కోరుతున్నారు.
ఎంటమాలజీలో శ్రమ దోపిడీ
ఎలాంటి రక్షణ చర్యలు లేకుండా రసాయనాల స్ప్రే చేస్తూ ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న కార్మికుల విషయంలోనూ శ్రమ దోపిడీకి జరుగుతున్నది. కరోనా సమయంలో వీఐపీ, వీవీఐపీలు నివసించే ప్రాంతాల్లో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కెమికల్స్ స్ప్రే చేసేందుకు దాదాపు 220 మంది కార్మికులను తాత్కాలిక ప్రాతిపదికన జీహెచ్ఎంసీ నియమించింది. తొలుత వీరిని ఏడాది పనికాలంతో నియమించుకున్నా..విపత్కర సమయంలో ప్రమాదం అంచునా విధులు నిర్వర్తించిన ఈ కార్మికులను అప్పటి కమిషనర్ లోకేశ్‌కుమార్ ఏటా ఎక్స్టెన్షన్ (పొడగిస్తూ) వచ్చారు.
నిబంధనల ప్రకారం ఈ కార్మికులకు రూ.21వేల జీతం చెల్లిచాల్సిన ఉండగా, వీరి పనితీరును పర్యవేక్షిస్తున్న సూపర్వైజర్లు, అసిస్టెంట్ ఎంటమాలజిస్ట్లతో పాటు జోన్‌కు ఒకరున్న సీనియర్ ఎంటమాలజిస్టులు జీతాల చెల్లింపులో తమ హస్తలాఘవాన్ని ప్రదర్శిస్తూ సగం జీతమే చెల్లిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కొందరికి రూ.9వేలు, మరికొందరికి రూ.10వేలు చెల్లిస్తూ గరిష్టంగా రూ.11వేల వరకు జీతాలు చెల్లిస్తూ శ్రమ దోపిడీకి పాల్పడుతున్నట్లు ప్రచారం జరుగుతున్నది. అయితే ఈ కార్మికుల కాంట్రాక్ట్ ఏజెన్సీల గడువు వచ్చే నెలాఖరుతో ముగియనుండడంతో సంబంధిత ఎజెన్సీల నుంచి బకాయిలను రీకవిరీ చేయాలని బాధిత కార్మికులు కోరుతున్నారు.