SC Reservations | హైదరాబాద్, ఆగస్టు4 (నమస్తే తెలంగాణ): ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను వర్గీకరించే అధికారం రాష్ర్టాలకు ఉన్నదంటూ ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో తెలంగాణలో ఎలా అమలు చేస్తారనేది ఆసక్తికరంగా మారిం ది. ఇప్పటికప్పుడు ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చి రాష్ట్రంలో అమలు చేస్తామని అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. అది అంత సులువు కాదని, అనేక సవాళ్లు ఉన్నాయని ద ళిత మేధావులు అభిప్రాయపడుతున్నారు. సవాళ్లను అధిగమించాలంటే సమగ్ర కులగణన ఒక్కటే పరిష్కారమని చెప్పుతున్నారు.
కమిషన్ వేస్తారా?
ఎస్సీలకు రాజ్యాంగబద్ధంగా 15% రిజర్వేషన్ అమలవుతున్నది. ఆ కోటాలో మాలలే ఎకువగా లబ్ధి పొందుతున్నారంటూ మాదిగ లు పోరాటబాట పట్టడంతో 1995లో అప్పటి ప్రభుత్వం జస్టిస్ రామచంద్రరాజు కమిషన్‌ను నియమించింది. మాదిగల వాదనను సమర్థిస్తూ ఆ కమిషన్ 1996లో నివేదిక సమర్పించింది. దాని ఆధారంగా ఎస్సీ కోటాను ఏ, బీ, సీ, డీగా విభజించారు. 2000లో ఉమ్మడి ఏపీ ప్రభుత్వం ఎస్సీలను వర్గీకరిస్తూ రిజర్వేషన్ల హేతుబద్ధీకరణ చట్టం చేసింది. అయితే ఆ అధికారం రాష్ర్టాలకు లేదంటూ సుప్రీంకోర్టు 2004లో కొట్టివేసింది. అనంతరం సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వశాఖ ఉషామెహ్రా కమిషన్‌ను ఏర్పాటుచేసింది. రాజ్యాం గ సవరణ ద్వారా రాష్ర్టాలు కులాల వర్గీకరణ ను చేపట్టవచ్చని కమిషన్ సిఫారసు చేసింది. అది అమలుకు నోచుకోలేదు. అవేవీ లేకుండానే ఎస్సీ రిజర్వేషన్‌ను వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ర్టాలకు ఉన్నదని తాజాగా సు ప్రీంకోర్టు తీర్పు చెప్పింది. వర్గీకరణను అమ లు చేయాలంటే ప్రత్యేకంగా కమిషన్‌ను ఏర్పా టు చేయాల్సి ఉంటుందని న్యాయకోవిదులు అభిప్రాయపడుతున్నారు. సామాజిక, ఆర్థిక వెనకబాటుతనాన్ని తొలగించి, సమాన అవకాశాలను కల్పించాలన్నదే రాజ్యాంగంలోని అధికరణలు 15, 16 ఉద్దేశమని వివరిస్తున్నా రు. ఎస్సీల్లోని కులాలవారీగా అసమాన తలను గుర్తించాలని, ఆ తరువాతే ఏబీసీడీల వర్గీకరణ సాధ్యమవుతుందని చెప్తున్నారు.
రాష్ట్రంలో కొన్ని కులాలు లేనేలేవు
తెలంగాణలో అధికారికంగా గుర్తింపు పొందిన ఎస్సీ ఉపకులాల సంఖ్య 59. ‘ఏ’ గ్రూపులో రెల్లి, దాని అనుబంధ కులాలు సహా మొత్తం 12 కులాలను కలుపుతూ వారికి 1% కోటా ఇచ్చారు. వాటిని అట్టడుగు స్థానంలో ఉన్న కులాలుగా గుర్తించారు. ‘బీ’ గ్రూపులో మాదిగ, దాని ఉపకులాలు మొత్తం 18 కులాలను చేరుస్తూ వారికి 7% కోటా, ‘సీ’లో మాల, దాని ఉపకులాలు మొత్తం 25 కులాలను చేరుస్తూ వారికి 6% కోటా, ‘డీ’లో ఆది ఆంధ్రులతోపాటు మొత్తం 4 కులాలను చేర్చి, 1% కోటా నిర్ణయించారు. అయితే ప్రస్తుతం ఇందులోని కొన్ని కులాలు రాష్ట్రంలోనే లేవని దళిత మేధావులు చెప్తున్నారు.
ఉపకులాలకు సర్టిఫికెట్లేవీ?
తెలంగాణలో మొత్తం 59 ఎస్సీ కులాల్లో మాల, మాదిగ మినహా 57 ఉపకులాలున్నా యి. దశాబ్దాలుగా 52 ఉపకులాలకు సర్టిఫికెట్లే జారీ చేయని పరిస్థితి క్షేత్రస్థాయిలో నెలకొన్న ది. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలుకు ఎదురవుతున్న సవాళ్లన్నింటికీ కులగణన ఒక్కటే పరిష్కారమని దళిత మేధావులు స్పష్టంచేస్తున్నారు. 2011 జనాభా లెకల ప్రకారం ఎస్సీల సంఖ్య 54.08 లక్షలు. 2014లో ఆ సంఖ్య 64.44 లక్షలుగా తేలింది. ఇప్పటివరకు జనాభా లెకల్లో ఎస్సీ, ఎస్టీలుగా గణిస్తున్నారే తప్ప ఉపకులాల వివరాలకు, సామాజిక, ఆర్థిక స్థితిగతులకు ప్రాధాన్యం ఇవ్వడం లేదు. ఏబీసీడీ వర్గీకరణను అమలు చేయాలంటే సుప్రీంతీర్పు ప్రకారం ముందుగా ఎస్సీ జాబితాలోని కులాల లెక్క తీయాల్సి ఉంటుంది. ఎస్సీ వర్గీకరణ అంశం అనేక సవాళ్లతో కూడుకుని ఉండటంతో అందరి చూపు ప్రభుత్వం వైపే ఉన్నది.
కులగణన చేపట్టాల్సిందే
ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణను అందరూ స్వాగతించాల్సిందే. ఇందుకోసం ప్రభుత్వం ఎస్సీ కులగణనను నిర్వహించాలి. ఇప్పటివరకు ఎస్సీ రిజర్వేషన్ల ద్వారా ఎక్కువగా మాల, మాదిగకులాలే పూర్తిగా లబ్ధిపొందాయి. ఇత ర వెనకబడ్డ 57 ఉపకులాలు తీవ్రంగా నష్టపోయాయి. ఏ ఒక కులానికి మరో కులం ఉపకులం కాదు.
-వెంకటేశం, ఎస్సీ ఉపకులాల హకుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు
వర్గీకరణతో సమాన అవకాశాలు కల్పించాలి
ఎస్సీ వర్గీకరణకు రాష్ర్టాలకు అధికారం క ల్పిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఎస్సీల్లోని అన్ని కులాలు సమాన అవకాశాలను పొందేందుకు మార్గం సుగమమైంది. ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పు అమలుకు చర్యలు చేపట్టాలి. తీర్పు అమలుకు మొట్టమొదటగా రాష్ట్రంలోని ఎస్సీ కులాల జనాభా లెక్కలను, ఆర్థిక, సామాజిక స్థితిగతులను వెలికితీయాలి. – డాక్టర్ శ్రీనివాస్,ఎస్సీ మేధావుల ఫోరం అధ్యక్షుడు
ఎస్సీ ఉప వర్గీకరణ తీర్పుపై అప్పీల్ చేస్తాం ;కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్
ఎస్సీ రిజర్వేషన్లను ఉప వర్గీకరించేందుకు రాష్ర్టాలకు అనుమతిస్తూ సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును వ్యతిరేకిస్తున్నట్టు ‘లోక్ జనశక్తి పార్టీ’ (రామ్‌విలాస్) నేత, కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్ పేర్కొన్నారు. ఈ తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీలు చేయనున్నట్టు స్పష్టం చేశారు. దళితుల కోటాలో క్రిమీలేయర్‌ను తీసుకురావటాన్ని కూడా వ్యతిరేకిస్తున్నామన్నారు. దళితులకు క్రిమీలేయర్ నిబంధనను వర్తింపజేసేలా ఎలాంటి ప్రయత్నం జరిగినా, దానిని అడ్డుకుంటామని కేంద్రమంత్రి, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు రామ్‌దాస్ అథవాలే హెచ్చరించారు. అయితే ఎస్సీల రిజర్వేషన్ల వర్గీకరణతో.. వారిలో అత్యంత వెనుకబడిన వారికి న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.