సిద్దిపేట, మార్చి 14(నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు కష్టాలు తప్పడం లేదు. విత్తు విత్తిన నాటి నుంచి పంట కోతకు వచ్చి అమ్ముకునేదాకా అన్నీ కష్టాలే. రైతుల సంక్షేమం గురించి ఏనాడు ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. మరో నెల రోజులైతే యాసంగి పంట చేతికి వస్తుంది.
ఇంతవరకు రైతు భరోసా ఊసే లేదు. యాసంగి పంటకు కాళేశ్వరం జలాలు ఇవ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. సిద్దిపేట జిల్లాలోని రిజర్వాయర్లలో నీళ్లు ఖాళీ అవుతున్నాయి. ఇంతవరకు చివరి ఆయకట్టుకు నీరు అందని పరిస్థితి. నీళ్లు ఎటు పోతున్నాయి? ఎటు పంపించాలి అనే ప్రణాళిక లేకుండా ఇష్టారీతిగా సాగు నీటిని విడుదల చేయడంతో చాలావరకు నీరు వృథాగా పోయిందని రైతులు వాపోతున్నారు. కాల్వల్లో చెత్తాచెదారం పేరుకుపోయినా రెండేండ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. పిల్ల కాల్వల పనులు ఎక్కడికక్కడ అసంపూర్తిగా నిలిచిపోయాయి.
దీంతో పంటపొలాలకు నీరు చేరని పరిస్థితి నెలకొన్నది. ఉన్న కాల్వల్లో చెత్తా చెదారం తీయించలేదు. ఫలితంగా నీళ్లు ముందుకు వెళ్లని పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేని పనిని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు రైతుల కోసం తన సొంత ఖర్చులతో కాల్వల్లో జేసీబీలతో పేరుకుపోయిన చెత్తను తొలిగింపజేయడంతో పాటు నీళ్లు వెళ్లని ప్రాంతాలకు పెద్ద మిషన్ పెట్టి నీటి కాల్వలు తవ్వించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక ప్రాంతంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు.
సాగునీటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు భరోసా కల్పించడం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన ప్రధాన కాల్వలతో పాటు పంట కాల్వల్లో మట్టి, చెత్తాచెదారం, పిచ్చి మొక్కలు పేరుకుపోయాయి. వీటిని తొలిగించకుండానే అరకొరగా నీటిని విడుదల చేయడంతో పూర్తి స్థాయిలో రైతుల పంట పొలాలకు నీళ్లు చేరడం లేదు. చెరువులు ఎంపోతున్నాయి.
తద్వారా భూగర్భజలాలు అడుగంటుతున్నాయి. కాల్వల్లో చెత్తాచెదారం ఉండడంతో సాగునీరు ఎలా పంట పొలాలకు చేరుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. సాగునీటి అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. కొన్ని గ్రామాలకు నీళ్లు వదలడం.. మరికొన్ని గ్రామాలకు వదలకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పది రోజుల నుంచి ఎండలు తీవ్రం కావడంతో పంట పొలాలకు నీళ్లు సరిగ్గా అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్తిస్థాయిలో సాగునీటిని విడుదల చేయకపోతే పంట పొలాలు పూర్తిగా ఎండే పరిస్థితులు ఉత్పన్నమవుతాయని రైతులు వాపోతున్నారు.
సిద్దిపేట జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టు కింద నిర్మించిన ప్రధాన రిజర్వాయర్లలో నీటిశాతం రోజు రోజుకూ తగ్గుతున్నది. ప్రస్తుతం రంగనాయకసాగర్‌లో 1.4 టీఎంసీలు, అన్నపూర్ణలో 2.79 టీఎంసీలు. మల్లన్నసాగర్లో 19 టీఎంసీలు, కొండపోచమ్మలో 9 టీఎంసీల నిల్వలు ఉన్నాయి. మరికొద్ది రోజుల్లో నీరంతా ఖాళీ కానున్నది. దీంతో డెడ్ స్టోరేజీ వాటర్పోను మిగిలేది కొంత నీరు మాత్రమే అని చెప్పాలి. మరో వారం రోజుల్లో అన్నపూర్ణ నుంచి నీటిని విడుదల చేస్తేనే చివరి పంటకు నీళ్లు అందుతాయి.
ఉమ్మడి జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల కింద ఉన్న కాల్వలు పూడికతో నిండిపోయాయి. సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాలోని పలు గ్రామాల్లోని చెరువులను కాళేశ్వరం జలాలతో నింపా లి కానీ ప్రణాళిక లేకుండా చేస్తున్నారు. భారీ, మధ్యతరహా, చిన్న కాల్వలను బీఆర్ఎస్ ప్రభు త్వం నిర్మించి ప్రతి చెరువుకు నీళ్లు పోయేలా చేసింది. కాల్వల నిర్వహణను చూసుకోవాల్సిన అధికారులు గాలికి వదిలేశారు. యాసంగి పంటకు సాగు నీరు ఇవ్వాల్సిన ప్రభుత్వం ఏదో విడిచామా? అంటే విడిచాము అన్నట్లుగా వ్యవహరిస్తున్నదని రైతులు ఆరోపిస్తున్నారు.
సిద్దిపేట నియోజకవర్గంలోని రైతుల పంటలు కాపాడటం కోసం మాజీ మంత్రి హరీశ్‌రావు తన సొంత ఖర్చులతో పంట కాల్వల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలిగింపజేస్తున్నారు. ప్రభుత్వాలు చేయాల్సిన పనులను ఎమ్మెల్యే తన సొంత ఖర్చులతో చేయడం గమనార్హం. సిద్దిపేట నియోజకవర్గంలోని నారాయణరావుపేట, సిద్దిపేట రూరల్, సిద్దిపేట అర్బన్, చిన్నకోడూరు, నంగునూరు మండలాల రైతులకు భరోసా కల్పిస్తున్నారు. వేసిన పంటలు ఎండిపోకుండా ప్రతి గుంటను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. జేసీబీలు, ఇతర పెద్ద యంత్రాలు ఉపయో గించి పనులు చేయించడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఐదు ఎకరాల పొలం ఉంది. నాలుగు రోజుల నుంచి నీళ్లు సరిగ్గా రాక వరుస తడులతో పొలాన్ని తడుపుతున్నా. అంకంపేట చెరువులోకి నీళ్లు వస్తేనే మా పంటలు పండుతాయి, లేదంటే పెట్టుబడి కూడా రాదు. పొలం ఎండిపోయి నెర్రెలు పారడం మొదలైంది. బావిలో ఉన్న కొద్ది నీరుతోనైనా వరుస తడులు పెడదామంటే నిన్న ట్రాన్స్ఫార్మర్ను మరమ్మతుకు తీసుకువెళ్లాం. ఇప్పటికైనా నీటిని వదిలి చెరువు నింపాలి, లేకుంటే పంటలు ఎండిపోయి తీవ్రంగా నష్టపోతాం.
– గజ్జల లక్ష్మీనారాయణ, రైతు, అంకంపేట, సిద్దిపేట రూరల్ మండలం, సిద్దిపేట జిల్లా
నీళ్లు లేక వరిపంటలు ఎండిపోతున్నాయి. ఇప్పటికే వరుస తడులతో పంటను కాపాడుకుంటున్నాం. అంకంపేట చెరువు కాల్వ తీశారు. ఇంకో పది గజాలు కాలువ తవ్వితే మా ఊరు చెక్‌డ్యామ్‌లోకి నీళ్లు వస్తాయి. దీంతో భూగర్భ జలాలు పెరిగి పంట పొలాలకు నీరు అందుతుంది. ప్రభుత్వం మిగిలిపోయిన కాలువ తీసి చెక్ డ్యామ్ నింపి మా పంటలు కాపాడాలి. ఇప్పుడు పంటలు కాపాడుకునేందుకు లక్ష్మీదేవిపల్లి వద్ద ఉన్న కెనాల్ నుంచి ముగ్గురం, నాలుగురం కలిసి తలా రూ.50 నుంచి రూ. 60వేలు ఖర్చు చేసి పైప్‌లైన్ వేసి పంటలకు నీళ్లు పెడుతున్నా సరిపోవడం లేదు.
– మంత్రి యాదగిరి, రైతు, బచ్చాయిపల్లి, సిద్దిపేట రూరల్ మండలం (సిద్దిపేట జిల్లా)
మల్లన్నసాగర్ కాల్వ నుంచి అంకంపేట చెరువులోకి నీళ్లు వదిలి పంటలు కాపాడాలి. ఇప్పటికే వరుస తడులతో వరి పంటను కాపాడుకుంటున్నాం. దండం పెట్టి చెబుతున్నా చెరువు నింపి పంటను కాపాడాలి. బీఆర్ఎస్ హయాంలో ఫిబ్రవరి నాటికే చెరువు నిండుగా ఉండేది. నీటి కోసం ఇప్పటికే ధర్నా, రాస్తారోకోలు చేసినా అధికారులు స్పందించడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి చెరువు నింపి పంటలు కాపాడాలి. చెరువు కింద 100 నుంచి 150 ఎకరాల ఆయకట్టు ఉంది. నీటిపారుదల అధికారుల పర్యవేక్షణ లేక మల్లన్నసాగర్ నుంచి నీటి విడుదలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.
– వెన్నెల భగవాన్‌రెడ్డి, రైతు, అంకంపేట, సిద్దిపేట రూరల్ మండలం (సిద్దిపేట జిల్లా)