‘రాకుమారి నీ వశమవుతుందిరా.. ’ అని ఎస్వీయార్ కన్నింగ్ కండ్లు తిప్పుతూ అనేసరికి! అంతటి ఎన్టీయార్.. ప్రేమ కోసమై నేపాల మాంత్రికుడి వలలో పడిపోయాడు. సాహసం శాయడానికి సిద్ధమయ్యాడు! ఆ సాహసమే.. ‘పాతాళభైరవి’గా వెండితెరపై బంగారు కాంతులీనింది. ‘నిజం చెప్పమంటారా! అబద్ధం చెప్పమంటారా!’ పాతాళభైరవి గురించి కొన్ని నిజాలు చెబితే.. ఎహె అబద్ధం అనుకుంటారు ఇప్పటికీ! కానీ, ఈ సినిమా వెనుక నమ్మలేని నిజాలు కొన్నున్నాయి! ఆ నిజానిజాలు ఇప్పుడెందుకు? అంటారా!! మన తోటరాముడు వెండితెర సంచలనంగా మారి అచ్చంగా నేటికి 75 ఏండ్లు పూర్తయింది.
తోటలో హీరో.. కోటలో హీరోయిన్ హిట్ ఫార్ములాకూ సెవంటీ ఫైవ్ ఇయర్స్ నిండాయి. తెలుగు హీరోకు ‘మాస్ ఇమేజ్’ అనే మానియా పుట్టి కూడా ఇన్నే ఏండ్లయింది. మొత్తంగా టాలీవుడ్లో కమర్షియల్ సినిమాకు తొలిగా
నిర్వచనం ఇచ్చిన మన ‘పాతాళభైరవి’ వజ్రోత్సవ సంబురం జరుపుకొంటున్నది. ఆ చిత్ర రాజం విశేషాలను తలుచుకోవడం.. జనం కోరేది మనం ఇవ్వడమే అవుతుంది.
ప్రస్తుతం వస్తున్న మాస్ హీరోలంతా తోటరాముడి సంతతే అన్నారు ముళ్లపూడి వెంకటరమణ. ఆయన అన్నమాటలో అక్షరం కూడా తప్పులేదు. సాధారణమైన తోటమాలి కొడుకు యువరాణిని ప్రేమించడమేంటి? కోట బురుజులు దూకి మహారాజుకు సవాలు విసరడమేంటి? నేపాల మాంత్రికుడి చెర నుంచి రాజకుమారిని విడిపించి ధీరోదాత్తుడిగా నిలవడమేంటి? నిజంగా తెలుగుతెరపై తోటరాముడు లాంటి హీరోని అప్పటివరకూ జనం చూడలేదు. నేటికీ ఓ మాస్ హీరోని ఎస్టాబ్లిష్ చేయాలంటే తోటరాముడు ఫార్ములాని ఫాలో
అవ్వాల్సిందే! హీరోయిజం పర్ఫెక్ట్గా ఎలివేట్ అవ్వాలంటే, హీరోకంటే విలన్ శక్తిమంతుడై ఉండాలి అనేది కమర్షియల్ ఫార్ములా. ‘పాతాళభైరవి’ సినిమా విషయంలో కేవీ రెడ్డి అనుసరించింది ఇదే. ఓ వ్యక్తి జీరోగా మొదలై.. హీరోగా మారే పరిణామక్రమమే ‘పాతాళభైరవి’.
‘జనం మెచ్చింది మనం శాయవలెనా.. మనం మెచ్చింది జనం చూడవలెనా..’ అనేది పాతాళభైరవి సినిమాలో పింగళి రాసిన డైలాగ్. నిజానికి ఈ డైలాగ్ వెనుక పెద్ద కథే ఉంది. ‘పాతాళభైరవి’కి ముందు విజయా సంస్థ తీసిన చంద్రహారం, షావుకారు సినిమాలు పెద్దగా ఆడలేదు. ముఖ్యంగా ‘చంద్రహారం’ సినిమాకు నాగిరెడ్డి, చక్రపాణి డబ్బు మంచినీళ్ల ప్రాయంగా ఖర్చుపెట్టారు. కానీ, ఏ మాత్రం గిట్టుబాటు కాలేదు. దాంతో మనం మెచ్చిన కథలతో కాదు, జనం మెచ్చే కథలతోనే సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నారు విజయాధినేతలు. కస్తూరి శివరావ్ హీరోగా ‘గుణసుందరి కథ’ అనే జానపద చిత్రాన్ని తీసి, అఖండ విజయాన్ని అందుకున్న కేవీ రెడ్డిని దర్శకుడిగా ఎంచుకున్నారు.
రచయితగా పింగళి ఎలాగూ ఉన్నారు. కేవీ రెడ్డి, పింగళి కలిసి రామాయణం, అల్లావుద్దీన్ కథల ప్రేరణతో ‘పాతాళభైరవి’ కథ వండారు. అంతా బాగానే ఉంది. మరి ఇందులో నటించే తారలెవరు? అప్పటివరకూ జానపద కథానాయకుడంటే ఏఎన్నారే. ఆయన హీరోగా, అంజలి హీరోయిన్గా, గోవిందరాజుల సుబ్బారావు నేపాల మాంత్రికుడిగా సినిమా చేద్దామనేది నిర్మాతల ఉద్దేశం. కానీ దర్శకుడు కేవీ రెడ్డి ఆలోచన వేరేలా ఉంది. ‘నా తోటరాముడు ఏఎన్నార్ కాదు..’ అని కరాఖండీగా చెప్పేశారట. ఆడిషన్స్ నిర్వహించారు. ఒడ్డూపొడుగూ బావుండటంతో రాజారెడ్డి అనే కుర్రాడ్ని హీరోగా అనుకున్నారు. కానీ.. అతనికి కాస్త నత్తి. దాంతో కథ మొదటికి వచ్చింది. సమయం గడిచిపోతున్నది. నిర్మాతలకు చిరాకు మొదలైంది. ఆ రోజు సాయంత్రం చెన్నై విజయా గార్డెన్స్‌లో జరిగింది ఆ అద్భుతం.
నిర్మాతలు నాగిరెడ్డి, చక్రపాణి, దర్శకుడు కేవీ రెడ్డి, రచయిత పింగళి కూర్చొని తీరిగ్గా మాట్లాడుకుంటున్నారు. ఆ పక్కనే కూతవేటు దూరంలో ఇద్దరు యువకులు షటిల్ అడుకుంటున్నారు. ఆ యువకులెవరోకాదు.. ఎన్టీయార్, ఏఎన్నార్. వారి ఆటను గమనిస్తూ ఈ నలుగురు పెద్దలూ మాట్లాడుకుంటున్నారు. ఆటలో ఏఎన్నార్దే పైచేయి. ఎన్టీఆర్ ఓడిపోతూ అసహనానికి లోనవుతున్నారు.
చూస్తున్న నలుగురిలో ముగ్గురి దృష్టి గెలుస్తున్న ఏఎన్నార్‌పై ఉంటే, ఒక్క కేవీ రెడ్డి చూపు మాత్రం ఓడిపోతున్న ఎన్టీఆర్‌పై ఉంది. ఆ బ్యాట్‌ని ఒడిసి పట్టుకునే తీరు, కత్తిలా దాన్ని కదిలించే విధానం, ఆ కదలికలు, ఆ ఉద్రేకం, ఆ శారీరక భాష.. ఎలాగైనా గెలవాలనే ఆ కసి.. వీటన్నింటినీ గమనిస్తున్నారు కేవీ రెడ్డి.. ఆయన చూస్తున్నది ఎన్టీఆర్‌ని కాదు.. తన కథానాయకుడు తోటరాముడ్ని. ఈ విషయాన్నే నిర్మాతలకు చెప్పారు. వారిద్దరూ పెదవి విరిచారు. కానీ కేవీ రెడ్డి మాత్రం పట్టు విడువలేదు. ఎన్టీయార్‌ని ఇస్తేనే సినిమా చేస్తానని నిక్కచ్చిగా చెప్పేశారు. దాంతో అప్పటివరకూ భారీ కాస్టింగ్ అనుకున్న సినిమాను కాస్తా తక్కువ కాస్టింగ్‌తో చేసేద్దామని నిర్మాతలు ఫిక్స్ అయ్యారు. ఏఎన్నార్ ప్లేస్‌లోకి ఎన్టీయార్ రాగా, అంజలి స్థానంలోకి మాలతి వచ్చి చేరింది.
అసలు ఎన్టీయార్ ఈ పాత్రకు న్యాయం చేయగలరా? లేదా? అనేది చూసుకునేందుకు ఇందులోని కీలమైన
‘బొడ్డుదేవర సన్నివేశాన్ని’ తొలుత చిత్రీకరించారు. ఆయన సింగిల్ టేక్‌తో ఆ సీన్ చేయడంతో తోటరాముడిగా ఎన్టీయార్ ఖరారైపోయారు. అప్పటికి ఎన్టీయార్ విజయా సంస్థలో నట ఉద్యోగి. ఆయన జీతం నెలకు రూ.250. ఈ సినిమా తర్వాత ఆయన స్థాయి అమాంతం పెరిగిపోయింది. ఇక గోవిందరాజుల సుబ్బారావు చేయాల్సిన నేపాల మాంత్రికుడి పాత్రకు అప్పటివరకూ చిన్నచిన్న వేషాలు చేస్తున్న ఎస్వీ రంగారావుని ఎంపిక చేశారు.
పాతాళభైరవిలో ‘ఇతిహాసం విన్నారా.. ఆ అతిసాహసులే ఉన్నారా..’ అనే ఓ పాట ఉంటుంది. టీజీ కమలాదేవి స్వయంగా పాడుతూ నటించిన పాట అది. ఆ పాట చివరిలో ‘ఘాటు ఘాటుగా కథ నడిపించగా.. నేటికెవరు మన కథానాయకుడు? నీవా? నీవా? నీవా?’ అని ప్రశ్నిస్తుందామె. జనాల్లో కూర్చొని ఉన్న వల్లం నరసింహారావు లేచి.. ‘ఇంకెవరు మన తోటరాముడు’ అంటాడు. ఇంతలో రాణిగారి తమ్ముడు రేలంగి రావడం..
తోటరాముడు అతని భరతం పట్టడం.. ఆ ఊరి జనాలంతా తోటరాముడి తలపై కిరీటం పెట్టడం.. తెరపై జరుగుతున్న ఈ తతంగం అంతా చూస్తుంటే.. అది తెలుగు సినీసామ్రాట్టుగా ఎన్టీయార్‌కి జరిగిన పట్టాభిషేకంగా అనిపిస్తుంది. నాటి నుంచి 33ఏండ్ల పాటు మకుటం లేని మహారాజుగా తెలుగు సినిమాను శాసించారు ఎన్టీయార్. అంతేకాదు, అంతకుముందు ‘షావుకారు’ సినిమాలో ‘సున్నపు రంగడు’ వంటి చిన్న పాత్ర చేసిన ఎస్వీ రంగారావు ఈ సినిమాతో టాలీవుడ్లో టాప్ విలన్‌గా అవతరించారు. తర్వాతి కాలంలో మహానటుడిగా తెలుగు, తమిళ ప్రజల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించారు. ఆ విధంగా
ఇద్దరు మహానటులకు గట్టి పునాదిగా ‘పాతాళభైరవి’ నిలిచింది.
‘పాతాళభైరవి’ అనగానే కేవీ రెడ్డి తర్వాత చెప్పుకోవాల్సింది.. రచయిత పింగళి నాగేంద్రరావు గురించే. ‘ఎవరూ పుట్టించకపోతే మాటలెలా పుడతాయ్’ అన్నట్టు.. అప్పటివరకూ వాడుకలో లేని కొత్తకొత్త పదాలను సృష్టించి.. ఈ సినిమా ద్వారా జనబాహుల్యంలో వాటిని మమేకం చేసేశారాయన. ‘రేయ్.. డింగరి..’, ‘మోసం గురూ…’, ‘సాహసం సేయరా డింభకా..’, ‘నరుడా.. ఏమి నీ కోరిక’.. ఇలా చెప్పుకొంటూ పోతే ఈ సినిమాలో పింగళివారి మెరుపులు అన్నీ ఇన్నీ కాదు. ఇద్దరు స్నేహితులు కలిస్తే.. ‘ఏం గురూ..’ అని పిలుచుకోవడం ఇప్పుడు సర్వసాధారణం. అది మొదలైంది ‘పాతాళభైరవి’ నుంచే.
ఇక ఘంటసాల సంగీత దర్శకత్వంలో ప్రతి పాటా ఒక ఆణిముత్యమే.. ‘కలవరమాయే మదిలో..’, ‘ప్రేమకోసమై వలలో పడెనే పాపం పసివాడు..’, ‘కనుగొనగలనో లేనో..’, ‘ఎంతఘాటు ప్రేమయో..’, ‘తీయని ఊహలు హాయిని గొలిపే..’, ‘వినవే బాలా నా ప్రేమ గోలా..’ ఇలా చెప్పుకొంటూపోతే అన్నీ మేలిముత్యాలే. ‘పాతాళభైరవి’లో ఘంటసాల నేపథ్య సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ముఖ్యంగా పాతాళభైరవి గుహ నేపథ్యంలో వచ్చే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్రేక్షకులను విస్మయానికి గురిచేస్తుంది.
తెలుగులో 1951 మార్చి 15న విడుదలైన ఈ సినిమా.. మొత్తం 30 థియేటర్లలో వందరోజులు ఆడింది. తమిళంలో అదే ఏడాది మే 17న విడుదలై అక్కడ కూడా విజయఢంకా మోగించింది. ఇక విజయ, జెమినీ సంస్థలు సంయుక్తంగా 1952 మే 17న ఈ సినిమాను హిందీలో విడుదల చేయగా.. బాలీవుడ్‌లోనూ ఘన విజయాన్ని అందుకుంది. హిందీలో కొన్ని పాటలు కలర్లో చిత్రీకరించడం విశేషం.
ఓ విధంగా టాలీవుడ్లో తొలి పానిండియా సినిమాగా ‘పాతాళభైరవి’ సినిమాను చెప్పొచ్చు. అలాగే.. ఈ సినిమా అయినన్ని రీ-రిలీజులు టాలీవుడ్ చరిత్రలో ఇప్పటివరకూ ఏ సినిమా కాలేదు. విడుదలైన నాటి నుంచి 60 ఏండ్ల పాటు తెలుగునేలపై ఏదో ఒకచోట ఈ సినిమా ప్రదర్శితమవుతూనే ఉంది. దీన్నిబట్టి ‘పాతాళభైరవి’ స్టామినా ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఈ విధంగా తెలుగు సినిమా స్థాయిని, గౌరవాన్ని పెంచిన చిత్రరాజం ‘పాతాళభైరవి’. 75 ఏండ్లు కాదు, వందేళ్లు పూర్తి చేసుకున్నా.. ఈ సినిమా వైభవం విజయావారి బావుటాలా రెపరెపలాడుతూనే ఉంటుంది.
హాస్యనటుడిగా రేలంగికి ‘పాతాళభైరవి’ పెద్ద బ్రేక్, సదాజపుడిగా పద్మనాభం, అంజిగా వల్లూరి బాలకృష్ణ ఈ సినిమాతో బిజీ అయిపోయారు. ‘పాతాళభైరవి’గా టైటిల్‌రోల్ పోషించిన గిరిజ.. ఈ సినిమా తర్వాత లేడీ కామెడీ స్టార్‌గా తెలుగుతెరను ఏలారు. ఇక తెలుగుప్రేక్షకుల ఆరాధ్యనటి మహానటి సావిత్రి తెరపై కనిపించిన తొలి సినిమా కూడా ఇదే. ఈ సినిమాలో ‘నేను రానంటే రానే.. రానూ..’ అంటూ సాగే ఓ నృత్యరూపకంలో ఓ మూడు నిమిషాల పాటు తళుక్కున మెరిసి మాయమవుతారు సావిత్రి. ఆ విధంగా ఎందరో టాలీవుడ్ లెజెండ్లు ‘పాతాళభైరవి’ దీవెనలతో వెలుగులోకి వచ్చారు. అప్పటివరకూ తిరుగులేని జానపద కథానాయకుడిగా వెలిగిన అక్కినేని నాగేశ్వరరావు… ‘పాతాళభైరవి’లో ఎన్టీఆర్‌ని చూశాక, జానపద చిత్రాలకు దూరం జరిగి, సోషల్ పాత్రలపై శ్రద్ధ పెట్టారు. టాలీవుడ్లో మొత్తం 58 జానపద చిత్రాల్లో నటించి, అత్యధిక జానపద చిత్రాల్లో నటించిన కథానాయకుడిగా ఎన్టీయార్ చరిత్ర సృష్టించారు.
– నరసింహ బుర్రా