Veerabhadrudu | కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన తాజా బ్లాక్బస్టర్ చిత్రం ‘కరుప్పు’ (తెలుగులో ‘వీరభద్రుడు’) థియేటర్లలో ఘన విజయాన్ని అందుకున్న తర్వాత ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. మే 15న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లు నమోదు చేసి ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.థియేటర్లలో మంచి ఆదరణ పొందిన ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ రిలీజ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, ఇప్పుడు ఆ తేదీ ఖరారైంది. ప్రముఖ ఓటీటీ వేదిక ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. జూన్ 12 నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్కు అందుబాటులోకి రానుంది. తమిళంతో పాటు తెలుగు భాషలో కూడా ప్రేక్షకులు ఈ సినిమాను వీక్షించవచ్చు.
ఈ చిత్రానికి ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించడంతో పాటు కీలక పాత్రలో కూడా నటించారు. సూర్యకు జోడీగా త్రిష నటించగా, ఇంద్రాస్, నట్టి సుబ్రమణియన్, అనఘ మాయ రవి, సుప్రీత్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. సంగీతాన్ని యువ సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ అందించారు. చిత్ర కథ విషయానికి వస్తే.. తన చిన్నారి కుమార్తెకు అత్యవసర శస్త్రచికిత్స చేయించేందుకు అవసరమైన డబ్బు, బంగారంతో ఓ తండ్రి తన కూతురుతో కలిసి నగరానికి వస్తాడు. అయితే రైల్వే స్టేషన్కు చేరుకున్న వెంటనే దొంగల బారిన పడి తమ వద్ద ఉన్న 60 సవర్ల బంగారాన్ని కోల్పోతాడు. పోలీసులను ఆశ్రయించగా, కేవలం 45 సవర్ల బంగారం మాత్రమే రికవరీ అవుతుంది. అంతేకాదు, ఆ బంగారాన్ని తిరిగి పొందాలంటే కోర్టు ప్రక్రియ పూర్తయ్యే వరకు వేచి ఉండాలని చెబుతారు.
ఈ క్రమంలో కానిస్టేబుల్ సలహాతో వారు ప్రముఖ న్యాయవాది బేబీ కృష్ణను సంప్రదిస్తారు. కోర్టు వ్యవస్థలో ఉన్న లొసుగులను తనకు అనుకూలంగా ఉపయోగించుకుంటూ కేసులను కావాలనే ఆలస్యం చేసే బేబీ కృష్ణ, బాధితుల నుంచి డబ్బులు వసూలు చేస్తుంటాడు. ఈ మోసాన్ని గుర్తించిన తండ్రి న్యాయం కోసం పోరాడాలని నిర్ణయించుకుంటాడు. అయితే ఎక్కడా న్యాయం దొరకకపోవడంతో సమీపంలోని వీరభద్రస్వామి ఆలయానికి వెళ్లి తన బాధను దేవుడి ముందు వెల్లగక్కుతాడు. ఆ ప్రార్థనకు స్పందించిన క్షేత్రపాలకుడైన వీరభద్రుడు భూమిపైకి వచ్చి అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం ప్రారంభిస్తాడు. వీరభద్రుడు మరియు బేబీ కృష్ణ మధ్య జరిగిన పోరాటం ఎలా సాగింది? బాధిత తండ్రీకూతుళ్లకు న్యాయం జరిగిందా? కోర్టు వ్యవస్థలోని అవినీతి, అక్రమాలను వీరభద్రుడు ఎలా ఎదుర్కొన్నాడు? సామాన్య ప్రజలను మోసం చేసే వారికి ఎలా బుద్ధి చెప్పాడు? అనే అంశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.