‘ఈ ఫైల్‌ను అత్యవసరంగా క్లియర్ చేయండి’ అని తన శాఖ కార్యదర్శిని మంత్రి ఆదేశించారు. కానీ ఫైలు కదల్లేదు. మంత్రి మరోసారి అడిగారు. వెంటనే ఒక ‘అభ్యంతరం’ వచ్చింది. మంత్రి కార్యాలయం ఆ కొర్రీకి సమాధానం ఇచ్చింది. ఆ తర్వాత కార్యదర్శి మరో కొర్రీ రాశారు. ఆఖరికి ఆ ఫైల్ ఎకడ ఉందో వెతికి పట్టుకోవడం మంత్రికే సాధ్యం కాలేదు!
– నీటి పారుదల శాఖలో ఓ బిల్లుకు సంబంధించిన ఫైల్ వ్యవహారం ఇది.
అటవీ శాఖలోనూ ఇలాంటిదే జరిగిందట. ప్రజా ప్రయోజనకరమైన ఒక ఫైల్‌ను తక్షణమే పరిషరించాలని ఆ శాఖ కార్యదర్శిని మంత్రి ఆదేశించారు. కొన్నిరోజుల తర్వాత ‘ఫైల్ ఏమైంది?’ అని మంత్రి ఆరా తీయగా, నిబంధనల పేరుతో ఒక కొర్రీ వచ్చిందని తెలిసింది. దానికి మంత్రి కార్యాలయం తగిన వివరణ ఇచ్చి మళ్లీ పంపగా, ఈసారి సాంకేతిక, ఆర్థిక అభ్యంతరాలు తెరపైకి వచ్చాయి. ఇలా కొర్రీల మీద కొర్రీలు పెడుతూ ఫైల్ ఆయా సెక్షన్ల మధ్య తిరిగిందే తప్ప, ఆమోదముద్ర పడలేదని చెప్తున్నారు. దాదాపు అన్ని శాఖల్లోనూ ఇదే పరిస్థితే నెలకొన్నదని సచివాలయ వర్గాలు తెలిపాయి.
హైదరాబాద్ , ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ) : పాలనలో మంత్రులది కీలక పాత్ర. తమ పరిధిలోని శాఖలకు సంబంధించిన అన్ని రకాల నిర్ణయాలను తీసుకుంటారు. అధికారులు వాటిని అమలుచేస్తారు. కానీ, నిర్ణయం తీసుకున్నచోటే ఫైల్ ఆగిపోతే? మంత్రి ఆదేశించినా ఉన్నతాధికారులు పట్టించుకోకపోతే? ఒక శాఖకు సంబంధించిన ఫైల్ కదలాలంటే ‘మరోచోటి’ నుంచి అనుమతి కావాల్సి వస్తే? అధికారిక వ్యవస్థకు వెలుపల ఉన్న ఆ వ్యక్తులు ఫైల్‌ను ఆపమని ఆదేశించగానే.. రబ్బరు స్టాంపుల్లాంటి అధికారులు కొర్రీల మీద కొర్రీలు వేస్తూ ఫైల్‌ను అటకెక్కిస్తే?.. ప్రభుత్వానికి సమాంతరంగా నడుస్తున్న వ్యవస్థకు ఇది సంకేతం. ప్రస్తుతం తెలంగాణ సచివాలయంలోని కీలక శాఖల్లో ఇదే జరుగుతున్నది. మంత్రుల చేతుల్లో ఉండాల్సిన అధికారానికి సమాంతరంగా మరో ‘అనధికారిక వ్యవస్థ’ ఏర్పడిందనే ప్రచారం జరుగుతున్నది. ‘షాడో సీఎంవో’ అని పిలుచుకుంటున్న ఈ వ్యవస్థ ఒక ‘కమాండ్ కంట్రోల్’లా పని చేస్తున్నదని మంత్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
‘కొర్రీ’లు దాటితేనే ఫైల్‌కు మోక్షం
సచివాలయంలో సాధారణంగా మంత్రి నిర్ణయం తీసుకున్న తర్వాత సంబంధిత శాఖ కార్యదర్శి, శాఖాధిపతి స్థాయిలో ప్రక్రియ పూర్తవుతుంది. కానీ, ఇప్పుడు కొన్ని కీలక శాఖల్లో పరిస్థితి భిన్నంగా మారిందని ఆరోపణలు ఉన్నాయి. మంత్రి ఆదేశించినా ఫైల్ వెంటనే కదలడం లేదని, కార్యదర్శుల స్థాయిలో పదేపదే అభ్యంతరాలు, కొర్రీలు పెట్టి కాలయాపన చేస్తున్నారని చర్చ జరుగుతున్నది. కొన్ని సందర్భాల్లో మంత్రి కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాలను కూడా పట్టించుకోవడం లేదని చెప్పుకొంటున్నారు. మంత్రి స్వయంగా ‘ఫైల్ ఏమైంది?’ అని ఆరా తీస్తే.. ‘స్పష్టత కావాలి’, ‘మరింత సమాచారం అవసరం’ అంటూ సమాధానం ఇస్తున్నారట. షాడో సీఎంవో నుంచి అనుమతులు వస్తేనే ఫైల్ కదులుతున్నదనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. షాడో నుంచి ఆదేశాలు వస్తే మంత్రికి తెలియకుండానే కొన్ని పనులు జరిగిపోతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ చెప్పినా వినకుండా 25 మంది సిబ్బంది డిప్యుటేషన్లను ప్రధాన అటవీ సంరక్షణాధికారి వినయ్‌కుమార్ రద్దు చేశారని ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. అదేవిధంగా మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టివిక్రమార్క, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వర్రావు, అడ్లూరి లక్ష్మణ్, మహ్మద్ అజారుద్దీన్ తదితరుల శాఖల్లోనూ ఇదే పరిస్థితి నెలకొన్నదని సచివాలయ వర్గాలు తెలిపాయి.
బంజారాహిల్స్ కేంద్రంగా ‘షాడో సీఎంవో’?
రాష్ట్రంలో అధికారిక సీఎంవోకు సమాంతరంగా ‘షాడో సీఎం వో’ పనిచేస్తున్నదని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ప్రచారం జరుగుతున్నది. ముఖ్యనేతకు నీడగా ఉండే దాదాపు 12 మంది వ్యక్తులు ఈ షాడో సీఎంవోలో ఉన్నారని, బంజారాహిల్స్ రోడ్ నంబర్-14 నుంచి నడిపిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఫైళ్లు, పోస్టింగ్‌లు, టెండర్లు, ఇతర నిర్ణయాలపై అక్కడి నుంచే ప్రభావం చూపుతున్నారని, ఈ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ పెద్దలు భారీ మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నారనే ప్రచారం జరుగుతున్నది. తమ సిఫార్సులను పకనబెట్టి వాళ్లకు అనుకూలమైన వ్యక్తులకు పోస్టింగ్‌లు ఇప్పిస్తున్నారని కొందరు మంత్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. మైనింగ్, గనులు, సింగరేణి వంటి కీలక రంగాల్లోనూ ‘షాడో’ ప్రభావం ఉన్నదన్న ప్రచారం జరిగింది.
‘మా మాటకు విలువేది?’
కీలక నిర్ణయాలు, ప్రాజెక్టులు, విధానపరమైన అంశాల్లో తమను పరిగణనలోకి తీసుకోవడం లేదని కొందరు మంత్రులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై ఆయా శాఖలకు చెందిన మంత్రికి చివరి దశలో మాత్రమే తెలుస్తున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎక్సైజ్‌శాఖ మంత్రి గతంలో తన శాఖలో ఏం జరుగుతున్నదో తెలుసుకోవటానికి ఆర్టీఐ చట్టం ద్వారా సమాచారం తెప్పించుకోవాల్సి వచ్చిందనే ఆరోపణలు ఉన్నాయి. రూ.54 కోట్ల విలువైన సెల్ఫోన్ల టెండర్ వ్యవహారంపై కూడా గతంలో చర్చ జరిగింది. తన ప్రమేయం లేకుండానే టెండర్ ప్రక్రియ పూర్తయిందని, ఫోన్లు ఎంతకు కొనుగోలు చేశారో కూడా తనకు తెలియదని ఒక మంత్రి ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం. షాడో సీఎంవోకు హెడ్‌గా ఉన్న వ్యక్తి, సదరు మంత్రి శాఖలో చీటికి మాటికి వేలు పెడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అదేవిధంగా కలెక్టర్లు, శాఖాధిపతుల పోస్టింగ్‌ల విషయంలోనూ మంత్రుల పాత్ర క్రమంగా తగ్గుతున్నదన్న ఆరోపణలు ఉన్నాయి.
‘ఆయన’ అజమాయిషీ
సీఎంవోతోపాటు సచివాలయంలోని కీలక శాఖల్లోనూ ‘ఆయన’ పెత్తనం పెరిగిపోతున్నదని కొందరు మంత్రులు సన్నిహితుల వద్ద వాపోతున్నారట. శాఖ ఏదైనా, మంత్రి ఎవరైనా ఆయన కన్ను గీటితేనే కదిలే అధికారులను కార్యదర్శులుగా నియమించి, మంత్రాగం నడిపిస్తున్నారని చెప్పుకొంటున్నారట. జూనియర్ ఐఏఎస్ అధికారుల నుంచి ప్రధాన కార్యదర్శుల వరకు నియామకాలన్నీ ఆయన కనుసన్నల్లోనే జరిగిపోతున్నాయని ప్రచారం జరుగుతున్నది. దాదాపు 14 కీలక శాఖల్లో ముఖ్యనేత అనుచర యంత్రాంగమే రాజ్యం ఏలుతున్నదని సచివాలయ వర్గాలు చెప్తున్నాయి. లెక్కలు చూసే ఓ మంత్రి తన శాఖకు కార్యదర్శిగా ఫలానా అధికారి కావాలంటూ ముఖ్యనేతను కోరినట్టు సమాచారం. కొంతకాలం తర్వాత ముఖ్యనేత తనకు అనుకూలమైన సీనియర్ అధికారిని నియమించినట్టు తెలిసింది. ఆయన ద్వారా సీఎంవో ప్రతి రూపాయినీ మాటరింగ్ చేస్తున్నట్టు సమాచారం. మంత్రి సిఫార్సు చేసిన బిల్లుల చెల్లింపు, ఇతర లావాదేవీలనూ సదరు కార్యదర్శి ముఖ్యనేత సన్నిహితుని దృష్టికి తీసుకువెళ్లి, ఆయన చేయమంటేనే చేస్తున్నట్టు సచివాలయ వర్గాలు చెప్తున్నాయి. మరో సీనియర్ మంత్రికి సంబంధించిన శాఖలో పోలీసు అధికారిని కార్యదర్శిగా నియమించారు. ఇప్పటికే అవినీతి అక్రమాలకు అడ్డాగా మారిన ఆ శాఖలోకి ముఖ్యనేత ఉద్దేశపూర్వకంగానే తన అనుకూల అధికారిని పంపినట్టు సమాచారం. దీంతో మంత్రి తీసుకున్న నిర్ణయాలకు సదరు కార్యదర్శి కొర్రీలు పెట్టి ఫైళ్లు తిప్పి పంపుతున్నట్టు సచివాలయ వర్గాలు చెప్తున్నాయి. మరో కీలక మంత్రి శాఖల్లోకి కూడా ఆయనకు ఇష్టం లేని అధికారిని కార్యదర్శిగా నియమించినట్టు ప్రచారం జరుగుతున్నది.
కొత్తగా ఎన్ఫోర్స్మెంట్ ఎత్తు
ఇవన్నీ చాలదన్నట్టు.. ముఖ్యనేత మరో నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. రాష్ట్రంలోని కీలక శాఖలపై తన పట్టును మరింత బిగించేందుకు, మంత్రుల పరిధిలోని ప్రధాన ఆర్థిక వనరుల శాఖల్లో పరోక్షంగా పెత్తనం సాధించేందుకు కొత్త వ్యూహానికి తెరలేపినట్టు ప్రచారం జరుగుతున్నది. వివిధ ప్రభుత్వ శాఖల్లో జరుగుతున్న అవినీతి, అక్రమాలను కట్టడిచేసే పేరుతో ఆయా శాఖల ఎన్ఫోర్స్మెంట్ విభాగాలను సీఎం తన ఆధిపత్యంలోకి తెచ్చుకునేలా అడుగులు వేస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఇందులో భాగంగా సివిల్ సప్లయ్, కమర్షియల్ టాక్స్(జీఎస్టీ), మైనింగ్ శాఖల్లో ఉన్న విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగాలను విలీనం చేసి, ఒకే వ్యవస్థగా రూపొందించేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతున్నట్టు సమాచారం. ఐజీ ర్యాంక్ అధికారికి పర్యవేక్షణ బాధ్యతలు అప్పగిస్తారని తెలిసింది. క్షేత్రస్థాయిలో తనిఖీలకు అవసరమైన అదనపు సిబ్బందిని, వనరులను సమకూర్చేందుకు సరార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఇందుకు అనుగుణంగా చట్టసవరణలు చేసేందుకు యంత్రాంగం నివేదిక సిద్ధం చేస్తున్నది. ఎక్సైజ్ శాఖలోని ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి మినహాయింపు ఇచ్చి యథాతథంగా కొనసాగించాలా? లేక దానిని కూడా విలీనం చేయాలా? అనే అంశంపై తర్జనభర్జన పడుతున్నట్టు తెలిసింది.