లక్నో: వృద్ధుడైన తాత తన మనవరాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమెను గర్భవతిని చేశాడు. వైద్య పరీక్షలో ఇది నిర్ధారణ అయ్యింది. ఈ నేపథ్యంలో ఆ వృద్ధుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (Man Impregnates Granddaughter) ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 16 ఏళ్ల బాలిక తల్లి మరణించడంతో తండ్రి, తాతతో కలిసి నివసిస్తున్నది. జూన్ 20న తండ్రి పని కోసం బయటకు వెళ్లిన తర్వాత 70 ఏళ్ల తాత నిజాముద్దీన్ తన మనమరాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత కూడా ఆమెపై లైంగిక చర్యలు కొనసాగించాడు.
కాగా, శనివారం కడుపునొప్పిగా ఉందని ఆ బాలిక చెప్పడంతో ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షలు నిర్వహించగా రెండున్నర నెలల గర్భవతి అని తేలింది. తన తండ్రి పనికి వెళ్ళిన తర్వాత, ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయాన్ని చూసి తాత తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆ బాలిక ఆరోపించింది. ఈ నేపథ్యంలో ఆమె తాత నిజాముద్దీన్‌ను శనివారం అరెస్ట్ చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు. ఆయనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.