న్యూఢిల్లీ: గత సంవత్సర కాలంలో అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి కన్నా పాకిస్థాన్ రూపాయి ఎక్కువ స్థిరత్వం కనబరిచింది. అధికారిక మారకం రేట్ రికార్డుల ప్రకారం పాక్ రూపాయి విలువ పెరగ్గా, డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి 8.4 శాతం విలువ కోల్పోయింది. ఆర్బీఐ డైలీ రెఫరెన్స్ రేట్ డేటా ప్రకారం మన రూపాయి విలువ గత 12 నెలల కాలంలో అమెరికా డాలర్ మారకం విలువలో 87 నుండి 95కి పడిపోయింది. ఇది 8.4 శాతం విలువ క్షీణతను సూచిస్తుంది. ఇదే కాలానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్థాన్(ఎస్బీపీ) ప్రచురించిన మారకం రేట్ల ప్రకారం డాలర్‌తో పోలిస్తే పాక్ రూపాయి విలువ 279.50 నుంచి 278.65కు 0.3 శాతం మేర పెరిగింది.
ఆర్థిక సాయానికి ఐఎంఎఫ్ ఆమోదం తెలపడం, విదేశీ మారక నిల్వల నిర్వహణ, సెంట్రల్ బ్యాంక్ అధిక పాలసీ రేట్లు, డాలర్ల ప్రవాహం కారణంగా పాక్ రూపాయి సాపేక్షంగా స్థిరంగా ఉందని ఎస్బీపీ పేర్కొంది. దీనికి విరుద్ధంగా ప్రపంచవ్యాప్తంగా పెరిగిన యూఎస్ డాలర్ డిమాండ్, విదేశీ పోర్ట్‌ఫోలియో అమ్మకాలు, వాణిజ్య బ్యాలెన్స్ సర్దుబాట్ల కారణంగా రూపాయిపై ఒత్తిడి పెరిగిందని ఆర్బీఐ నివేదికలు చెబుతున్నాయి.