ఖైరతాబాద్, మార్చి 14 : రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చిన్నచూపని దివ్యాంగులు ఆరోపించారు. కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టో అమలు సాధన సమితి ఆధ్వర్యంలో శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలంగాణ రాష్ట్ర వికలాంగుల సమితి అధ్యక్షుడు మున్నా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికరంలోకి రాకముందు అనేక హామీలను ఇచ్చిందని, కానీ రెండున్నర సంవత్సరాల కాలంలో ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు.
తాము కొత్తగా ఏమీ అడగడం లేదని, టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి తమ ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టిన హామీల గురించే ప్రశ్నిస్తున్నామన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.4వేల పింఛన్ రూ.6వేలకు పెంచుతామన్నారని, కానీ ఇంత వరకు రూపాయి కూడా పెంచలేదన్నారు.
2016 దివ్యాంగుల చట్టాన్ని అన్ని స్థాయిలో అమలు చేస్తామని, బ్యాక్ ల్యాగ్ ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారని, అది కూడా అమలుకు నోచుకోలేదన్నారు.
రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఓ దివ్యాంగురాలికి ఉద్యోగం ఇచ్చారని, కానీ అది ప్రభుత్వ పర్మినెంట్ కాదని, ఔట్సోర్సింగ్ ఉద్యోగమని, అది కూడా గ్యారెంటీ లేని ఉద్యోగం ఇచ్చి దివ్యాంగులకు ఏదో ఉద్దరించినట్లు గొప్పలు చెప్పుకొంటున్నారని విమర్శించారు. అనేకమంది దివ్యాంగులు పీజీ, పీహెచ్‌డీలు చేసి హాస్టళ్లలో ఉంటూ కుటుంబాలకు దూరంగా బతుకుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వారిని బ్యాక్ లాగ్ ఉద్యోగాల్లో భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు.
వంద శాతం రాయితీతో బస్సులో ఉచిత బస్సు ప్రయాణం ఇస్తామన్నారని, కానీ ఆ హామీనీ ఇంత వరకు అమలు చేయలేదన్నారు. కనీసం అసెంబ్లీ సమావేశాల్లోనైనా దివ్యాంగుల గురించి మాట్లాడాలని, వారికిచ్చిన హామీలను నెరవేర్చాలని, లేని పక్షంలో ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో భారత దివ్యాంగుల హక్కుల పోరాట సమితి రాజేశ్, చెరుకు నాగభూషణం, నరసింహ, భారతి వల్లభనేని, ప్రసాద్, వంశరాజ్ రామచంద్ర తదితరులు పాల్గొన్నారు.