రైతులకు ఎన్నో ఆశలు రేకెత్తించి గద్దెనెక్కిన కాంగ్రెస్ సర్కారు కాడి ఎత్తేసింది. సాగునీటి రంగాన్ని అడుగడుగునా పూర్తిగా విస్మరించి వారికి చుక్కలు చూపిస్తున్నది. రెండేండ్లుగా పంటలకు నీరందించే ఒక్క పనీ చేపట్టకుండా కన్నీళ్లు తెప్పిస్తున్నది. కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రాజెక్టుల పరిధిలో కాలువలు, ఉపకాలువలు, డిస్ట్రిబ్యూటరీలు పూర్తి చేయకుండా చోద్యం చూస్తున్నది. దీంతో నీటి కటకట తీవ్రం కాగా, రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. పంటను కాపాడుకునేందుకు పలువురు ట్యాంకర్ నీళ్లు పారిస్తుండగా, మరికొందరు పశువులకు మేతకు వదిలేయాల్సిన దుస్థితి దాపురించింది.
రాజన్న సిరిసిల్ల, మార్చి 14(నమస్తే తెలంగాణ) : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో యాసంగి సాగు ప్రశ్నార్థకంగా మారుతున్నది. ప్రాజెక్టుల కింద కెనాళ్లు నిర్మించకపోవడం, పలుచోట్ల అసంపూర్తిగా వదిలేయడంతో పంటలకు నీరందించుకోలేని దుస్థితి ఉంది. కరీంనగర్ జిల్లాలోని చిగురుమామిడి, గంగాధర మండలాల్లో కొరత తీవ్రంగా ఉంది. అలాగే, మెట్టప్రాంతమైన సిరిసిల్లలో పంటలు ఎండుతున్నాయి. ఒకప్పుడు కరువుతో అల్లాడిన ఈ ప్రాంతాన్ని గోదావరి జలాలతో అభిషేకించి పచ్చని మాగాణిగా మార్చేందుకు గత కేసీఆర్ సర్కార్ సంకల్పించింది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగంగా మధ్యమానేరు, మల్కపేట రిజర్వాయర్లను నిర్మించింది. వీటి కింద కొన్ని కాలువలు పూర్తయినప్పటికీ దిగువ ఆయకట్టుకు నీరందించే కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని పలు ప్యాకేజీల కింద ప్రధాన కాలువలు, ఉప కాలువలు, డిస్ట్రిబ్యూటర్ల నిర్మాణాలు ప్రభుత్వం మారడంతో ఆగిపోయాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో అసంపూర్తిగానే ఉంటున్నాయి. ఫలితంగా యాసంగి పంటలకు నీరందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంకా రిజర్వాయర్లలో నీటిని ఇతర ప్రాంతాలకు విడుదల చేయడంతో చెరువులు, కుంటల్లో నీరు తగ్గి, భూగర్భ జలాలు అడుగంటి, బోర్లు, బావులు ఎత్తిపోయి తిప్పలు పడుతున్నారు. రెండేండ్లుగా ప్రతి యాసంగిలో మెట్ట రైతులు పంట నష్టపోయి తీవ్రంగా నష్టపోతున్నారు. చేతికి వచ్చే పంట ఎండిపోయి మూగజీవాలకు మేతగా వదిలేయాల్సిన దుస్థితి దాపురించింది. ప్రధానంగా సిరిసిల్ల నియోజకవర్గంలో సిరిసిల్ల అర్బన్, తంగళ్లపల్లి, ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్, వీర్నపల్లి, మండలాల్లో ఈ పరిస్థితి నెలకొన్నది.
సిరిసిల్ల జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్ట్ 9, 10, 11, 12 ప్యాకేజీల కింద కాలువలు, ఉపకాలువలు, నిర్మించాల్సి ఉండగా, ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. భూ సేకరణతో పాటు పెండింగ్‌లో ఉన్న పరిహారం అందించి పనులు పూర్తి చేస్తే 1.39 లక్షల ఎకరాలకు సాగునీరందనుండగా, తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నది. కోనరావుపేట మండలం మల్కపేటలోని కాళేశ్వరం 9 ప్యాకేజీ పరిధిలో మల్కపేట రిజర్వాయర్ కుడి, ఎడమ కాలువల భూ సేకరణ అసంపూర్తిగానే ఉంది. ఈ ప్యాకేజీలో 70 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించే లక్ష్యంతో కాలువల నిర్మాణం చేపట్టారు. భూ సేకరణ నిలిచిపోవడం, నిధులు లేక పనులు ముందుకు సాగడం లేదు. ఇవి పూర్తయితే గొలుసు కట్టు చెరువులను నింపడంతో 15 వేల ఎకరాలకు నీరందుతుంది.
ఇల్లంతకుంట మండలంలోని కాళేశ్వరం 10వ ప్యాకేజీ ద్వారా కరీంనగర్, బెజ్జంకి మండలాలు కలిపి 30 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇక్కడ కాలువలు నిర్మించాల్సి ఉండగా, పెండింగ్ పెట్టారు.
సిద్ధిపేట జిల్లాలోని రంగనాయక సాగర్ ప్రాజెక్ట్ నుంచి కాళేశ్వరం 11వ ప్యాకేజీ ద్వారా ఇల్లంతకుంట, తంగళ్లపల్లి మండలాల్లోని 32 వేల ఎకరాలకు పైగా సాగునీరు అందించాలి. ఇందులో 18 కిలోమీటర్లు నిర్మించాల్సిన ఎల్ఎం- 6, కాలువ సగానికిపైగా పూర్తయింది.
సిద్ధిపేట జిల్లాలోని మల్లన్న సాగర్ ప్రాజెక్ట్‌లో 12వ ప్యాకేజీ కింద ముస్తాబాద్ మండలంలో 22 వేల ఎకరాల ఆయకట్టు లక్ష్యంగా ఉంది. దీని పరిధిలో ప్రధాన కాలువల భూ సేకరణ పూర్తి కాగా, పనులు పూర్తిస్థాయిలో జరగాల్సి ఉన్నది.
నేను ఆరెకరాల్లో వరి వేసిన. రెండేండ్ల నుంచి యాసంగిలో సాగు నీటి కొరతతో ఇబ్బందులు పడుతున్నా. నాకు 17 గజాలు బావి ఉన్నా నీళ్లు అడుగంటిపోతున్నాయి. పంటకు సరిపోవడం లేదు. కాలువల నిర్మాణం పూర్తయితే మంచిగుండేది. చెరువులు నిండి బోర్లు, బావుల్లో నీళ్లు ఉండేటియి. గతంలో మిడ్ మానేరులో నీటిని నిల్వ చేయడంతో భూగర్భజలాలు సమృద్ధిగా ఉండి ఇబ్బంది రాలేదు. కానీ ఇప్పుడు నీటిని ఇతర ప్రాంతాలకు పంపుతుండడంతో బోర్లు, బావులల్ల నీళ్లు తగ్గిపోతున్నయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మా గోస తీర్చాలె.
– భూపతిరెడ్డి, రైతు లక్ష్మీపూర్, తంగళ్లపల్లి
పంట పెట్టుబడికి చేతిలో పైసలు లేక అప్పు చేసి సాగు చేసిన. పొట్టకొచ్చే దశలో ఉన్నయి. మొన్నటిదాకా ఎరువులు దొరక్క ఇబ్బందులు పడ్డం. ఇప్పుడు ఎండలు ముదిరినయ్. మా ప్రాంతంలో బావులు, బోర్లు అడుగంటినయి. సాగునీరందక ఎండిపోయే పరిస్థితి ఉంది. గతంలోనూ ఇలాంటి పరిస్థితే ఎదురైతే అప్పటి బీఆర్ఎస్ సర్కారు మల్లన్న సాగర్ ప్రాజెక్టు ద్వారా నీటిని తెర్లుమద్ది శివారులో నక వాగులోకి వదిలింది. దీంతో భూగర్భ జలాలు పెరిగి పంటలను కాపాడుకున్నాం. ప్రభుత్వం స్పందించి మల్లన్న సాగర్ నుచి నీటిని వదలాలి. లేదంటే పంటలు ఎండిపోతయి.
– పిట్ల దేవదాస్, బట్టువాని పల్లె, (ముస్తాబాద్)