మధిర, ఆగస్టు 9 : ఈ నెల 15 నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తామంటున్న కొత్త ‘చేయూత’ పింఛన్లపై అర్హులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అనేక పథకాలను ఆయా తేదీల్లో ఇస్తామని, హామీలను ఫలానా తేదీ నుంచి అమలుచేస్తామని ఆర్భాటంగా ప్రకటనలు చేసిన రేవంత్ ప్రభుత్వం.. ఆ తరువాత చేతులెత్తేసిన విషయం విదితమే. రైతుభరోసా, రుణమాఫీ, ఇందిరమ్మ ఇళ్లు, ఉద్యోగ నియామకాలు, రాజీవ్ యువ వికాసం తదితర పథకాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేకసార్లు మాటమార్చిన సంగతీ తెలిసిందే. అయితే, ఇదే కోవలో ‘తాజా చేయూత పింఛన్ల అంశం కూడా ఉంటుందా?’ అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అదీగాక, రెండున్నరేళ్లయినా రూ.4 వేల పింఛన్లపై ఇంకా ఊసెత్తక పోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
చేయూ త పథకం కింద ఆగస్టు 15 నుంచి కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని, అర్హులందరూ దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం ఇటీవల ప్రకటించడంతో ఖమ్మం జిల్లాలోని అర్హులందరూ అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. వితంతువులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులు, నేత కార్మికులు, పైలేరియా వ్యాధిగ్రస్తులు, డయాలసిస్ రోగులకు నెలకు రూ.2,016 చొప్పున; దివ్యాంగులకు నెలకు రూ.4,016 చొప్పున పింఛన్లు ఇస్తామని రేవంత్ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన విషయం విదితమే. అయితే, తాము అధికారంలోకి రాగానే దివ్యాంగుల పింఛన్లను నెలకు రూ.6,000కు, మిగతా పింఛన్లను నెలకు రూ.4,000కు పెంచుతామని హామీ ఇచ్చిన కాంగ్రెస్.. ఇప్పటి వరకూ ఆవిధంగా పింఛన్లను పెంచలేదు. పైగా, అధికారంలోకి ఇచ్చిన ఈ రెండున్నరేళ్లలో కొత్త అర్హత సాధించిన వారికి చేయూత పింఛన్లనూ మంజూరు చేయలేదు. దీంతో అనేకమంది అర్హుల ప్రభుత్వ ప్రకటన కోసం ఇన్నాళ్లుగా ఎదురుచూస్తూనే ఉన్నాయి.
రెండున్నరేళ్ల తరువాత పింఛన్ల గురించి ఎట్టకేలకు ప్రకటన చేసిన ప్రభుత్వం.. మళ్లీ పాత లబ్ధిదారులకు అందిస్తున్న పింఛన్ మొత్తాన్నే ఇప్పుడూ ఇస్తామని స్పష్టంచేయడంతో పాత లబ్ధిదారులతోపాటు కొత్తగా అర్హత సాధించి పింఛన్ల కోసం దరఖాస్తుచేసుకుందామనుకుంటున్న అర్హులు కూడా ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. రెండున్నరేళ్లుగా కొత్తగా పింఛన్లు మంజూరు చేయకపోగా.. ఇప్పుడు కూడా రూ.2,016 చొప్పునే ఇస్తామని ప్రకటించడంతో ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఇన్నాళ్లుగా ఎదురుచూస్తున్న దరఖాస్తుదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఇప్పటికే అన్ని విషయాల్లోనూ మాట తప్పుతున్న ప్రభుత్వం.. ఈ విషయంలోనూ మళ్లీ మాట తప్పుతుందేమోనని, అసలు ఈ పింఛన్లు కూడా ఇస్తుందోలేదోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఖమ్మం జిల్లాలో మొత్తం 1,94,755 మంది పింఛన్ లబ్ధిదారులున్నారు. వృద్ధాప్య పింఛన్‌దారులు 75,802, వితంతువులు 72,986, దివ్యాంగులు 29,289, ఒంటరి మహిళలు 8,629, గీత, చేనేత, ఇతర కార్మికులు, వ్యాధిగ్రస్తులు 8,049 మంది ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకొని పెంచిన పింఛను ఇస్తారేమోనని ఆశగా ఎదురుచూస్తున్న పరిస్థితి ఏర్పడింది.
రూ.4 వేలుగా ఉన్న దివ్యాంగుల పింఛన్‌ను రూ.6 వేలు చేస్తామంటూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లయినా ఇంత వరకూ ఆ పింఛన్‌ను పెంచలేదు. ఈ నెల 15 నుంచి కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. దివ్యాంగులకు ఇంతకుమునుపు ఇచ్చిన విధంగా రూ.4,016 చొప్పునే తాజా పింఛన్ల కూడా ఇస్తామంటూ ప్రభుత్వం చెప్పడంతో ఆ మా ఆశలపై నీళ్లు చల్లినట్లయింది.
-ఖమ్మంపాటి ప్రసాద్, దివ్యాంగుడు, ఆతూరు, మధిర
నేను పుట్టుకతోనే దివ్యాంగురాలిని. గత కేసీఆర్ ప్రభుత్వంలో నాలాంటి దివ్యాంగులకు నెలకు రూ.4,016 చొప్పన పింఛన్ ఇచ్చారు. కాంగ్రెస్ వస్తే రూ.6 వేల చొప్పున ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ, రెండున్నరేళ్లవుతున్నా ఇంకా రూ.6 వేల పింఛన్ ఇవ్వడం లేదు. కానీ, ఈ నెల 15 నుంచి కొత్త పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ, హామీ ఇచ్చిన విధంగా రూ.6 వేల చొప్పున ఇవ్వడం లేదట. పాత పద్ధతిలోనే రూ.4,016 చొప్పున ఇస్తారట. రూ.6 వేల పింఛన్ అనేది మోసమేనేమో.
-తుంగ సుగుణమ్మ, లచ్చగూడెం, చింతకాని