Harish Rao | సిద్దిపేట : ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కాదు.. ఎగవేతల రేవంత్ రెడ్డి అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్ర విమర్శలు చేశారు. రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ సర్కార్‌కు హరీశ్‌రావు డెడ్‌లైన్ విధించారు. దసరా లోపు రైతులందరికీ రుణమాఫీ చేయాలి.. లేదంటే రైతులందరితో కలిసి సచివాలయం ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 2 లక్షల రైతు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా నంగునూరులో రైతులు నిర్వహించిన ధర్నాలో హరీశ్‌రావు పాల్గొని ప్రసంగించారు.
ఏదో సామెత అన్నట్టు పాలేవో నీళ్ళేవో తేలాలంటే కొద్దిగా టైం పడుతదని హరీశ్‌రావు పేర్కొన్నారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు రైతులు ఏ విధంగా ఉండే.. కాంగ్రెస్ పాలనలో రైతుల పరిస్థితి ఎలా ఉంది అనేది అందరికీ అర్థమైందన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందు రైతుల పరిస్థితి ఎలా ఉండే. రైతులకు ఎరువు బస్తా కావాలంటే పొద్దున ఐదు గంటలకు చెప్పులు లైన్లో పెడితే ఒక్క ఎరువు బస్తా దొరికేది. రైతులను ఎరువు బస్తాల కోసం లైన్ల నిలబెట్టింది కాంగ్రెస్. కానీ కేసీఆర్ ప్రతి ఊరికి ఎరువులను లారీల్లో పంపి రైతులకు అందించారు. కేసీఆర్ రాకముందు కాలిపోయే మోటర్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు. కేసీఆర్ వచ్చినంక 24 గంటల కరెంటు ఇచ్చిండు. ట్రాన్స్ఫార్మర్లు కాలకుండా కడుపునిండా రైతులకు కరెంటు ఇచ్చిండు. కాంగ్రెస్ పాలనలో దొంగ రాత్రి కరెంట్ వచ్చేది. కేసీఆర్ 24 గంటలు కరెంట్ అందించాడు. మళ్ళీ కాంగ్రెస్ పాలనలో కాలిపోయే మోటర్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు. కాంగ్రెస్ ఎమ్మెల్యే పర్ణికా రెడ్డి ఏదో మీటింగ్‌లో అంటున్నారు కేసీఆర్ ఉన్నప్పుడు 24 గంటలు కరెంటు ఎట్లా వచ్చింది ఇప్పుడు ఎందుకు వస్తలేదని కరెంట్ అధికారులను ఆమె అడిగారని హరీశ్‌రావు గుర్తు చేశారు.
కేసీఆర్ ఉండంగా ఫార్మరే ఫస్టు. కరోనా వచ్చినప్పుడు 45 రోజులు లాక్డౌన్ ఉంటే గవర్నమెంట్‌కి రూపాయి ఆదాయం లేదు. అయినా కేసీఆర్ రేషన్ కార్డు మీద రూ. 1,500 రూపాయలు ఇచ్చిండు. బియ్యం పంపిండు.. అందర్నీ ఆదుకున్నాడు. కరోనా వచ్చినప్పుడు కూడా రైతులకు రైతుబంధు వేసిన ముఖ్యమంత్రి కేసీఆర్. గవర్నమెంట్‌కి ఆదాయం లేకపోయినా ఎమ్మెల్యేల, మంత్రుల జీతాలు బంద్ పెట్టిండు.. కానీ రైతులకు మాత్రం రైతుబంధు ఇచ్చిండు. అది కేసీఆర్‌కు రైతు మీదున్న ప్రేమ. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమైంది? కరోనా లేదు అయినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు ఇవ్వడం లేదని హరీశ్‌రావు ధ్వజమెత్తారు.
కేసీఆర్ ఉండగా నాట్లు పడే వరకు రైతుల ఫోన్లలో టింగు టింగ్ అని రైతుబంధు పడేది. ఇప్పుడు నాట్లు అయి, కలుపై, పంటకు మందు కొట్టుడు కూడా అయిపోయింది. పంట కోతకు ఉన్నా, దసరా పండుగ దగ్గరకు వస్తున్నా ఇంకా రైతుబంధు పడలేదు. మాటలు మాత్రం కోటలు దాటుతాయి. అన్ని వంకర మాటలే కానీ రైతులకు మాత్రం రైతుబంధు వేస్తలేడు రేవంత్ రెడ్డి. రైతుబంధుకు కేసీఆర్ ఉండంగా ఎకరానికి రూ.4,000 ఇచ్చిండు. మళ్లీ గెలిస్తే రూ.5,000 ఇస్తానని ఇచ్చిండు. మళ్లీ గెలిస్తే రూ. 8,000 చేస్తా అన్నాడు గెలిస్తే చేస్తుండే. కాంగ్రెస్ గెలిచి రూ. 7,500 రైతుబంధు ఇస్తా అన్నారు. పోయిన యాసంగికి రూ. 5,000 ఇచ్చిండ్రు. ఈ పంటకు మొత్తానికి ఎగబెట్టారని హరీశ్‌రావు మండిపడ్డారు.
రైతులను అప్పుల పాలు చేస్తున్నడు రేవంత్ రెడ్డి. పంట పెట్టుబడి కోసం రైతులు అప్పులు చేసే పరిస్థితి ఏర్పడింది. అబద్ధాలు చెప్పి కుంటి సాకులు చెప్పి ఇప్పటిదాకా రైతులకు రైతుబంధు పైసలు ఇవ్వలేదు. రాష్ట్రంలో రైతులను ఆగం చేయడం కాదా? కేసీఆర్ ఒక్కసారి కాదు 11 సార్లు రైతుబంధు ఇచ్చిండు. ఊరు ఊరుకి కొనుగోలు కేంద్రాలు పెట్టి టైమ్‌కు వడ్లు కొనుడు అయినా, వడ్లను కొన్న పైసలు కూడా మూడు రోజులనే రైతులకు అందించిండు కేసీఆర్ అని హరీశ్‌రావు తెలిపారు.
కేసీఆర్ వచ్చినంకనే రైతుల భూముల విలువలు పెరిగినాయి. కేసీఆర్ రాకముందు ఎకరం రూ. 5 లక్షలు కూడా పోకపోయేది. కేసీఆర్ వచ్చినంక 24 గంటలు కరెంటు ఇచ్చి చెరువులు మంచిగా చేసి రిజర్వాయర్లు కట్టి రెండు పంటలు నీళ్లు ఇచ్చి రైతు విలువ పెంచిండు. రైతు విలువతో పాటు రైతు భూమి విలువ కూడా పెరిగింది. కాంగ్రెస్ వచ్చింది రైతు విలువ తగ్గించింది. మిషన్ కాకతీయతో ప్రతి ఊర్లో చెరువులు మంచిగా చేసుకున్నాం. ఈరోజు ఏ ఊర్లో చూసినా చెరువులు నిండుకుండల్లా ఉన్నాయి. కట్టలు మంచిగా చేసినం. తూములు మంచిగా చేసినం. అలుగులు మంచిగా చేసినం. అందుకనే ఈరోజు ప్రతి ఊర్లో చెరువులు మంచిగున్నాయని హరీశ్‌రావు పేర్కొన్నారు.
రేవంత్ రెడ్డి కాళేశ్వరం కూలిపోయింది అంటున్నాడు. వచ్చి రంగనాయక సాగర్, మల్లన్న సాగర్ చూడు రేవంత్ రెడ్డి. కాళేశ్వరం కూలిపోతే నీళ్లు ఎట్లా వచ్చినాయో చూడు మరి. రేవంత్ రెడ్డికి కూలగొట్టుడు తప్ప కట్టుడు తెలవదు. కాళేశ్వరంలో 100 భాగాలు ఉంటాయి. ఒక్క భాగంలో 160 పిల్లర్లలో రెండు పిల్లర్లకి చిన్న పగుళ్లు వచ్చినాయి దానికి కాళేశ్వరం మొత్తం కూలిపోయిందని అబద్ధ ప్రచారం చేస్తున్నాడు. ఎన్నడైనా ఏదైనా కట్టిన ముఖం అయితే రేవంత్ రెడ్డికి తెలిసేది. కాళేశ్వరంలో మూడు బ్యారేజీలు, 19 పంప్ హౌస్‌లు, 18 రిజర్వాయర్లు, సొరంగాలు, కాలువలు, పైపులైన్లు. ఇండ్ల రెండు పిల్లర్లకు మాత్రమే పగుళ్లు వచ్చాయని హరీశ్‌రావు స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
KTR | మూసి నది సాక్షిగా.. మహానగరంలో కేసీఆర్ లక్ష డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇదిగో.. : కేటీఆర్
HYDRAA | మూసీలో ఎర్రగీత.. విషమిచ్చి చంపి ఇండ్లు కూల్చండి