హైదరాబాద్: ఆపరేషన్ మూసీ పేరుతో ప్రభుత్వం చేస్తున్న విధ్వంసం, బాధితులకు డబుల్ బెడ్రూం ఇండ్ల కేటాయింపుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఎక్స్ వేదికగా స్పందించారు. తాము నిర్మిస్తే.. మీరు కూల్చేస్తున్నారని సీఎం రేవంత్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. తమది నిర్మాణం.. మీది విధ్వంసం అంటూ ఫైర్ అయ్యారు. మావి లక్షల నిర్మాణాలు కాగా, మీవి లక్షల కూల్చివేతలంటూ విమర్శించారు.
మూసి నది సాక్షిగా ఇదిగిదిగో మహానగరంలో కేసీఆర్ లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అంటూ మూసీ నిర్వాసితులకు రెండు పడక గదుల ఇండ్లను ప్రభుత్వం కేటాయించడంపై ఓ దినపత్రికలో వచ్చిన వార్తను కేటీఆర్ పోస్ట్ చేశారు. కాంగ్రెస్ విష ప్రచారాలు, అబద్దాలు అనడానికి మరో సాక్షం ఇదేనని పేర్కొన్నారు. కట్టలేదన్నారు, ప్రజలను మభ్యపెట్టాం అన్నారు.. మరి లక్ష ఇండ్లు రాత్రికి రాత్రికి ఎక్కడ నుండి పుట్టుకొచ్చాయి చిట్టి అంటూ సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. మీ పాలనలో మీ అధికారులే మీ టేబుల్ ముందు పెట్టిన డబుల్ లెక్కలు చూసి మతిపోతుందా అని ఎద్దేవా చేశారు. కేసీఆర్ నిజం, ఆయన హామీలు నిజం, ఆయన మాట నిజం అని తెలిసి మింగుడుపడటం లేదా అంటూ నిలదీశారు. మీ జూటా మాటలు, మీ కుట్రలకు, మీ దిమాక్ తక్కువ పనుల డ్యామేజ్ కంట్రోల్‌కు నేడు కేసీఆర్ నిర్మాణాలే దిక్కయ్యాయని పేర్కొన్నారు. కేసీఆర్ లక్ష డబుల్ నిర్మాణాలు నిజం, కేటాయింపులు నిజం అని చెప్పారు. మీ నాలుకలు తాటి మట్టాలు కాకుంటే ఇంకోసారి అబద్దాలు మాట్లాడకండి అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
మేము నిర్మిస్తే – మీరు కూల్చేస్తున్నారు
మాది నిర్మాణం – మీది విధ్వంసం
లక్షల నిర్మాణాలు మావి – లక్షల కూల్చివేతలు మీవి
మూసి నది సాక్షిగా ఇదిగిదిగో మహానగరం లో కేసీఆర్ లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు
కాంగ్రెస్ విష ప్రచారాలు అబద్దాలు అనడానికి మరో సాక్షం ఇదే
కట్టలేదన్నారు-ప్రజలను… pic.twitter.com/xh1IPhGCXe
— KTR (@KTRBRS) September 27, 2024