Allu Arjun | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన తల్లి నిర్మలకు ప్రత్యేకమైన సర్ప్రైజ్ ఇచ్చి మరోసారి అభిమానుల ప్రశంసలు అందుకుంటున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆయన ఖరీదైన లెక్సస్ కారును తల్లికి బహుమతిగా ఇచ్చారు. ఈ కారు ధర సుమారు రూ.70 లక్షల నుంచి రూ.కోటి వరకు ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ కారుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, అభిమానులు మరియు నెటిజన్లు ప్రేమతో కూడిన కామెంట్స్ చేస్తూ బన్నీని ప్రశంసిస్తున్నారు. ఇటీవలే అల్లు అర్జున్ తన భార్య స్నేహారెడ్డికి కూడా ఖరీదైన కారును గిఫ్ట్‌గా ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు.
ఈ నెల 6న అల్లు అర్జున్ – స్నేహారెడ్డి దంపతుల 15వ వివాహ వార్షికోత్సవం జరిగింది. ఆ సందర్భంగా భార్యకు సర్ప్రైజ్గా మెర్సిడెస్ బెంజ్ కారును బహుమతిగా ఇచ్చారు. ఈ కారు విలువ సుమారు రూ.కోటిన్నర వరకు ఉంటుందని సమాచారం. ఆ రోజు బన్నీ కారును ఇంటికి తీసుకువచ్చి తన తండ్రి అల్లు అరవింద్, కుమారుడు అయాన్, కుమార్తె అర్హ సమక్షంలో స్నేహారెడ్డికి కారు తాళాలు అందించారు. ఈ సందర్భంగా తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అదే రోజు బన్నీ సోదరుడు అల్లు శిరీష్ వివాహం కూడా జరగడంతో ఈ గిఫ్ట్‌పై మరింత చర్చ జరిగింది. ముందుగా కారుకు సంబంధించిన ఫోటోలు బయటకు రావడంతో చాలా మంది అది తమ్ముడు అల్లు శిరీష్‌కు గిఫ్ట్‌గా ఇచ్చారని భావించారు. కానీ చివరికి అది తన 15వ మ్యారేజ్ యానివర్సరీ సందర్భంగా భార్యకు ఇచ్చిన సర్ప్రైజ్ గిఫ్ట్ అని తెలిసి అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా స్నేహారెడ్డి కూడా సోషల్ మీడియాలో భావోద్వేగంగా స్పందించారు. బన్నీతో 15 సంవత్సరాలుగా ప్రేమతో నిండిన జీవితాన్ని గడిపానని, తనకు కుటుంబమే అన్నీ అని పేర్కొన్నారు. జీవితంలోని ప్రతి ముఖ్యమైన సందర్భంలో తనకు తోడుగా నిలిచిన బన్నీకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయనతో కలిసి దిగిన ఫోటోలను పంచుకున్నారు. ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన దర్శకుడు అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ “AA22xA6” లో నటిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ జానర్లో రూపొందుతున్న ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో బన్నీ మూడు విభిన్న పాత్రల్లో కనిపించనున్నట్లు సమాచారం. పునర్జన్మలు మరియు సమాంతర ప్రపంచం నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది.