HYDRAA | హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ) : మూసీ నదిలో ఆక్రమణలు అంటూ సర్వేకు వచ్చిన అధికారులపై ఒక్కసారిగా మహిళల్లో ఆగ్రహం పెల్లుబికింది. ‘ఏండ్ల తరబడి ఉంటున్న ఇండ్లను ఉన్నపలంగా కూలుస్తామంటే చూస్తూ ఊరుకోవాలా’ అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. ‘ఓట్లేసి గెలిపించింది మా ఇండ్లను కూలగొట్టించుకునేందుకా?’ అని ఓ యువతి ఆక్రోశం వ్యక్తంచేస్తే.. ‘మాకు విషమిచ్చి చంపి శవాలను మూసీలో పడేసిన తర్వాతే మా ఇండ్లు కూలగొట్టుండ్రి’ అంటూ రామంతపూర్‌లోని కేసీఆర్ నగర్లో ఓ మహిళ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ‘పేదలకు ఇండ్లు ఇవ్వాల్సింది పోయి ఉన్న ఇండ్లను కూలగొట్టి మా జీవితాలనే కూల్చేయాలనుకుంటున్నోని కుటుంబం బాగుంటదా? మా ఉసురు తగలకుండా పోతడా’ అంటూ ఓ వృద్ధురాలు శాపనార్థాలు పెట్టింది. ఇలా ఒక్కరో ఇద్దరో కాదు.. మూసీ నది పొడవునా ఉన్న ఇండ్లలో నివాసముంటున్న వందలాది మంది, రేవంత్ సర్కారుపై దుమ్మెత్తిపోశారు. గురువారం మూసీ పరీవాహక ప్రాంతంలో మూడు జిల్లాల పరిధిలోని మండలలాకు చెందిన రెవెన్యూ అధికారులు చేపట్టిన సర్వేతో ఒక్కసారిగా నిర్వాసితుల ఆక్రందనలు మిన్నంటాయి. అధికారుల బృందాలను చుట్టుముట్టి తమ గోడు వెల్లగక్కారు. డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తామని అధికారులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ‘మా ఇండ్లను ఇట్లనే ఉంచండి తప్ప మాకు వేరే ఇండ్లే వద్దు’ అంటూ కుండబద్దలు కొట్టారు.
ఓవైపు స్థానికుల నిరసనలు కొనసాగుతుండగానే గురువారం గ్రేటర్ పరిధిలోని మూసీ పరీవాహక ప్రాంతాల్లో ఉన్న ఇండ్లకు అధికారులు మార్కింగ్ చేశారు. పోలీస్, రెవెన్యూ, నీటిపారుదల సహా వివిధశాఖల అధికారుల ఆధ్వర్యంలో ఈ సర్వే ప్రక్రియ జరిగింది. అధికారులు సర్వేకు రాగానే వారంతా ఒక్కసారిగా అడ్డుకున్నారు. తమ ప్రాంతాల్లో సర్వే చేయొద్దంటూ మార్కింగ్ ప్రక్రియను ఆపే ప్రయత్నం చేశారు. తమ ఇండ్లు తొలగిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. ఒకదశలో సర్వే అధికారులను అడ్డుకునేందుకు స్థానికులు ప్రయత్నించడంతో ఆయా ప్రాంతాల్లో ఉద్రిక్తత చోటుచేసుకున్నది. పలుచోట్ల అధికారుల కాళ్లావేళ్లాపడి బతిమిలాడుకున్నారు. కొందరు మహిలు మహిళా కానిస్టేబుళ్ల చేతులు పట్టుకొని ఏడుస్తూ దండం పెడుతూ తమ ఇండ్ల జోలికి రావద్దని వేడుకున్నారు. అయినా అధికారులు వినకపోవడంతో సర్వేను అడ్డుకున్నారు. ఇండ్ల వద్దకు వచ్చిన సర్వే అధికారులను మహిళలు అడ్డుకోవడంతో మహిళా కానిస్టేబుళ్లు వారిని పక్కకు లాక్కెళ్లే ప్రయత్నం చేసినా విడిపించుకుంటూ సీఎం రేవంత్‌రెడ్డిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇప్పటివరకు ఎన్నిసార్లు వర్షాలు పడ్డా తమ ఇండ్ల వద్దకు చుక్కనీరు కూడా రాలేదని, రెవెన్యూ పట్టాలున్న తమ ప్రాంతాన్ని ఎఫ్టీఎల్ అని ఎట్లా డిసైడ్ చేస్తారని అధికారులతో వాగ్వాదానికి దిగారు.
ఇక చాదర్‌ఘాట్, మూసానగర్, శంకర్‌నగర్‌లో మూసీనది బఫర్‌జోన్‌లో ఉన్న నిర్మాణాలకు అధికారులు మార్కింగ్ చేశారు. బహదూర్‌పురా, కిషన్‌బాగ్,అసద్‌బాబానగర్ తదితర ప్రాంతాల్లో రెవెన్యూ అధికారులు పోలీసుల సాయంతో మార్కింగ్ చేశారు. లంగర్‌హౌస్ ఆశ్రంనగర్లో మార్కింగ్ ప్రక్రియను స్థానికులు అడ్డుకున్నారు. తాము అన్ని అనుమతులు తెచ్చుకొని కష్టపడి కట్టుకున్న ఇండ్లను కూల్చేయడమంటే తమ బతుకులతో ఆడుకోవడమేనని ఆవేదన వ్యక్తంచేశారు. చైతన్యపురి ఫణిగిరికాలనీ, న్యూ మారుతీనగర్, సత్యనగర్‌లో అధికారులతో వాగ్వాదానికి దిగారు. రివర్‌బెడ్‌లో ఉన్న ఇండ్ల వివరాలు, యజమానుల వివరాలను నమోదు చేసే పత్రాలను లాక్కొని ఆగ్రహంతో చింపివేశారు. మార్కింగ్‌కు ఉపయోగించే ఎరుపురంగును లాక్కున్న ఓ యువకుడు దూరంగా విసిరేశాడు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత చోటుచేసుకున్నది. ఒక్కో బృందం 75 ఇండ్లను సందర్శించాల్సి ఉండగా ఉద్రిక్తల మధ్య సాధ్యం కాలేదు. అధికారులు అడిగిన సమాచారాన్ని ఇంటి యజమానులు ఇవ్వకుండా తిరస్కరించారు. తాము ఇక్కడి నుంచి వెళ్లే ప్రసక్తే లేదని అధికారులతో వాగ్వాదానికి దిగిన ఘటనలే అంతటా కనిపించాయి. ఉప్పల్‌లోని కేసీఆర్ నగర్, చైతన్యపురిలో సర్వే అధికారులను అడ్డుకున్నారు. పరిస్థితిని ఉన్నతాధికారులకు వివరించినా వినకపోవడంతో కొన్ని ఇండ్లు తిరిగి వాటికి మార్కింగ్ చేసి మమ అనిపించారు.
మూసీ విస్తరించిన మూడు జిల్లాలు రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ ప్రాంతాల్లో రెవెన్యూ అధికారులు గురువారం ఏకకాలంలో సర్వే చేపట్టారు. రెవెన్యూ, పోలీస్, జీహెచ్ఎంసీ అధికారులతో ఏర్పాటైన 26 బృందాలు మూసీ పరీవాహక ప్రాంతాల్లో ఆక్రమణలను గుర్తించి మార్క్ చేశారు. హైదరాబాద్‌లో 16, రంగారెడ్డిలో 4, మేడ్చల్‌లో 5 బృందాలు మండలాల వారీగా పర్యటించాయి. మూసీ రివర్ బెడ్ ఏరియాలో నిర్మాణాలను అధికారులు గుర్తించి రిపోర్ట్ రెడీ చేశారు. హైదరాబాద్‌లో అంబర్పేట్, ఆసిఫ్‌నగర్, బహదూర్‌పుర, చార్మినార్, గోల్కొండ, హిమాయత్‌నగర్, నాంపల్లి, సైదాబాద్ మండలాలు, రంగారెడ్డిలో ఘట్కేసర్, మేడిపల్లి, ఉప్పల్, మేడ్చల్ జిల్లాలో అబ్దుల్లాపూర్‌మెట్, గండిపేట, రాజేంద్రనగర్ మండలాల్లో కూల్చివేసే నిర్మాణాలను మార్క్ చేశారు. మూసీ నది వెంబడి రెవెన్యూ శాఖ నిర్వహించిన తాజా సర్వేలో రివర్ బెడ్ (నది గర్భం)లో 2,116 నిర్మాణాలు, బఫర్ జోన్లో మరో 7,850 నిర్మాణాలు ఉన్నాయని గుర్తించారు. హైదరాబాద్‌లో అధికారులు అంచనా వేసుకున్న 1,595 నిర్మాణాల్లో నిరసనల మధ్య 941 ఇండ్లకు మాత్రమే అధికారులు మార్క్ చేశారు. కాగా నేడూ కూడా సర్వే కొనసాగనుంది.
మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో భాగంగా అక్రమణలను తొలగించేందుకు ఇప్పటికే హైడ్రా బుల్డోజర్లు మూసీ తీరానికి చేరుకున్నట్టు అధికారులు చెప్తున్నారు. శనివారం సాయంత్రం అంతా సిద్ధం చేసి ఆదివారం కూల్చివేయడానికి హైడ్రా ప్రణాళికలు చేసుకుంది. అందుకు సంబంధించి ఫోర్స్‌ను కూడా రెడీ చేసింది. ఎలాగైనా పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉంటుందని ముందస్తుగానే హైడ్రా వద్ద సమాచారం ఉండటంతో అందుకు తగ్గట్టు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిసింది. మూసీ పరిధిలోని ఆయా పోలీస్ స్టేషన్ల సిబ్బంది ఆ ప్రాంతాల నుంచి ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నారు. స్థానిక నాయకులతో చర్చిస్తూ ఖాళీ చేయించేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు నది ఒడ్డున ఉన్న నివాసాల నుంచి ఖాళీ చేసే ప్రజలకు వసతి కల్పించేందుకు ప్రభుత్వం నగరంలోని వివిధ ప్రాంతాల్లో పునరావాసం కల్పిస్తామని చెప్పినప్పటికీ వాటిని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
నాపేరు లక్ష్మి.. నాకు ఒక్కటే ఇల్లున్నది. అది కూ డా నలభై గజాలు.. ఈ ఇల్లు కూడా కూలగొడ్తమంటె ఆఫీసర్లు మామీద నుంచి పోయి కూలగొట్టాలే.. మమ్మల్ని చంపి కూలగొట్టుండ్రి. మాకు ఆస్తుల్లేవు. భూముల్లేవు. నాకు ఎప్పుడు హార్టెటాక్ వస్తదో తెల్వ దు. మూడు మాట్ల కాల్లు చేతులు పడిపోయినయ్. నాకేమన్న అయిందనుకో రేవంత్‌రెడ్డే చేసిండని నా కొడుకులకు చెప్పి సచ్చిపోత. ఇగో.. రేవంత్‌రెడ్డీ చెప్తున్న.. నన్ను సంపి మూసీలో పారేసి నా ఇల్లు కూలగొట్టుండ్రి. రేవంత్‌రెడ్డి ఎందుకొచ్చిండు? మా ఇల్లు కూలగొట్టడానికి వాడెవ్వడు?
– లక్ష్మి, కేసీఆర్‌నగర్
గవర్నమెంట్ జాగా తీసుకోవాలె.. కాల్వలు చేసుకోమను.. కానీ మా ఇండ్ల జోలికి ఎందుకు రావాలె. ఇక్కడి నుంచి మేమెక్కడికి పోవాలె. మా పిల్లల కాలేజీలు, స్కూల్లు అన్నీ వదిలేయాల్న. ఒక్క ఇల్లు కూలగొట్టినా అందరం సచ్చిపోతం. ఈ రేవంత్‌రెడ్డి ఎప్పటికీ అన్యాయం చేస్తనే ఉంటడా. మేమైతే చెప్తున్నం..మా చావుకు రేవంత్‌రెడ్డే కారణమైతడు. ఆయనవల్లే మాకు ఈ కష్టం. మల్లోసారి వస్తడా.. మళ్ల ఓట్లేస్తమా. మా ఇండ్లు కూలగొట్టినోడు బాగుపడ్తడా. జనాల నోళ్లు కొట్టిన వాడు సంతోషంగా ఉంటడా. మేం మాత్రం ఊరుకోం. మాకు న్యాయం జరగాలె.
-నాగవాణి, కేసీఆర్‌నగర్
ఒక్కో రూపాయి జమ చేస్కొని ఆ పైసల్తో కట్టుకున్న ఇండ్లు కూలగొడ్తే ఎట్ల బతకాలె. అసలు ఇండ్లు కూలగొట్టాల్సిన పనేంది. అన్నీ సక్కంగ ఉన్నయంటేనే ఇల్లు కట్టుకున్నం. ఇప్పుడొచ్చి ఎఫ్టీఎల్ అంటే ఎట్ల. అయినా గీ గవర్నమెంట్ మాకు చేసిందేం లేదు.. ఉన్నది ఊడగొట్టుడు తప్ప. ఆఖరికి ఉన్న మకాన్ కూడా కూల్చేయవడ్తిరి. ఫస్టు వచ్చి మూడింతలు ఇస్తమన్నరు. ఇప్పుడేమో డబుల్ బెడ్రూం అంటున్నరు. మూడు నాలుగు కుటుంబాలు కలిసి ఉన్నోళ్లం ఇప్పుడు ఒక ఇల్లు ఇస్తే ఎట్ల ఉంటం. ఆఖరికి ఏదీ ఇయ్యరు. ఇదంతా మమ్మల్ని మాయ చేసి ఇక్కడ్నుంచి వెళ్లగొట్టాలని చేస్తున్నరు. అయినా
మా ఇల్లు మాగ్గావాలె. రేవంత్‌రెడ్డీ.. మా ఇల్లు జోలికి రావద్దు. మాకేమైనా అయితే నీదే బాధ్యత.
– ముస్లిం మహిళలు (కేసీఆర్ నగర్ – రామంతపూర్)