Harish Rao | హైదరాబాద్ : నీ దిగజారుడు మాటలతో నీ గౌరవం పోతే బాధలేదు.. కానీ సీఎం కుర్చీ గౌరవం కాపాడు అని సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు చురకలంటించారు. నీకు ఐదేండ్లే ఎక్కువ.. రెండోసారి అధికారంలోకి వచ్చే సీన్ లేదు అని హరీశ్‌రావు పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఉచిత కరెంట్ ఇచ్చిండంట. ఈ రాష్ట్ర ప్రజలకు, రైతులకు తెలియదా.. ఉచిత కరెంట్ కాస్త ఉత్త కరెంట్ అయింది. అది దొంగ రాత్రి 7 గంటలని చెప్పి నాలుగైదు గంటలు కూడా కరెంట్ ఇవ్వలేదు.. నాడు కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్పార్మర్లు.. నిజమైన ఉచిత కరెంట్ ఇచ్చింది కేసీఆర్.. నాణ్యమైన కరెంట్ ఇచ్చిండు. నాడు వైఎస్ ఇచ్చింది ఉత్త కరెంట్ అని ఏ రైతును అడిగానా చెబుతారు. అన్ని పగటి కలలే ఈయనవి. పదేండ్లు మాది గవర్నమెంట్ అని రేవంత్ రెడ్డి పదేపదే చెబుతుండు. కాంగ్రెస్‌కు అంత సీన్ లేదు.. రాజస్థాన్‌లో, ఛత్తీస్‌గఢ్‌లో ఐదేండ్ల కంటే ఎక్కువ లేదు కాంగ్రెస్ ప్రభుత్వం. నీవు ఐదేండ్లు ఉంటేనే ఎక్కువ. ప్రజలు బాధపడుతున్నారు. కాకపోతే అదృష్టం బాగుడి గెలిచావు. తిట్ల దండకాలు బంద్ చేసి.. ప్రజల కోసం పని చేయ్.. ఐదేండ్లు మంచిగా పని చేయ్.. నీకు ఉన్న అవకాశాలను వినియోగించు మంచి పేరు వస్తది. రెండోసారికి సీన్ లేదు. కాంగ్రెస్ పార్టీ ఒక్కసారికే పోతది అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
గత ప్రభుత్వంలో టీచర్లను ట్రాన్స్ఫర్లు చేయలేదని సీఎం రేవంత్ పచ్చి అబద్దాలను మాట్లాడిండు.. 18 ఏండ్ల కింద టీచర్ల ట్రాన్స్ఫర్లు అయ్యాయని మాట్లాడిండు.. అబద్దాలు ఆడడానికి సిగ్గుండాలి రేవంత్ రెడ్డి. 2018లో కేసీఆర్ ప్రభుత్వం ఉపాధ్యాయుల బదిలీలు చేసింది. నీ స్క్రిప్టు రైటర్ సరిగా లేడు. అబద్దాలు మాట్లాడి సీఎం పదవికి ఉన్న ఇజ్జత్ తీసుకుంటున్నవ్.. కుర్చీ గౌరవం కాపాడు.. నీ గౌరవం పోతే బాధలేదు. స్కూళ్లకు ఉచిత కరెంట్ ఇచ్చిన అంటున్నాడు.. కేసీఆర్ ప్రభుత్వంలో కూడా స్కూళ్లకు గ్రాంట్ ఇచ్చారు.. ఆ గ్రాంట్ తీసుకుని ప్రిన్సిపల్స్ కరెంట్ బిల్లులు చెల్లించారు. నువ్వేమో గ్రాంట్ బంద్ చేసి కరెంటోళ్లకు నేరుగా కడుతున్నవ్.. ఇప్పుడే కొత్తగా ఇచ్చినట్టు బిల్డప్ ఇస్తున్నవ్ అంటూ రేవంత్ రెడ్డిపై హరీశ్‌రావు మండిపడ్డారు.
ఇవి కూడా చదవండి..