న్యూఢిల్లీ, మార్చి 6 : విదేశాల్లో నివసించే వారికి హైదరాబాద్ హఠాత్తుగా చేరుకోలేనంత ఖరీదుగా మారిపోయింది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణల కారణంగా విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుండడంతో అనేక అంతర్జాతీయ రూట్లలో టికెట్ల ధరలను ఎయిర్‌లైన్స్ ఊహించని స్థాయికి పెంచేశాయి. విమాన టికెట్లు లభించడం ప్రయాణికులకు కష్టసాధ్యంగా మారగా అందుబాటులో ఉన్న కొద్దిపాటి సీట్ల చార్జీలు చుక్కలు చూపిస్తున్నాయి. భారత్‌కు తిరిగి వెళ్లేందుకు అందుబాటులో ఉన్న విమాన టికెట్ల చార్జీలకు కొన్ని రెట్లు అధికంగా చెల్లించాల్సి వస్తున్నదని, కొన్ని ఎయిర్‌లైన్స్ 200 శాతం అధిక చార్జీలు వసూలు చేస్తున్నాయని చాలామంది ప్రయాణికులు ఫిర్యాదు చేశారు.
ఉదాహరణకు శుక్రవారం మార్చి 6న లండన్ నుంచి హైదరాబాద్‌కు బయల్దేరే డైరెక్ట్ ఫ్లైట్ చార్జీ సుమారు రూ. 2.5 లక్షలు ఉంది. సాధారణంగా ఈ రూట్లో టికెట్ చార్జీ చాలా తక్కువ ఉంటుంది. కాని ప్రస్తుత పరిస్థితిలో అది రికార్డు స్థాయిలో పెరిగిపోయింది. గల్ఫ్ దేశాల నుంచి తిరుగు ప్రయాణమవుతున్న ప్రయాణికులు సైతం ఇటువంటి సమస్యలనే ఎదుర్కొంటున్నారు. గడచిన కొన్ని రోజులుగా ప్రధాన గల్ఫ్ నగరాల నుంచి హైదరాబాద్‌కు వెళ్లే విమాన చార్జీలు 200 శాతం వరకు పెరిగినట్లు ట్రావెల్ ఏజెంట్లు తెలిపారు. చాలా తక్కువ సంఖ్యలో విమానాలు నడుస్తుండడం, చాలా రూట్లను మళ్లించడంతో ప్రయాణికులకు ప్రత్యామ్నాయ మార్గాలు లేకుండా పోయాయి.
అయితే ఒమన్ నుంచి ఆపరేట్ అయ్యే కొన్ని ఎయిర్‌లైన్స్ మాత్రం మస్కట్, హైదరాబాద్ మధ్య సాధారణ చార్జీలనే వసూలు చేయడం విశేషం. కాని అవే రూట్లలో ఇండియన్ ఎయిర్‌లైన్స్ మాత్రం టికెట్ల ధరలను సాధారణ రేట్ల కన్నా మూడు రెట్లు అధికంగా విక్రయిస్తున్నట్లు తెలుస్తున్నది. విమాన సీటింగ్ సామర్థ్యం తగ్గిపోవడం, సర్వీసుల రద్దు, ప్రయాణికుల రద్దీ వంటి కారణాల వల్లే టికెట్ల చార్జీలు అమాంతం పెరిగిపోయాయని ట్రావెల్ ఏజెంట్లు తెలిపారు. కొన్ని గగనతలాల మూసివేత, అనేక విమాన సర్వీసులు రద్దుతో చాలా ఎయిర్‌లైన్స్ తక్కువ విమానాలను నడుపుతున్నాయని, అందుకే విమాన సీట్లకు డిమాండ్ పెరిగిపోయిందని వారు చెప్పారు.
పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగుతున్నందున అనేక దేశాల్లో విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అనేక గగనతలాలను మూసివేయడంతో గల్ఫ్ దేశాల్లో వందలాది మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. దీంతో భారతీయులు తమ స్వస్థలాలకు రావడానికి ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని ఎయిర్‌లైన్స్ పరిమిత సంఖ్యలో విమాన సర్వీసులను పునరుద్ధరించడంతో చార్జీలు పెరిగిపోయాయి.
దుబాయ్ విమానాశ్రయంలో అత్యధిక స్థాయిలో విమానాల రద్దు కొనసాగుతున్నది. ఇప్పటివరకు 259 ఫ్లైట్ డిపార్చర్లు, 278 ఫ్లైట్ అరైవల్స్ రద్దయ్యాయి. అత్యధిక స్థాయిలో విమాన సర్వీసులు రద్దయిన విమానాశ్రయాల్లో అబూధాబి ఇంటర్నేషనల్, దోహాలోని హద్ ఇంటర్నేషనల్, టెల్ అవీవ్‌లోని బెన్ గురియాన్ ఇంటర్నేషనల్, అమ్మాన్‌లోని క్వీన్ అలియా ఇంటర్నేషనల్ ఉన్నాయి.