Harish Rao | సంగారెడ్డి : సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది అని మాజీ మంత్రి హరీశ్‌రావు నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డి చరిత్రలో ఏ రోజు జై తెలంగాణ అనలేదు…ఉద్యమంలో పాల్గొనలేదు అని హరీశ్‌రావు స్పష్టం చేశారు. సంగారెడ్డిలో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.
డిసెంబర్ 9న తెలంగాణ ఏర్పాటు ప్రకటన వచ్చిందంటే కారణం కేసీఆర్ అని హరీశ్‌రావు తెలిపారు. కానీ ఎవరో దయతో వచ్చిందని సీఎం చెబుతుంటే ఇది తెలంగాణ ఉద్యమం, అమరులను అవమాన పరచడమే అని మండిపడ్డారు. తెలంగాణకి నంబర్ వన్ విలనే కాంగ్రెస్ పార్టీ. 2001లో కేసీఆర్ పార్టీ పెట్టకపోతే తెలంగాణ అనే మాటే లేదు కదా. తెలంగాణ అనే పదం అసెంబ్లీలో ఆనాడు నిషేధించారు. 50 ఏళ్ల కాంగ్రెస్ పాలన, 16 ఏళ్ల టీడీపీ పాలనలో తెలంగాణ అనే పదం లేకుండా చేశారని హరీశ్‌రావు గుర్తు చేశారు.
కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉండి ఢిల్లీలో 32 రాజకీయ పార్టీలను ఒప్పించి తెలంగాణకు అనుకూలంగా లేఖలు తెప్పించారు. 2004 నుంచి 2009 వరకు మాతో పొత్తు పెట్టుకుని తెలంగాణ ఇవ్వకుండా మోసం చేసిన పార్టీ కాంగ్రెస్. నవంబర్ 29 లేకపోతే డిసెంబర్ 9 ప్రకటన లేదు. డిసెంబర్ 9న తెలంగాణ ప్రకటన లేకపోతే జూన్ 2 లేదు అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
Harish Rao | తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని చాటిన సిధారెడ్డికి ఉద్యమాభినందనలు : హరీశ్‌రావు
KTR | నందిని సిధారెడ్డి ఉదాత్త నిర్ణయం ప్రతి తెలంగాణ వాసికి గర్వకారణం : కేటీఆర్