ఝరాసంగం : అహం బ్రహ్మాస్మి, అయమాత్మా బ్రహ్మ, తత్త్వమసి, ప్రజ్ఞానం బ్రహ్మ అనే నాలుగు వేద మహావాక్యాలను ప్రపంచానికి తెలియజేసి.. భారతీయ సనాతన ధర్మాన్ని ప్రచారం చేసిన గొప్ప సద్గురువు ఆదిశంకరాచార్యులు అని బర్దిపూర్ శ్రీ దత్తగిరి మహారాజ్ ఆశ్రమ పీఠాధిపతులు వైరాగ్య శిఖామణి అవధూతగిరి మహారాజ్, మహామండలేశ్వర్, డాక్టర్ సిద్ధేశ్వరానందగిరి మహారాజ్ పేర్కొన్నారు. గురువారం ఆలయ ఆవరణలో మాతృశ్రీ అనసూయ మాత చేతుల మీదుగా జగద్గురు ఆదిశంకరాచార్యుల నూతన విగ్రహావిష్కరణను భక్తిశ్రద్ధలతో ప్రారంభించారు. అంతకుముందు శంకరాచార్యుల విగ్రహాన్ని బర్దిపూర్ మాడ వీధుల్లో ఘనంగా ఊరేగించారు.
గణపతి పూజ, మహా మృత్యుంజయ యజ్ఞం, దత్త యజ్ఞం, పూర్ణాహుతి అనంతరం వేదమంత్రోచ్చారణల మధ్య భక్తుల సమక్షంలో జగద్గురు ఆది శంకరాచార్యులుశంకరాచార్యుల విగ్రహాన్ని వైభవంగా ఆవిష్కరించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల దేవాలయ కమిటీలు సహకరిస్తే లేదా దత్తగిరి చారిటబుల్ ట్రస్టును సంప్రదిస్తే అక్కడ కూడా శంకరాచార్యుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని దత్తగిరి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అల్లాడి వీరేశం ప్రకటించారు. అల్లాడి వీరేశం భక్తి సేవలను గుర్తించి రంబాపురి జగద్గురువులు దాన విశారద అనే బిరుదులు అందించారు.

అదేవిధంగా జహీరాబాద్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఉజ్వల రెడ్డి విగ్రహాల ఏర్పాటుకు సహకరిస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తడూల్ ఆశ్రమ పీఠాధిపతి రాజేశ్వర శివాచార్య, విశ్వ మానవ ధర్మ ప్రచార పరిషత్ సభ్యులు నీల వెంకటేశం, పునీత్ దీక్షిత్, నర్సింగ్ రావు, రాజు పాటిల్, ప్రసాద్, సాయి రెడ్డి, విట్టల్ రెడ్డి, బెజగం రాజయ్య, రాజేశ్వర్ సెట్ పాల్గొన్నారు. ఉత్సవాలను వీక్షించేందుకు జహీరాబాద్, సంగారెడ్డి, నారాయణఖేడ్, వికారాబాద్, బీదర్, సదాశివపేట్, తదితర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు.
