టెహ్రాన్: అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చుతున్నది. గల్ఫ్ ప్రాంతంలో సైనిక సంఘర్షణ ఆరో రోజుకు చేరుకున్నది. గురువారం సాయంత్రం ఇరాక్‌లోని ఎర్బిల్‌లో ఉన్న అమెరికా సైనిక స్థావరం లక్ష్యంగా ఇరాన్ దాడులకు పాల్పడింది. అలాగే ఇజ్రాయెల్‌పై పలు క్షిపణులు ప్రయోగించింది.
కాగా, ఇజ్రాయెల్ కూడా ఇరాన్‌పై దాడులను ముమ్మరం చేసింది. రాజధాని టెహ్రాన్‌పై బాంబులు కురిపించింది. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్, బాసిజ్ యూనిట్లతో సహా ఇరాన్ అంతర్గత భద్రతా దళాల స్థావరాలపై దాడి చేసింది.
మరోవైపు మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న సైనిక సంఘర్షణపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. 16 దేశాలను ఇది ప్రభావితం చేసిందని డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ తెలిపారు. ఇరాన్లో వెయ్యికిపైగా మరణాలు, లెబనాన్‌లో 50, ఇజ్రాయెల్‌లో 13, ఇతర గల్ఫ్ దేశాలలో 11 మరణాలు నమోదైనట్లు చెప్పారు.
ఇరాన్‌లోని 13 డబ్ల్యూహెచ్‌వో ఆరోగ్య సంరక్షణ కేంద్రాలపై దాడి జరిగినట్లు టెడ్రోస్ అధనామ్ తెలిపారు. నలుగురు ఆరోగ్య సంరక్షణ కార్మికులు మరణించగా, 25 మంది గాయపడినట్లు చెప్పారు. అంతర్జాతీయ మానవతా చట్టం ప్రకారం ఆరోగ్య సంరక్షణ కేంద్రాలను రక్షించాలని సూచించారు. వాటిని లక్ష్యంగా చేసుకోకూడదని కోరారు.
కాగా, అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త వైమానిక దాడుల్లో హతమైన ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ అంత్యక్రియలకు సంబంధించిన సన్నాహాలు టెహ్రాన్‌లో జరుగుతున్నట్లు తెలుస్తున్నది.
Also Read:
Iran hits US tanker | యుద్ధనౌకను ముంచేయడంపై ఇరాన్ ప్రతీకారం.. అమెరికా ట్యాంకర్ షిప్‌పై దాడి
Azerbaijan: అజర్బైజాన్ ఎయిర్‌పోర్టుపై పడిన డ్రోన్.. ఇరాన్ అంబాసిడర్‌కు సమన్లు.. వీడియో