– ఖమ్మం రూరల్లోని తొమ్మిది గ్రామాలపై ఎల్ నినో ఎఫెక్ట్
– 25 శాతానికి పరిమితమైన పంటల సాగు
ఖమ్మం రూరల్, జూలై 28 : ఎల్ నినో ప్రభావం సాగు విస్తీర్ణంపై స్పష్టంగా కనబడుతుంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై దాదాపు రెండు నెలలు గడుస్తున్నా ఆశించిన వర్షపాతం నమోదు కాకపోవడంతో పంట భూములు బీడు భూములుగా మారుతున్నాయి. ఖమ్మం రూరల్ మండలం, ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 21 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. వాటిలో 9 గ్రామాలపై ఎల్ నినో ప్రభావం స్పష్టంగా కనబడుతుంది. వ్యవసాయ శాఖ గణాంకాల ప్రకారం 9 గ్రామాలలో మొత్తం 12,072 ఎకరాల సాధారణ విస్తీర్ణం కాగా, నేటి వరకు కేవలం 4,925 ఎకరాలలో మాత్రమే సాగు జరిగింది. ఖమ్మం జిల్లాలోని సాగు విస్తీర్ణంలో ముందంజలో ఉండే ఖమ్మం రూరల్ మండలం వర్షాభావ పరిస్థితుల కారణంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటుంది. ప్రధానంగా గొల్లపాడు, కామంచికల్, పోలేపల్లి, గుడిమల్ల, గుర్రాలపాడు, కామంచి కల్, తనగంపాడు గ్రామాలలో 25 శాతానికి సాగు పరిమితమైనట్లు అధికారులు ఇటీవల నివేదికలను తయారు చేసి ఉన్నతాధికారులకు పంపడం జరిగింది. మిగిలిన గ్రామాలలో పత్తి, ఇతర పంటల సాగు కొంతమేర జరిగినప్పటికీ సాగు చేసిన పంటలను కాపాడుకునేందుకు రైతులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.