బూర్గంపహాడ్, జూలై 28 : భూగర్భ జలాల సంరక్షణకు ప్రభుత్వం తీసుకు వచ్చిన జలసిరి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని భధ్రాద్రి కొత్తగూడెం జిల్లా పంచాయతీ అధికారిణి అనూష అన్నారు. మంగళవారం బూర్గంపహాడ్ ఎంపీడీఓ కార్యాలయంలో మండల స్పెషలాఫీసర్ ఠాగూర్ అధ్యక్షతన పంచాయతీ సర్పంచులు, మండల స్థాయి అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరైన డీపీఓ మాట్లాడుతూ.. జలసిరి కార్యక్రమంలో భాగంగా మండలంలోని పంచాయతీల్లో ఇంకుడుగుంతలు, ఫారంపాండ్లు నిర్మించుకునేలా సంబంధిత శాఖల అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. వివిధ శాఖల ద్వారా చేపట్టే ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, గ్రామ పంచాయతీ సమగ్రాభివృద్ధి ప్రణాళికల రూపకల్పన, భవిష్యత్ కార్యాచరణపై సమగ్ర సమీక్ష నిర్వహించి ఆయా శాఖల అధికారులు, సర్పంచ్లతో ప్రతి అంశంపై చర్చించారు. ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో సంబంధిత శాఖల అధికారులతో చర్చించారు.
ఈ ఏడాది వర్షాభావం అంతగా లేకపోవడంతో పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలన్నారు. భూగర్భ జలాలను సంరక్షించడం ప్రతిఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని, దీనికి అనుగుణంగా గ్రామాల్లో ఫారంపాండ్లు, ఇంకుడు గుంతలు నిర్మించుకునేలా పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్లు సమన్వయంతో పని చేయాలన్నారు. పంచాయతీల అభివృద్ధిలో భాగంగా వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పారిశుధ్య నివారణ చర్యలు ముమ్మరంగా చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో ఎంపీడీఓ జమలారెడ్డి, డీటీ సమ్మయ్య, వ్యవసాయ, రెవెన్యూ, ఇరిగేషన్, ఐసీడీఎస్ శాఖల అధికారులు, సర్పంచులు, కార్యదర్శులు పాల్గొన్నారు.