Harish Rao | మెదక్ : కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు నిప్పులు చెరిగారు. ప్రభుత్వ తప్పిదాలను ఎత్తిచూపిస్తున్న యూట్యూబ్‌లను చూస్తే రేవంత్ రెడ్డికి వెన్నులో వణుకు పుడుతోందని హరీశ్‌రావు పేర్కొన్నారు. నర్సాపూర్ బీఆర్ఎస్ కార్యాలయంలో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.
ఫార్మాసిటీ, మెట్రో రైలు విషయంలో రేవంత్ రెడ్డి రూట్ మార్చారని హరీశ్‌రావు ధ్వజమెత్తారు. నర్సాపూర్ నియోజకవర్గం పరిధిలో ఏ గ్రామానికి వెళ్లినా రూణమాఫీ కాలేదని చెబుతున్నారు. రుణమాఫీ కాలేదని నిరసన తెలుపుతూ కాంగ్రెస్ నాయకులను రైతులు బంధిస్తున్నారు. రేవంత్ రెడ్డి తొందరపాటు వల్ల స్థానిక కాంగ్రెస్ నాయకులు గ్రామాలకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందన్నారు.
రాష్ట్రంలో 50 శాతానికి మించి రుణమాఫీ కాలేదు. 41 లక్షల మందికి రుణమాఫీ అవ్వాల్సి ఉంటే 21 లక్షల మందికి రుణమాఫీ కాలేదు. చివరకు రైతుబంధు కూడా ఎగ్గొట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు సార్లు రుణమాఫీ చేసింది. దొడ్డు వడ్లకు బోనస్ అని మేనిఫెస్టోలో ప్రకటించారు. ఇప్పుడేమో సన్నవడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామంటున్నారు. బోనస్‌ని బోగస్ చేశారని హరీశ్‌రావు మండిపడ్డారు.
10 నెలల కాంగ్రెస్ పాలనలో గ్రామపంచాయతీలకు నిధులు విడుదల చేయలేదు. సర్పంచులను కదిలిస్తే కన్నీళ్లు బయటకు వస్తున్నాయి. గత ప్రభుత్వంలో ప్రతినెల పల్లె ప్రగతికి నిధులు వచ్చాయి. ఇప్పుడు నిధులు కరువయ్యాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్టణాలను, గ్రామాలను గాలికి వదిలేసి, హైడ్రా పేరిట డ్రామాలు చేస్తున్నారు. కేంద్ర ఉపాధి హామీపై ఇచ్చిన రూ. 800 కోట్లను కాంగ్రెస్ ప్రభుత్వం దారి మళ్లించింది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను రేవంత్ రెడ్డి ఖతం చేశారు. రియల్ ఎస్టేట్ కూడా పూర్తిగా పడిపోయిందని హరీశ్‌రావు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Harish Rao | శిక్షణ పూర్తి చేసుకున్న ఎస్ఐలకు శుభాకాంక్షలు తెలిపిన హరీశ్‌రావు
Peddapally | గురుకుల పాఠశాలలో విద్యార్థికి పాము కాటు.. హాస్పిటల్‌కు తరలింపు