హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 3 (నమస్తే తెలంగాణ): మిస్ వరల్డ్ పోటీలు.. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రాధాన్యం ఉన్న పోటీలు! ప్రపంచ దేశాలన్నీ బరిలో నిలుస్తాయి. ప్రపంచ మీడియా అంతా ఆ పోటీల కవరేజీలో భాగమవుతుంది. ఏ ఒక్క చిన్న అవాంఛనీయ సంఘటన జరిగినా ప్రపంచం అంతా క్షణాల్లో పాకిపోతుంది. 74 ఏండ్లుగా ‘మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ అందాల పోటీలను విజయవంతంగా నిర్వహిస్తున్నది. కానీ, ప్రపంచ చరిత్రలోనే తొలిసారి హైదరాబాద్ వేదికగా జరిగిన మిస్ వరల్డ్ పోటీలు అభాసుపాలయ్యాయి. రేవంత్ సర్కారు అతి జోక్యం, అవగాహనలేమితో అంతర్జాతీయ స్థాయి పోటీలు కాస్త గల్లీ పోటీల మాదిరిగా సాగాయి. తెలంగాణ సంస్కృతిని అవమానపరిచేలా వ్యవహరించారు. కొందరు ప్రభుత్వ పెద్దలు, వారి సన్నిహితులు పోటీదారుల పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్టు ఆరోపణలొచ్చాయి. మిస్ ఇంగ్లండ్ మిల్లా మ్యాగీ హైదరాబాద్‌లో తనకు ఎదురైన వేధింపులపై కన్నీటిపర్యంతమైంది. తనను వేశ్యలా చూశారంటూ ఆవేదన చెందింది.
రామప్ప ఆలయ సందర్శన సమయంలో అందాల భామల కాళ్లను అక్కడి తెలంగాణ మహిళలతో కడిగించారు. ఈ చర్యపై తెలంగాణ మహిళాలోకం ఆగ్రహం వ్యక్తంచేసింది. పిల్లలమర్రి సందర్శన సందర్భంగా మిస్ వరల్డ్ కంటెస్టెంట్ల ప్రోగ్రాంలో వేదికపై ఉన్న మంత్రి జూపల్లి కృష్ణారావు.. వేదిక ముందు కూర్చొన్న ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతిరెడ్డిని చూపిస్తూ.. ‘అదిగో.. ఆయన తిరుపతిరెడ్డి.. సీఎం బ్రదర్..’ అంటూ పోటీదారులకు పరిచయం చేశారు. పోటీలకు ఎలాంటి సంబంధం లేని, ప్రభుత్వంలోనూ ఎలాంటి పదవిలేని తిరుపతిరెడ్డిని కంటెస్టెంట్లకు ఎందుకు పరిచయం చేయాల్సి వచ్చిందో మంత్రికే తెలియాలి.
పోటీలు నిర్వహిస్తే కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని సర్కారు చెప్పుకోగా.. కనీసం ఆ పోటీలను నిర్వహించడానికి స్పాన్సర్లు కూడా ముందుకు రాలేదు. దీంతో నిధులు సమకూర్చుకోవడానికి వివిధ రంగాల ప్రముఖులతో విందులు, ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటుచేశారు. ఇందులో కంటెస్టెంట్లను ఆకర్షణగా నిలబెట్టారు. సాధారణంగా అందాల పోటీలు ఎక్కడ జరిగినా ఆ పోటీలకు సంబంధించి మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్, ఏజెన్సీలు చూసుకుంటాయి. కేవలం భద్రతాపరంగా సంబంధిత రాష్ర్టాల ప్రభుత్వాలు అండగా నిలుస్తాయి. కానీ, తెలంగాణలో మాత్రం అందుకు విరుద్ధంగా అందాల పోటీలను ప్రభుత్వమే నిర్వహించింది. సుమారు రూ.200 కోట్లకుపైగా ఖర్చు చేసినట్టు ఆరోపణలున్నాయి.
చౌమహల్లా ప్యాలెస్‌లో సుమారు 300 మంది అతిథులతో జరిగిన విందు వ్యవహారం తీవ్ర వివాదాస్పదమైంది. డిన్నర్ పేరుతో అందగత్తెలందరినీ ఒక చోటుకు చేర్చి అతిథులను అలరించాలంటూ ఓ అధికారి సూచించారని, అతిథులకు కూడా మీకు నచ్చినట్టు ఉండొచ్చని పరోక్షంగా హింట్ ఇచ్చాడనే ఆరోపణలొచ్చాయి. అక్కడున్న అతిథుల్లో కొందరు కంటెస్టెంట్లతో అమర్యాదగా మాట్లాడుతూ.. వారిని లైంగికంగా వేధించినట్టు ఆరోపణలున్నాయి. ఈ విందులో తనకు ఎదురైన చేదు అనుభవాలను మిస్ ఇంగ్లండ్ మిల్లా మ్యాగీ ఒక్కొక్కటిగా తమ దేశంలోని మీడియాకు వెల్లడించడం ఇప్పుడు అగ్గి రాజేస్తున్నది.
పోటీల నుంచి ఆమె తప్పుకొని, ఇంగ్లాండ్‌కు వెళ్లిపోయి, తన కష్టాలను ‘ద సన్’ మ్యాగజైన్‌తో చెప్పుకున్నది. దీనిపై సమగ్ర విచారణ జరపాల్సిన ప్రభుత్వం నిర్లిప్తంగా వ్యహరించింది. నిర్వహణకు బాధ్యుడిగా ఉన్న జయేశ్‌రంజన్ ఓ అడుగు ముందుకేసి మ్యాగీ చేసిన ఆరోపణల్లో నిజం లేదని కొట్టిపారేశారు. ‘ద సన్’ పత్రికకు విశ్వసనీయత లేదని, అసత్యాలను ప్రచారం చేస్తుందని ఆరోపించారు. ఒక మహిళా తనను వేధించారంటూ నోరు విప్పితే విచారణకు ఆదేశించాల్సింది పోయి, ఏమీ లేదంటూ కొట్టిపారేయడం విమర్శలకు దారితీసింది. సదరు మహిళ ప్రఖ్యాత ‘ద గార్డియన్’ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ తనకు హైదరాబాద్‌లో జరిగిన వేధింపులను వ్యక్తంచేయడం విశేషం.
అందాల పోటీలతో రాష్ట్రానికి ఒరిగిందేంటి? రూ.200 కోట్లు దుబారా చేసి సాధించిందేంటి? అంటూ బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ సతీశ్‌రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మిస్‌వరల్డ్ కాంటెస్ట్‌తో ఎన్ని వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయో చెప్పాలని మంగళవారం ఎక్స్ వేదికగా నిలదీశారు. బీఆర్ఎస్ హయాంలో కేటీఆర్ ప్రోద్బలంతో రూ.47 కోట్లు వెచ్చించి నిర్వహించిన ఫార్ములా- ఈ రేస్ పోటీలతో రూ.700 కోట్లు పెట్టుబడులు వచ్చాయని, ఈ-మొబిలిటీ వ్యాలీ పెడతామని ప్రకటించగానే అమరరాజా, హ్యుందాయ్, అలాక్స్, అటెరో లాంటి దిగ్గజ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు క్యూ కట్టాయని చెప్పారు. కానీ కాంగ్రెస్ సర్కారు మాత్రం అందాల పోటీలతో సాధించిందేమీ లేదని విమర్శించారు.
సాధారణంగా అందాల పోటీలు ఏ దేశంలో నిర్వహించినా అక్కడి ప్రభుత్వాల భాగస్వామ్యం చాలా తక్కువగా ఉంటుంది. ప్రభుత్వ పెద్దలు ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భాలున్నప్పటికీ, పోటీలు పూర్తయ్యే వరకూ హాజరైన పరిస్థితి గతంలో భారతదేశంలోని బెంగళూరు, ముంబై నగరాల్లో జరిగిన పోటీల్లోనూ కనిపించలేదు. కానీ, తెలంగాణ మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు మాత్రం అందాల పోటీల కోసం పూర్తి సమయం కేటాయించారు. కంటెస్టెంట్లకు ఆహ్వానం నుంచి వీడ్కోలు వరకు జరిగిన ప్రతీ కార్యక్రమంలో సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి స్వయంగా నాలుగుసార్లు అందాల పోటీల్లో పాల్గొనడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మిల్లా మ్యాగీకి చేదు అనుభవం ఎదురైన చౌమహల్లా ప్యాలెస్ విందులోనూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన ప్రారంభోత్సవం, చౌమహల్లా ప్యాలెస్ విందు, హైటెక్స్ గ్రాండ్ ఫినాలే, రాజ్‌భవన్‌లో విందు కార్యక్రమాలకు సీఎం హాజరయ్యారు. కాగా, షెడ్యూల్లో లేని ప్రైవేట్ కార్యక్రమాలకు సంబంధించి ప్రభుత్వ అతి జోక్యాన్ని మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ సైతం ఆక్షేపించినట్టు తెలిసింది. అయినప్పటికీ ఇష్టానుసారం ప్రముఖుల ఇండ్లకు గాలా డిన్నర్ల పేరుతో తిప్పి తెలంగాణ ప్రతిష్టను దిగజార్చారు.
మిల్లా మ్యాగీ ఆరోపణల నేపథ్యంలో శిఖాగోయల్, రమారాజేశ్వరి, సాయిశ్రీతో కూడిన త్రిసభ్య కమిటీ విచారణ జరిపింది. 108 మంది కంటెస్టెంట్ల అభిప్రాయాలను, మిస్ వరల్డ్ నిర్వాహకుల అభిప్రాయాలను సేకరించింది. ఈ కమిటీ మిల్లా మ్యాగీ పాల్గొన్న కార్యక్రమాలన్నింటినీ పరిశీలించినట్టు తెలిసింది. ముఖ్యంగా చౌమహల్లా ఘటన దృష్ట్యా అక్కడ సీసీటీవీ ఫుటేజీని సేకరించగా, అందులో విస్తుగొలిపే విషయాలు బయటపడినట్టు తెలిసింది.
కొందరు వ్యక్తులు మిల్లా మ్యాగీని ఫాలోకావడం, ఆమెతో అసహజంగా ప్రవర్తిస్తూ సైగలు చేయడం, ఇబ్బంది కలిగేలా సెల్ఫీలు దిగడం లాంటివి కమిటీ దృష్టికి వచ్చినట్టు సమాచారం. ఈ విషయాలేవీ ఆ కమిటీ బయటకు చెప్పకుండా ప్రభుత్వం నోరు నొక్కేసిందనే ఆరోపణలొస్తున్నాయి. అధికారులు సైతం అంతర్గతంగా మిస్ వరల్డ్ పోటీలను కంపు కంపు చేశారంటూ చర్చించుకుంటున్నారు. త్రిసభ్య కమిటీ నివేదిక బయటకు వస్తే, ప్రకంపనలు పుట్టే ప్రమా దం ఉండటంతో ఇప్పుడు సర్కార్ సైతం అలాంటి కమిటీ ఏమీ తాము వేయలేదని బుకాయిస్తున్నదనే చర్చ జరుగుతున్నది.
రేవంత్‌రెడ్డి అందాల పోటీలు పెట్టారు. ఇది దేనికి ఉపయోగపడుతుంది? ఆడవాళ్ల అందాలను అంగట్లో అమ్మడానికి పెట్టే పోటీ అది. అందాల పోటీల్లో ఫస్ట్ వచ్చిన వారిని అంబాసిడర్లుగా పెట్టి అమ్మిస్తుంటారు. ప్రజలకు ఉపయోగపడని వస్తువులను వ్యాపారం చేసేందుకు వీరిని ఉపయోగిస్తుంటారు. పవిత్రమైన స్త్రీలు, భారతమాత, మాతృమూర్తి అంటూ మహిళలను గౌరవిస్తాం. అలాంటి గౌరవాన్ని మంటగలిపేలా అందాల పోటీలు నిర్వహిస్తారా? వాళ్లకు వెలకట్టి అమ్మేస్తారా? అందాల పోటీలది హీనచరిత్ర. అదో కార్పొరేట్ వ్యాపారీకరణ. అందాల పోటీలతో టూరిజం పెరుగుతుందా? ఇది చాలా అవమానం. స్త్రీజాతికి అసహ్యం కలిగించే వ్యవస్థ.
-నారాయణ, సీపీఐ జాతీయ కార్యదర్శి