Cold Wave | హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా చలి తీవ్రత కొనసాగుతోంది. ఉత్తరాది జిల్లాల్లో పొగమంచు విపరీతంగా కురుస్తోంది. చలి కూడా తీవ్రంగా ఉండటంతో వృద్ధులు, పిల్లలు వణికిపోతున్నారు. ఉదయం 10 అయినా కూడా చల్లని గాలులు వీస్తున్నాయి. దీంతో ఇంట్లో నుంచి బయట అడుగు పెట్టలేని పరిస్థితి ఏర్పడింది.
జనవరి 8 నుంచి 10 వరకు రాష్ట్ర వ్యాప్తంగా బలమైన చలి గాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ-హైదరాబాద్) అంచనా వేస్తోంది. అప్పటి వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణంగా ఉండవచ్చని, కానీ ఆ తర్వాత కనిష్ట ఉష్ణోగ్రతలు 2-4 డిగ్రీల సెల్సియస్ వరకు పడిపోవచ్చని ఐఎండీ తెలిపింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 5 డిగ్రీల వరకు తగ్గుతాయని, హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాల్లో 7-9 డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. రాబోయే 5 రోజులు పొగమంచు పరిస్థితులు కొనసాగుతాయని ఐఎండీ పేర్కొంది. ప్రజలు జాగ్రత్తలు పాటించి, చలి తీవ్రత నుంచి రక్షణ పొందాలని సూచించారు.
ఈ ఉష్ణోగ్రతలు సంక్రాంతి పండుగ వరకు కొనసాగే అవకాశం ఉందని తెలంగాణ వెదర్ మ్యాన్ పేర్కొన్నారు. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, దీర్ఘకాలిక రోగాలతో బాధపడేవారు వెచ్చని ప్రదేశాల్లో ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
సోమవారం రాత్రి నుంచి మంగళవారం వరకు హైదరాబాద్లో కొన్ని ప్రాంతాల్లో 11.6 డిగ్రీల సెల్సియస్ నుంచి 15 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హెచ్సీయూ క్యాంపస్లో 11.6 డిగ్రీల సెల్సియస్, మౌలాలీలో 11.8, రాజేంద్రనగర్లో 12.2, ఆర్సీ పురంలో 12.2, అల్వాల్లో 13.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.
రాష్ట్ర వ్యాప్తంగా పరిశీలిస్తే.. కోహిర్(సంగారెడ్డి)లో 9 డిగ్రీలు, తిర్యానీ(ఆసిఫాబాద్) 9.6, సిర్పూర్(ఆసిఫాబాద్) లో 9.7, మొయినాబాద్(రంగారెడ్డి)లో 10.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.
ఇవి కూడా చదవండి..
HMPV | హెచ్ఎంపీవీ కలకలం.. ఈ ఆహార పదార్థాలతో చెక్ పెట్టండిలా..!
Harish Rao | మొట్టమొదటి హామీకే దిక్కు లేకుండా పోయింది..! కాంగ్రెస్ గ్యారెంటీలపై హరీష్రావు ఫైర్