శుక్రవారం 05 మార్చి 2021
Telangana - Dec 07, 2020 , 00:50:00

అంబేద్కర్‌ స్ఫూర్తిగా సంక్షేమ పథకాలు

అంబేద్కర్‌ స్ఫూర్తిగా సంక్షేమ పథకాలు

  • రాజ్యాంగ నిర్మాతకు సీఎం కేసీఆర్‌ ఘన నివాళి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: డాక్టర్‌ అంబేద్కర్‌ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఘనంగా నివాళి అర్పించారు. అంబేద్కర్‌ దేశానికి చేసిన గొప్ప సేవలను గుర్తుచేసుకొన్న సీఎం.. ఆయన తాత్వికత, ఆలోచనలు, ఉన్నతమైన ఆదర్శాలు దేశ ప్రజలకు స్ఫూర్తి,  ధైర్యాన్ని ఇస్తూనే ఉన్నాయని చెప్పారు. అంబేద్కర్‌ ఆలోచనలకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించిందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దళితుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నదని, అంబేద్కర్‌ ఆశయాలకు అనుగుణంగా పలు సంక్షేమ, ఆర్థికచేయూత పథకాలను సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్నారని మైనార్టీ సంక్షేమం, ఎస్సీ అభివృద్ధిశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ తెలిపారు. అంబేద్కర్‌ పోరాటం వల్లే రిజర్వేషన్లు అమలవుతున్నాయని.. విద్య, ఉద్యోగ, రాజకీయరంగాల్లో ఎస్సీ, ఎస్టీలు ఎదుగుతున్నారని అన్నారు. ఎస్సీల ప్రగతికి రాష్ట్రప్రభుత్వం బడ్జెట్‌లో రూ.15,600 కోట్లు కేటాయించిందని గుర్తుచేశారు. 671 ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలను ఏర్పాటు చేసి పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నట్టు వివరించారు. అంబేద్కర్‌ ఓవర్సీస్‌ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ప్రభుత్వం రూ.20 లక్షలు అందిస్తున్నదని, సీఎం ఎంటర్‌ప్రెన్యూర్‌ షిప్‌ అండ్‌ ఇన్నోవేషన్‌ పథకం ద్వారా దళితులు పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతున్నారని తెలిపారు. ఎస్సీల గృహాలకు 101 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్తు సరఫరా చేస్తున్నామన్నారు.


VIDEOS

logo