KTR | హైదరాబాద్ : తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన దోపిడీ ముఠా రాష్ట్రంలో తిరుగుతుందన్నారు. రేవంత్ సోదరులతో పాటు ఆరుగురు సభ్యులతో కూడిన ఓ టీమ్‌ను కంపెనీల్లో వసూళ్ల కోసం రేవంత్ రెడ్డి తిప్పుతున్నాడని కేటీఆర్ సంచలన ఆరోపణ చేశారు.
కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. తిరుపతిరెడ్డి, కొండల్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, రోనిన్ రెడ్డి, ఫహీం ఖురేషి, ఏవి రెడ్డి.. ఆరుగురితో కూడిన ఆలీబాబా అర డజన్ దొంగల గ్యాంగ్ తెలంగాణ రాష్ట్రంలో తిరుగుతుంది. ఈ ముఠా కంపెనీలను బెదిరిస్తూ బ్లాక్ మెయిల్ చేస్తూ వసూళ్లకు తెగబడుతున్నది. వీరు కబ్జాలతో పాటు, భూ దందాలను చేస్తున్నారు. వీరి వసూళ్లను, బ్లాక్మెయిల్ని, భూ దందాలను పక్కదారి పట్టించడం కోసమే అనేక అంశాలను కాంగ్రెస్ అనవసరంగా తెరమీదకి తీసుకువస్తుంది అని కేటీఆర్ పేర్కొన్నారు.
కొన్ని రోజులు కాళేశ్వరం, కొన్ని రోజులు ఫోన్ టాపింగ్.. ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వం టైం పాస్ చేస్తుంది. మేము గతంలో చేసిన పెట్టుబడి ప్రయత్నం ఫలితంగానే ఈరోజు పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. ఉపాధి అవకాశాలు దొరుకుతున్నాయి. కానీ 40 వేల కోట్ల రూపాయల ప్రకటనలు చేసిన రేవంత్ రెడ్డి.. పెట్టుబడులు ఏవి కూడా తెలంగాణకు రాలేదు అని కేటీఆర్ తెలిపారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇయ్యకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు పోతే ఊరుకోము. బడుగు బలహీన వర్గాల తరఫున కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జగిత్యాలలో జరుగుతున్న అంశాలపైన కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసాల పైన దృష్టి సారిస్తే మంచిది. సొంత పార్టీ నాయకులను చంపుతున్న కాంగ్రెస్‌పై ఫోకస్ చేయాలి. సొంత పార్టీలో ఉండి తమ సొంత పార్టీ నాయకులను హత్య చేస్తే కూడా కాపాడుకోలేని వారు మా గురించి మాట్లాడుతున్నారు. రాహుల్ గాంధీ కూడా నేషనల్ హెరాల్డ్, ఆర్ఎస్ఎస్ను తిట్టిన కేసులో సుప్రీంకోర్టులో వేసిన క్వాష్ పిటీషన్ వెనక్కి తీసుకున్నారు. మరి రాహుల్ గాంధీ చేస్తే ఒప్పు.. మేము చేస్తే తప్పు అవుతుందా? నాకు ఉన్న అన్ని న్యాయపరమైన హక్కులను వినియోగించుకుంటే తప్పు ఏమిటి..? లేకుంటే ప్రభుత్వం చేస్తున్న దుష్ట ప్రచారాన్ని.. తన మీడియా సంస్థలతో చేస్తున్న మీడియా ట్రెయిల్‌ను అంగీకరించినట్టే అవుతుంది. అందుకే కోర్టులో నాకు ఉన్న అవకాశాలను ఉపయోగించుకున్న అని కేటీఆర్ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Free Bus | ఫ్రీ బస్సు పేరుతో మగపిల్లలకు ఇజ్జత్ లేకుండా చేసిండు.. రేవంత్‌పై మండిపడ్డ మహిళ
KTR | చేవెళ్లలో త్వరలోనే ఉప ఎన్నిక.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
KTR | 37 రోజులు కాదు.. దమ్ముంటే 370 రోజులు జైల్లో పెట్టుకో.. సీఎం రేవంత్‌కు తేల్చిచెప్పిన కేటీఆర్