KTR | హైదరాబాద్ : ఈ ఏడాది పాలనలోనే తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వంపై మనసు విరిగిందని, మళ్లీ అధికారం కేసీఆర్‌కే దక్కుతుందని ఓ సర్వే ప్రతినిధి చెప్పినట్లు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో రూపొందించిన నమ్మి నానబోస్తే షార్ట్ ఫిల్మ్ ప్రివ్యూ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు.
ఇవాళ నా వద్దకు ఓ సర్వే ప్రతినిధి వచ్చి.. ఈ ఏడాది పాలన గురించి విశ్లేషణాత్మకంగా చెప్పారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తే ఎలా ఉంటుందో చెప్పారు. ఆయన చెప్పిన మాట ఏంటంటే.. సహజంగా ఏ ప్రభుత్వం మీద అయినా మూడు, నాలుగేండ్ల తర్వాత కోపం వస్తది.. తెలంగాణ ప్రజలకు ఓపిక పట్టే గుణం ఉంది. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఏడాదిలోనే మనసు విరిగింది. కేసీఆర్ నాయకత్వంలో పోరాటాలు చేస్తున్నారో దీన్ని తప్పకుండా కొనసాగించండి.. అధికారం కేసీఆర్‌కు దక్కుతుందని చెప్పారని కేటీఆర్ తెలిపారు.
గాంధీ భవన్ బోసిపోతోంది… తెలంగాణ భవన్ నిత్యం కళకళలాడుతోంది. లగచర్ల గిరిజన ఆడబిడ్డలు అందరూ వచ్చి తమ కుటుంబ సభ్యులను జైలు నుంచి విడిపించాలని కోరారు. వారి విడుదల కోసం లీగల్ సెల్ బృందం కష్టపడి న్యాయ పోరాటం చేస్తున్నారు. గిరిజన రైతులను బయటకు తీసుకొస్తామని ధైర్యం చెప్పాను. ఈ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్, ఎస్సీ, ఎస్టీ కమిషన్లకు కూడా ఫిర్యాదులు చేశాం. ఇక మా బకాయిలు ఇప్పించాలని మాజీ సర్పంచ్‌లు అడిగారు. ఆశా వర్కర్లు మా గురించి అసెంబ్లీలో మాట్లాడాలని కోరుతున్నారు. ఈ ఒక్కరోజే అందరూ తెలంగాణ భవన్‌కు వచ్చి తమ సమస్యలను విన్నవించుకున్నారని కేటీఆర్ తెలిపారు.
సూటిగా, సుత్తి లేకుండా సామాన్యుడికి అర్థమయ్యే విధంగా నమ్మి నానబోస్తే షార్ట్ ఫిల్మ్‌లో స్పష్టంగా చెప్పారు. గుండెకు తట్టే విధంగా చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలంగాణ ప్రజలు రగిలిపోతున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలను లేవనెత్తుతాం. ప్రజల తరపున ప్రభుత్వంపై తప్పకుండా పోరాటం చేస్తాం. మనకు అధికారం మాత్రమే పోయింది.. పోరాట యావ, చేవ పోలేదు. ప్రజల్లో అభిమానం ఏ మాత్రం తగ్గలేదు.. పెరిగింది అని కేటీఆర్ స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
KTR | ఈ ఏడాదిలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాం.. ‘నమ్మి నానబోస్తే’ షార్ట్ ఫిల్మ్ ప్రివ్యూలో కేటీఆర్
Earthquake | తెలంగాణలో మరోసారి భూప్రకంపనలు.. మహబూబ్‌నగర్ జిల్లాలో భూకంప కేంద్రం
Harish Rao | రేవంత్ రెడ్డి.. మాట మార్చడమే మీ విధానమా?: హరీశ్‌రావు