– డీఆర్డీఓ పీడీ శేఖర్ రెడ్డి
కనగల్, మార్చి 10 : గ్రామాలలో ఉపాధి పథకం ద్వారా కూలీలు పనులు కోరిన వెంటనే కల్పించాలని క్షేత్రస్థాయి అధికారులను డీఆర్డీఓ పీడీ ఎర్రబెల్లి శేఖర్ రెడ్డి ఆదేశించారు. 2024-2025 సంవత్సరంలో ఉపాధి పథకం ద్వారా కనగల్ మండలంలోని గ్రామాలలో చేపట్టిన పనులపై గత వారం రోజులపాటు క్షేత్రస్థాయి బృందం తనిఖీ చేసింది. అందులో భాగంగా మంగళవారం ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన మండల స్థాయి 15వ విడత సామాజిక తనిఖీ ప్రజా వేదిక కార్యక్రమానికి పీడీ శేఖర్ రెడ్డి హాజరయ్యారు. 31 గ్రామపంచాయతీల వారిగా 426 పనులకు గాను కూలీల వేతనాల కింద 3 కోట్ల 85 లక్షల 21 వేల 725 రూపాయలు, మెటీరియల్ కింద 29 లక్షల 03 వేల 452 రూ:లు ఖర్చు చేసిన పనుల వివరాల నివేదికలను చదివి వినిపిస్తుండగా నివేదిక పత్రాలను పీడీ అధ్యయనం చేశారు.
ఈ సందర్భంగా పీడీ మాట్లాడుతూ కూలీల హాజరు పట్టిక సక్రమంగా చేపట్టాలని, పని ప్రదేశంలో కొలతల నిర్వహణ సక్రమంగా జరిగినప్పుడే పనికి తగ్గ వేతనం కూలీలకు అందుతుందన్నారు. జాబ్ కార్డులో పేరు నమోదు, కూలీల అకౌంట్ నంబర్లు సరి చూసుకున్న తర్వాతనే ఫీల్డ్ అసిస్టెంట్లు ఆన్లైన్ మాస్టర్లలో వారి పేర్లను పొందుపరచాలన్నారు. రికార్డులో తప్పులు దొర్లితే సమస్యలు ఉత్పన్నమవుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఈజీఎస్ జిల్లా విజిలెన్స్ అధికారి చకిలం వేణుగోపాలరావు, అంబుడ్స్మెన్ గౌరీ, ఇన్చార్జి ఎంపీడీఓ పుట్టా సతీశ్ కుమార్, ఏపీఓ బి.సుధాకర్, ఎస్ఆర్పి గంగరాజు, పి ఆర్ ఏ ఈ రామకృష్ణ, టీఏ లు ఎం.రమేశ్, హరికృష్ణ, యాదయ్య, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, సామాజిక తనిఖీ బృందం పాల్గొంది.