– రామన్నపేట ప్రభుత్వ ఆస్పత్రిని వంద పడకలుగా మార్చాలని డిమాండ్
రామన్నపేట, మార్చి 10 : రామన్నపేట ప్రభుత్వ ఆస్పత్రిని వంద పడకల ఆస్పత్రిగా మార్చి రాబోయే రాష్ట్ర బడ్జెట్లో రూ.40 కోట్లు కేటాయించి నూతన భవనం నిర్మించాలని సిపిఎం ఆధ్వర్యంలో ఈ నెల 16 నుండి జరిగే నిరవధిక నిరాహార దీక్షలను జయప్రదం చేయాలని రైతు సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు మేక అశోక్ రెడ్డి, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు జల్లెల పెంటయ్య పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక రావనపేట రహదారి బంగ్లాలో నిరాహార దీక్షల కరపత్రాన్ని అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాల నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 60 ఏండ్ల క్రితం ఏర్పాటు చేసిన ప్రభుత్వ ఆస్పత్రి పరిసర గ్రామాల ప్రజలకు వైద్య సౌకర్యాలు అందిస్తూ నేడు సమస్యల వలయంలో ఉందన్నారు. పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందకపోవడంతో సుదూర ప్రాంతాలకు వెళ్లి ప్రైవేట్ ఆసుపత్రులని ఆశ్రయించాల్సి వస్తుందని తెలిపారు.
రోజుకు 400 మంది అవుట్ పేషెంట్లు వస్తున్నా కనీసం రోగులకు తగ్గ డాక్టర్లు లేకపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అనేకసార్లు ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ యంత్రాంగం, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా, ప్రజలు అనేక దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నా పాలకులు చొరవ చూపడం లేదన్నారు. ఎన్నికలప్పుడే ప్రజలకు మాయమాటలు చెప్పి మభ్య పెట్టడం తప్ప అడుగు ముందుకు పడడం లేదన్నారు. ఏరియా ఆస్పత్రి బోర్డు పెట్టి 15 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ 30 పడకలకే పరిమితమైందని తెలిపారు. వెంటనే బడ్జెట్ సమావేశాల్లో వంద పడకల ఆస్పత్రికి ప్రత్యేక నిధులు కేటాయించాలని లేని పక్షంలో మండల వ్యాప్త ప్రజలను సమీకరించి ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం, టీడీపీ మండల నాయకుడు ఫజల్ బేగ్, సిపిఐ మండల నాయకులు రచ్చ యాదగిరి, ఏంఆర్పిఎస్ మండల అధ్యక్షుడు నోముల చిరంజీవి, సిపిఎం జిల్లా కమిటి సభ్యుడు వనం ఉపేందర్, మండల కార్యదర్శి వర్గ సభ్యులు బోయిని ఆనంద్, కందుల హనుమతు, మండల కమిటి సభ్యులు గొరిగే సోములు, గన్నేబోయిన విజయభాస్కర్, ఎండీ రషీద్, బావండ్లపల్లి బాలరాజు, బోడిగే రజిత, పట్టణ శాఖ కార్యదర్శి మునికుంట్ల లెనిన్, రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర కమిటి సభ్యుడు ఆవనగంటి స్వామి, ప్రజానాట్య మండలి జిల్లా అధ్యక్షుడు గంటెపాక శివ కుమార్, దుబ్బాక సర్పంచ్ గట్టు నర్సింహా, పల్లె సత్యం, మేడి గణేష్, ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి పుట్టల ఉదయ్, డివైఎఫ్ఐ మండల అధ్యక్షుడు శానగొండ రామచంద్రం, శాఖ కార్యదర్శులు గోగు లింగస్వామి, శానగొండ వెంకటేశ్వర్లు, పెండెం భ్రహ్మయ్య, రమేశ్ పాల్గొన్నారు.