KTR | హైదరాబాద్ : ఈ ఏడాది కాలంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాం అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో రూపొందించిన నమ్మి నానబోస్తే షార్ట్ ఫిల్మ్ ప్రివ్యూ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు.
మన పార్టీ తెలంగాణ కోసం ఏర్పడ్డది. ఇంకో నాలుగు నెలలు అయితే పార్టీ ఏర్పడి 24 ఏండ్లు నిండి 25వ వసంతంలోకి అడుగు పెడుతుంది. నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి 18 ఏండ్లు దాటింది. నాకున్న అవగాహన, ఆలోచన మేరకు ఈ ఏడాది మనకు అత్యంత గడ్డుకాలం అని చెప్పక తప్పదు. ఉద్యమంలో తట్టుకున్నాం.. నిలబడ్డాం.. ప్రజలు మనతోని ఉన్నారు. అందర్నీ జాగృతం చేస్తూ కదిలాం. కేసీఆర్ దీక్షా దివస్.. తదనంతరం డిసెంబర్ 9న ఒక ప్రకటన వచ్చింది. దీన్ని విజయ్ దివస్‌గా జరుపుకుంటున్నాం. ఈ రెండు లేకపోతే జూన్ 2 లేనే లేదు. ఈ క్రమంలో వివిధ కార్యక్రమాలు తీసుకున్నాం. రసమయి బాలకిషన్ మంచి ఆలోచనతో వచ్చారు. మాకు కూడా ఒక రోజు కేటాయించాలి. ఈ ఏడాది కాలంలో ఏం జరిగిందో చూపిస్తామని అడిగారు. ఇవాళ నిజంగా 22 నిమిషాల షార్ట్ ఫిల్మ్ చూస్తుంటే.. క్షేత్ర స్థాయిలో ప్రతి ఒక్కరికి ఆలోచన కలిగించేలా ఉంది. ఎక్కడా కూడా శృతిమించకుండా, సహజంగా నటించారు. మన ఇండ్లలో మాట్లాడే మాటలు, వాస్తవ పరిస్థితులను కళ్లకు కట్టేలా చూపించారు అని కేటీఆర్ తెలిపారు.
ఈ ఏడాది ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాం. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అడ్డగోలు హామీలతో గట్టెక్కింది. ఆ తర్వాత కేసీఆర్ తుంటి ఎముక విరగడంతో ఆస్పత్రి పాలయ్యారు. మరో వైపు పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోవడం.. కవితను ఐదున్నర నెలలు జైల్లో పెట్టడం.. మన పార్టీ బ్యానర్ మీద గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు వెళ్లిపోవడం. ఈ పరిస్థితుల మధ్య ఇంకో పార్టీ అయితే కుంగిపోతుండే. కానీ పోరాటాల నుంచి పుట్టిన పార్టీ.. త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డది కాబట్టి ఎక్కడా కుంగిపోలేదు.. కేసీఆర్ స్ఫూర్తితో నిటారుగా నిలబడ్డామని కేటీఆర్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
Harish Rao | రేవంత్ రెడ్డి.. మాట మార్చడమే మీ విధానమా?: హరీశ్‌రావు
Earthquake | తెలంగాణలో మరోసారి భూప్రకంపనలు.. మహబూబ్‌నగర్ జిల్లాలో భూకంప కేంద్రం
TTD Donors | తిరుమలలో దాతలకు సంవత్సరానికి మూడు వీఐపీ బ్రేక్ దర్శనాలు