తిరుమల : ఆనంద నిలయం అనంత స్వర్ణమయం(Ananta Swarnamayam ) పథకానికి విరాళం ఇచ్చిన దాతలకు వీఐపీ బ్రేక్ (జనరల్) (VIP break darshans ) దర్శనాలను ఇవ్వాలని టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుంది. 2008లో టీటీడీ (TTD) సంకల్పించిన ఈ పథకాన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల నిలిపివేశారు. అప్పట్లో ఈ పథకానికి విరాళం ఇచ్చిన దాతలకు అర్చనానంతర దర్శనం కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు.
అర్చనానంతర దర్శనానికి బదులుగా గరిష్టంగా 5గురు కుటుంబ సభ్యులకు సంవత్సరానికి 3 రోజులు వీఐపీ బ్రేక్ జనరల్ దర్శనాలకు అనుమతి ఇవ్వాలని, రూ. 2,500 టారిఫ్‌లో సంవత్సరానికి 3 రోజులు వసతి , సంవత్సరానికి ఒకసారి 20 చిన్న లడ్డూలు( Laddu) ప్రసాదంగా అందించాలని నిర్ణయించింది.
దాతల దర్శన సమయంలో సంవత్సరానికి ఒకసారి బహుమానంగా ఒక దుపట్టా, ఒక బ్లౌజ్, మొదటిసారి దర్శన సమయంలో 5 గ్రాముల బంగారు డాలర్, 50-గ్రాముల వెండి నాణెం బహుమానంగా ఇవ్వనున్నట్లు వెల్లడించింది. సంవత్సరానికి ఒకసారి పది మహాప్రసాదం ప్యాకెట్లు, విరాళం పాస్‌బుక్ జారీ చేసిన తేదీ నుంచి 25 సంవత్సరాల పాటు ఈ సేవలు అందుతాయని స్పష్టం చేసింది.