మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సన కాంబినేషన్లో వస్తున్న భారీ చిత్రం ‘పెద్ది’. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి ఇటీవల విడుదలైన రెండో సాంగ్ ‘రై రై రా రా’ (Rai Rai Raa Raa) ప్రస్తుతం యూట్యూబ్‌లో నంబర్ 1 పొజిషన్లో ట్రెండింగ్ అవుతూ సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన ఈ మాస్ అంథెమ్, విడుదలైన కొద్ది సేపటికే మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ఈ పాటలో రామ్ చరణ్ తనదైన శైలిలో అదిరిపోయే డ్యాన్స్ మూమెంట్స్‌తో అలరించగా, హీరోయిన్ జాన్వీ కపూర్ తన గ్లామర్‌తో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.
పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ ఊర మాస్ లుక్‌లో కనిపిస్తుండగా, కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, బోమన్ ఇరానీ, దివ్యేందు శర్మ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వృద్ధి సినిమాస్, మైత్రి మూవీ మేకర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 30, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తుది దశలో ఉండగా, రామ్ చరణ్ తన పార్ట్ డబ్బింగ్‌ను కూడా ప్రారంభించినట్లు సమాచారం.