ChatGPT : ఇరాన్‌తో ఇజ్రాయెల్, అమెరికా చేస్తున్న యుద్ధం ప్రభావం టెక్ ఏఐ కంపెనీలపై పడుతోంది. తాజాగా ఓపెన్ఏఐ సంస్థకు చెందిన చాట్‌జీపీటీని యూజర్లు భారీ సంఖ్యలో డిలీట్ చేస్తున్నారు. ఇరాన్ యుద్ధం దీనికి పరోక్ష కారణంగా నిలిచింది. ఇటీవల అమెరికా రక్షణ శాఖతో ఓపెన్ఏఐ ఒక ఒప్పందం కుదుర్చుకుంది. అంటే అమెరికా ప్రభుత్వానికి చెందిన రక్షణశాఖతో చాట్‌జీపీటీ కలిసి పని చేస్తుంది.
ఇటీవల ఆంథ్రోపిక్ సంస్థకు చెందిన క్లాడ్ దీనికి అంగీకరించలేదు. కానీ, ఓపెన్ఏఐ మాత్రం అమెరికాతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇదే ఇప్పుడు ఆ సంస్థకు ఇబ్బందిగా మారింది. అమెరికా రక్షణ శాఖతో ఓపెన్ఏఐ కలిసి పని చేయడాన్ని చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. అది ప్రభుత్వ శాఖ. అవసరమైతే యుద్ధాలు చేస్తుంది. ఇది ప్రైవేట్ టెక్ సంస్థ. స్వతంత్రంగా వ్యవహరించాలి. అలాంటిది యుద్ధాలు చేసే ఒక శాఖతో ఒప్పందం కుదుర్చుకోవాల్సిన అవసరం ఏంటని చాలా మంది చాట్‌జీపీటీ యూజర్లు ప్రశ్నిస్తున్నారు. కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ భారీ సంఖ్యలో చాట్‌జీపీటీ యాప్‌ను అన్ఇన్స్టాల్ చేస్తున్నారు. డిలీట్ చేస్తున్నవారి శాతం దాదాపు 300 శాతం పెరిగింది. ఇరాన్ యుద్ధం సమయంలో.. యుద్ధ రంగానికి సహకరించేలా కంపెనీ నిర్ణయం ఉందని యూజర్లు అంటున్నారు.
దీనివల్ల తమ డాటాకు రక్షణ ఉండదని అభిప్రాయపడుతున్నారు. అయితే, దీనిపై ఓపెన్ఏఐ సీఈవో అల్ట్‌మాన్ స్పందిచారు. ఈ ఒప్పందం విషయంలో పరిమితులున్నాయన్నారు. తాజా విమర్శల నేపథ్యంలో అమెరికాతో ఒప్పందంలో మార్పులు చేశామని, తమ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. దీనికి సంబంధించిన ఒక మెమోను కూడా ఆయన తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇరాన్ యుద్ధం సందర్భంగా అమెరికా ఒత్తిడికి తలొగ్గి ఒప్పందం కుదుర్చుకున్న చాట్‌జీపీటీని యూజర్లు భారీగా డిలీట్ చేస్తుంటే.. ఆంథ్రోపిక్ సంస్థకు చెందిన క్లాడ్ యాప్‌ను ఎక్కువగా ఇన్స్టాల్ చేసుకుంటున్నారు. ఇది 51 శాతం పెరిగింది.