NBK 111 | నందమూరి బాలకృష్ణ మరియు దర్శకుడు గోపీచంద్ మలినేనిల క్రేజీ కాంబినేషన్లో వస్తున్న పీరియాడిక్ డ్రామా షూటింగ్ ఎట్టకేలకు బుధవారం రాత్రి ప్రారంభమైంది. సతీష్ కిలారు నిర్మాణంలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై అత్యంత భారీ వ్యయంతో రూపొందుతున్న ఈ చిత్రం బాలయ్య కెరీర్లో 111వ ప్రాజెక్ట్ కావడం విశేషం. ఈ సినిమా ప్రారంభానికి సంబంధించి సినిమాటోగ్రాఫర్ అరవింద్ ఎస్ కశ్యప్ షూటింగ్ లొకేషన్ నుండి ఒక ఆసక్తికరమైన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోవడంతో నందమూరి అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. చారిత్రక నేపథ్యంతో సాగే ఈ కథలో బాలకృష్ణ ఒక శక్తివంతమైన మహారాజు పాత్రలో కనిపించబోతున్నారని, ఈ పాత్ర గత చిత్రాల కంటే భిన్నంగా ఉంటుందని సమాచారం. నయనతార కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు. గతంలో ఈ కాంబినేషన్లో వచ్చిన ‘వీరసింహారెడ్డి’ భారీ విజయాన్ని అందుకోవడంతో, ఈసారి కూడా బాక్సాఫీస్ వద్ద గర్జన అంతకంటే గట్టిగా ఉంటుందని గోపీచంద్ మలినేని ధీమా వ్యక్తం చేశారు. ఇది చరిత్రలో నిలిచిపోయే చిత్రమని ఆయన సోషల్ మీడియా వేదికగా పేర్కొనడం సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది.