Earthquake | తెలంగాణను మరోసారి భూప్రకంపనలు వణికించాయి. మహబూబ్నగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో శనివారం మధ్యాహ్నం 1.22 గంటల ప్రాంతంలో కొద్ది సెకండ్ల పాటు భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.0గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. కౌకుంట్ల మండలం దాసరిపల్లి సమీపంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. దీని ప్రభావంతో కృష్ణ పరివాహక ప్రాంతంలో, జూరాల ప్రాజెక్టుకు ఎగువ, దిగువన ప్రాంతాల్లో భూప్రకంపలు వచ్చాయి.
మూడు రోజుల కిందట కూడా తెలుగు రాష్ట్రాల్లో భూప్రకంనపలు సంచలనం సృష్టించాయి. రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రతతో గోదావరి పరివాహక ప్రాంతాల్లో వచ్చిన ఈ భూకంపం కారణంగా తెలంగాణలోని హైదరాబాద్, హనుమకొండ, వరంగల్, కరీంనగర్, సిద్దిపేట, నల్గొండ, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో ఏడు సెకండ్ల దాకా భూ ప్రకంపనలు వచ్చాయి. తెలంగాణలోని ములుగు జిల్లా మేడారంలో భూకంపం కేంద్రాన్ని గుర్తించారు. భూకంపం కేంద్రానికి చుట్టూ 232 కిలోమీటర్ల పరిధిలో దాని ప్రభావం కనిపించినట్టు పేర్కొన్నారు. తెలంగాణతోపాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్లో ప్రకంపనలు చోటుచేసుకున్నాయని తెలిపారు. ఇంతకుముందు 2018లో చివరిసారిగా తెలంగాణలో భూమి కంపించింది. కాగా 5 కన్నా అధిక తీవ్రతతో దక్షిణ భారతంలో భూమి కంపించడం 55 ఏండ్ల తరువాత అదే మొదటిసారి.
భూకంపాలు సంభవించే ప్రాంతాలను, వాటి తీవ్రత దృష్ట్యా జోన్2, జోన్-3, జోన్-4, జోన్-5గా నాలుగు జోన్లుగా విభజించారు. జోన్-5 అత్యంత భూకంప క్రియాశీల ప్రాంతం. అతితక్కువ తీవ్రత కలిగిన ప్రాంతం జోన్-2. ప్రస్తుతం తెలంగాణ అతి తక్కువ స్థాయి భూకంపాలు సంభవించే జోన్-2లో ఉంది. గోదావరి పరివాహక ప్రాంతంలో ఫాల్ట్ జోన్ ఉంది. ఇది భూకంపానికి కారణమవుతుంది. ఫాల్ట్ జోన్ అంటే భూమి అంతర్భాగంలో రెండు బ్లాకులు ఒకదానితో ఒకటి అకాస్మాత్తుగా జారిపోయే ప్రదేశం. ఒక్కోసారి అంతర్భాగంలో సర్దుబాటుల కారణంగా విడుదలయ్యే అపారమైన శక్తి భూకంపాలుగా వస్తుంది. గోదావరి బేసిన్లో పలు చోట్ల పగుళ్లు, లోపాటు ఉన్నట్లు భూకంప శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇదే ఈ ప్రాంతంలో భూకంపాలకు కారణమవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.