IndiGO CEO : ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బెర్స్ (Pieter Elbers) రాజీనామా చేశారు. నిరుడు డిసెంబర్లో ఇండిగో చరిత్రలోనే తీవ్రమైన సంక్షోభం సమయంలో విమర్శల పాలైన ఆయన ఎట్టకేలకు సీఈఓ బాధ్యతల నుంచి మంగళవారం వైదొలిగారు. పీటర్ తప్పుకున్నందున తదుపరి సీఈవో ఎవరు? అనే ప్రశ్న ఎదురవ్వకుండా చూసుకుంది యాజమాన్యం.
ఇండిగో సంక్షోభం సమయంలో తీవ్ర విమర్శల పాలైన సీఈవో పీటర్ అల్బెర్స్ మూడు నెలల తర్వాత రాజీనామా చేశారు. ఇప్పటికిప్పుడు కొత్తవారిని నియమించకుండా.. తాత్కాలిక సీఈవోగా రాహుల్ భాటియా (Rahul Bhatia) కొనసాగుతారని ఇండిగో తెలిపింది. ప్రస్తుతం మేనేజింగ్ డైరెక్టర్‌గా సేవలందిస్తున్న భాటియా కొన్ని రోజులు తమ కంపెనీ వ్యవహారాలను చూసుకుంటారని సంస్థ పేర్కొంది.
IndiGo CEO Pieter Elbers resigns; airline says he is relieved with immediate effect. pic.twitter.com/qQ2S0Ysk3o
— Press Trust of India (@PTI_News) March 10, 2026
నిరుడు డిసెంబర్ ప్రారంభంలో ఇండిగో సంస్థ తీవ్రమైన సంక్షోభాన్ని చవిచూసింది. విమాన విధుల సమయ పరిమితి(ఎఫ్డీటీఎల్) ఆచరణలో సంస్థ సన్నద్ధతలోపంతోనే సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. డిసెంబర్ 3 నుంచి 5వ తేదీ వరకూ.. మూడు రోజుల వ్యవధిలోనే 2,507 విమానాలను రద్దు చేశారు. ఫలితంగా పలు విమానాశ్రయాల్లో 3 లక్షలకు మందికిపైగా ప్రయాణికులు పడిగాపులు కాస్తూ తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. ఇండిగో సంక్షోభంపై కేంద్రప్రభుత్వం అత్యున్నత స్థాయి విచారణకు ఆదేశించింది. సీఈఓగా పీటర్ ఎల్బెర్స్ విఫలమయ్యారని మీడియా కథనాలు ఆయనపై దుమ్మెత్తిపోశాయి. దాంతో.. ఆయన వీడియో మెసేజ్‌తో ప్రయాణికులకు క్షమాపణలు తెలిపారు.
BREAKING NEWS 🚨
IndiGo CEO Pieter Elbers claims “All operations fully stabilised, full refund assured to customers” pic.twitter.com/0uXr9nMjCr
— News Algebra (@NewsAlgebraIND) December 9, 2025
‘కొన్ని రోజులుగా విమాన సర్వీస్‌ల విషయంలో అంతరాయాలు చూస్తున్నాం. అప్పటి నుంచి ఈ పరిస్థితి మరింత జఠిలంగా మారింది. డిసెంబర్ 5, శుక్రవారం మాత్రం సర్వీస్‌లపై తీవ్ర ప్రభావం పడింది. ఈ ఒక్కరోజే 1000కి పైగా విమానాలను రద్దు చేశాం. ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నందుకు నా తరఫున, మా సంస్థ ఇండిగో తరఫున మీఅందరికీ క్షమాపణలు తెలియజేస్తున్నా. సర్వీస్‌లు ఆలస్యంగా నడవడం, పలు విమానాలు రద్దు కావడంతో చాలామంది కష్టాలు పడుతున్నారు. ఇండిగోలో సాధారణ పరిస్థితులు నెలకొనడానికి కనీసం పది రోజులు పట్టేలా ఉంది. డిసెంబర్ 10-15 వరకూ సర్వీస్‌లు యథావిధిగా నడిచే అవకాశముంది’ అని పీటర్స్ పేర్కొన్నారు. ఇండిగో సంక్షోభంపై భగ్గుమన్న డీజీసీఏ.. సంస్థ షెడ్యూల్‌పై కోత విధించింది. ఫిబ్రవరి 10 నాటికి 10 శాతం సర్వీస్లకే అనుమతిచ్చింది. అంతేకాదు జనవరి 17న ఇండిగోపై రూ.22 కోట్ల జరిమానా వేసింది. అలానే అప్పటి సీఈవో పీటర్ సహా ఇద్దరు సీనియర్ ఎగ్జిక్యూటివ్ అధికారులను డీజీసీఏ హెచ్చరించింది.