KTR | రంగారెడ్డి : రాష్ట్రంలో ఏ ఒక్క ఊరిలోనైనా వంద శాతం రుణమాఫీ అయిందని రాసిస్తే.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలమంతా రాజీనామా చేస్తామని సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో ఏర్పాటు చేసిన రైతు సభలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
ఇవాళ పేపర్లలో బెస్ట్ జోక్ చూసినా.. రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయిండు.. అక్కడ స్పీచ్ ఇస్తుండు.. తెలంగాణలో మొత్తం ఉద్ధరించిన.. ఢిల్లీలో కూడా ఉద్ధరిస్తానని, మీరు నా మాట నమ్మి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వండి. తెలంగాణలో ఆరు గ్యారెంటీలు అమలు చేశాం.. రుణమాఫీ చేశాను. 100 రోజుల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా.. ఢిల్లీలో కూడా అదే చేస్తానని రేవంత్ రెడ్డి చెబుతున్నాడు. అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడా..? కూట్లో రాయి తీయనోడు.. ఏట్లో రాయి తీస్తాడా..? సీఎం అబద్ధాలు చెప్పొచ్చునా..? ఆరు గ్యారెంటీలలో అర గ్యారెంటీ అమలైంది.. అది కూడా ఫ్రీ బస్సు. మా ఊరికి బస్సే దిక్కు లేదు అని కొందరు లొల్లి పెడుతున్నరు. మీరు తిట్టే తిట్లకు రోషమున్నడు అయితే బకెట్లో నీళ్లు నింపుకుని దాంట్లో దూకి చచ్చిపోతాడు. కానీ ఆయన రేవంత్ రెడ్డి.. ఆయనకు రోషం, సిగ్గు లేదు. అబ్దదాలు చెప్పుడు ఆయనకు అలవాటు. ఒక్క మాట అడుగుతున్నా.. ఊర్లల్లో ఒక మాటిస్తే, బాకీ ఇస్తే తిరిగి ఇవ్వకపోతే కేసు పెడుతాం.. 420 కేసు పెడుతాం.. చీటింగ్ చేసిండు అని. మరి ఇన్ని మోసాలు చేసిన కాంగ్రెస్ సర్కార్‌ను విడిచి పెడుదామా..? అని కేటీఆర్ ప్రజలను అడిగారు.
రైతులను రుణమాఫీ పేరిట మోసం చేసిండు. రూ. 2 లక్షల రుణాలను మాఫీ చేసేందుకు డిసెంబర్ 9న సంతకం పెడుతా అన్నాడు. కానీ పూర్తిగా రుణమాఫీ కాలేదు. నీకు నిజాయితీ ఉంటే.. నీ సొంతూరు కొండారెడ్డిపల్లెకు పోదాం.. కొడంగల్‌కు పోదాం.. రుణమాఫీ అయిందని చెప్తే రాజీనామా కాదు రాజకీయ సన్యాసం తీసుకుంటానని అసెంబ్లీలో చెప్పాను. ఉలుకు పలుకు లేదు. రాష్ట్రంలో ఏ ఊరికైనా సరే.. డేట్, ప్లేస్, టైమ్ నీ ఇష్టం.. నువ్వు కాకపోతే నీ మంత్రులను పంపించు. వంద శాతం రుణమాఫీ అయిందని రాసిస్తే మొత్తం బీఆర్ఎస్ నేతలు రాజీనామా చేసి పోతాం. చారణా రుణమాఫీ కూడా కాలేదు. కానీ ఇవాళ డిల్లీకి పోయి రుణమాఫీ చేసిన అని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడని కేటీఆర్ నిప్పులు చెరిగారు.
కేసీఆర్ మీకు బిచ్చమేసినట్టు రైతుబంధు కింద రూ. 10 వేలు ఇస్తుండు.. నన్ను గెలిపిస్తే రూ. 15 వేలు ఇస్తానని అన్నాడు. ఏడాది దాటిపోయింది.. ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఎన్నికలప్పుడు 7600 కోట్లు రైతుబంధు వేసేందుకు మేం సిద్ధమైతే ఈసీకి ఉత్తరం రాసిండు రేవంత్ రెడ్డి. ఈ టైమ్‌లో వేస్తే కేసీఆర్‌కు ఓట్లు వేస్తారని చెబితే మోదీ ప్రభుత్వం ఆపింది. ఎన్నికలు అయిపోయాక రైతులను ఇబ్బంది పెట్టిండు. కేసీఆర్ హయాంలో నాట్లప్పుడు రైతుబంధు పడుతుండే.. ఇప్పుడు ఓట్లప్పుడు పడుతున్నాయి. కేసీఆర్ జమ చేసిన రూ. 7600 కోట్లను పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లప్పుడు వేసిండు. వానాకాలం పంటకు రైతుబంధు ఇవ్వలేదు. అందుకే ఇవాళ ధర్నా పెట్టాం. ఎందుకంటే.. ఇది ప్రారంభం మాత్రమే.. రాష్ట్రమంతా ధర్నాలు పెడుతాం. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం 15 వేలు ఇవ్వాలి రైతుభరోసా. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. వానాకాలం రైతుబందును ఎగ్గొట్టిండు.. దాన్ని కూడా విడిచి పెట్టొద్దు అని కేటీఆర్ చెప్పారు.
ఇవి కూడా చదవండి..
Inter Exam Fee | ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. 25వ తేదీ వరకు ఫీజు చెల్లింపునకు అవకాశం
Nagarkurnool | కల్లు సీసాలో కట్ల పాము ప్రత్యక్షం.. షాకైన బాధితుడు