KTR | నాగర్కర్నూల్ : పేద ప్రజల కడుపు కొట్టడానికి ముఖ్యమంత్రి అయ్యావా..? అని రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఆదర్శ్ నగర్లో కొద్ది రోజుల క్రితం పేదలు, దివ్యాంగులకు చెందిన 75 ఇండ్లను రేవంత్ సర్కార్ నేలమట్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై కేటీఆర్ మాట్లాడారు.
పేదవాళ్లు అనే సోయి లేకుండా, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా.. ఈ ఏడాది ఆగస్టు 29న తెల్లవారుజామున 3 గంటలకు 75 ఇండ్లను నేలమట్టం చేశావు. దివ్యాంగులనే ఇంకితజ్ఞానం లేకుండా వారి నివాసాలపైకి బుల్డోజర్లను పంపి ఇండ్లను కూల్చేశావు. పాలమూరు బిడ్డల ఆశీర్వాదంతోనే సీఎం అయ్యాను.. నేను పాలమూరు బిడ్డను అని పదేపదే చెబుతావు. మరి పేద ప్రజల కడుపు కొట్టడానికి సీఎం అయ్యావా..? అసలు దివ్యాంగుల ఇండ్లను ఎందుకు కూలగొట్టాల్సి వచ్చిందో ఒక్క కారణం చెప్పగలరా..? అని రేవంత్ రెడ్డిని కేటీఆర్ నిలదీశారు.
గవర్నమెంట్ జాగాలో ఇల్లు కట్టుకుంటే.. అలాంటి స్థలాలకు చిత్తశుద్ధితో కేసీఆర్ ప్రభుత్వం 58, 59 జీవో కింద రెగ్యులరైజ్ చేశాం. పేదవాళ్లకు లక్షల పట్టాలు అందజేశాం. జీవో 59 కింద 120 గజాల స్థలం కంటే ఎక్కువ ఉంటే.. నామమాత్రపు ఫీజుతో రెగ్యులరైజ్ చేశాం. మీరేమో దివ్యాంగులను రోడ్డు మీద పడేసి.. వాళ్ల గోస పుచ్చుకున్నారు. ఆ పేదలకు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పది రోజుల పాటు అండగా ఉన్నారు. వాళ్లను శిబిరానికి తరలించి ఆదుకునే ప్రయత్నం చేశారు. రేవంత్ రెడ్డి నీకు సంస్కారం ఉంటే, పేదల పట్ల ప్రేమ ఉంటే.. వెంటనే ఆ 75 మందికి డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయించు. ఏ అధికారులైతే అక్రమంగా, అన్యాయంగా దివ్యాంగులను రోడ్ల మీద పడేశారో వారిపై చర్య తీసుకో. గతంలో నీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన పట్టాను చిత్తు కాగితలం చూసి, విలువ ఇవ్వని అధికారులపై చర్య తీసుకో.. వారిని సస్పెండ్ చేస్తావో, సర్వీసు నుంచి తొలగిస్తావో.. దమ్ముంటే ఏదో ఒక నిర్ణయం తీసుకో అని రేవంత్ రెడ్డిని కేటీఆర్ డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి..
Constable Kistaiah | ఆంధ్రా ఆఫీసర్ అహంకారానికి బలవుతున్న అమరుడు కానిస్టేబుల్ కిష్టయ్య సతీమణి
KTR | వైద్య విద్యార్థుల జీవితాలతో ఏమిటీ చెలగాటం.. ‘స్థానికత’ జీవోపై కేటీఆర్ మండిపాటు
KTR | పాడి కౌశిక్ రెడ్డిపై దాడి సమయంలో విధుల్లో ఉన్న పోలీసులను సస్పెండ్ చేయాలి.. కేటీఆర్ డిమాండ్