KTR | రాష్ట్రంలో ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్ల ప్రక్రియకు బ్రేకులు పడటంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. వైద్య విద్యను అభ్యసించాలని కోటి ఆశలు పెట్టుకున్న విద్యార్థుల జీవితాలతో ఏమిటీ చెలగాటమని ప్రశ్నించారు. పక్క రాష్ట్రాల్లో అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతుంటే.. తెలంగాణలో మాత్రం ఇంకెంత కాలం ఈ సందిగ్ధమని నిలదీశారు.
రాష్ట్రంలో ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్ల ప్రక్రియకు బ్రేకులు పడటం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యానికి నిలువెత్తు నిదర్శనమని కేటీఆర్ విమర్శించారు. విద్యార్థులను ఆగం చేసి.. ఇంకెంత కాలం దీన్ని సాగదీస్తారని ప్రశ్నించారు. తెలంగాణ బిడ్డలను నాన్ లోకల్స్ గా మార్చి, ఇతర రాష్ట్రాల విద్యార్థులకు పెద్దపీట వేసే జీవో 33 అమలు కోసం కాంగ్రెస్ సర్కారు ఎందుకింత మొండిపట్టు పడుతోందని నిలదీశారు. స్థానికతను నిర్ధారించే విషయాన్ని ప్రభుత్వం ఎందుకింత వివాదాస్పదం చేస్తోందని అడిగారు. రోజురోజుకూ ఇంకా ఎందుకు న్యాయపరమైన చిక్కుల్లోకి నెడుతోందని ప్రశ్నించారు.
తమ పిల్లల్ని డాక్టర్లుగా చూడాలని కలలు కంటున్న వేలాది మంది తల్లిదండ్రుల ఆకాంక్షలను దెబ్బతీసే గొడ్డలిపెట్టు లాంటి నిర్ణయాలను ప్రభుత్వం ఇకనైనా వెనక్కి తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. సమైక్య రాష్ట్రంలో కేవలం 5 మెడికల్ కాలేజీలు ఉంటే.. స్వరాష్ట్రంలో 29 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసుకుని వాటి సంఖ్యను 34కు పెంచుకున్నది ఇందుకేనా అని ప్రశ్నించారు. జిల్లాకో మెడికల్ కాలేజీ నినాదాన్ని బీఆర్ఎస్ హయాంలో నిజం చేస్తే.. కాంగ్రెస్ సర్కారు రాగానే దారుణంగా నీరుగారుస్తోందని విమర్శించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో ఎంబీబీఎస్ ను సీట్లను ఏకంగా 8915కు పెంచుకుని రాష్ట్రాన్ని డాక్టర్ల ఫ్యాక్టరీగా తీర్చిదిద్దితే, ఆ సమున్నత లక్ష్యానికి కాంగ్రెస్ సర్కారు తూట్లు పొడుస్తోందని మండిపడ్డారు. నాటి కేసీఆర్ విజన్‌కు.. నేటి కాంగ్రెస్ సర్కారు వైఫల్యంతో గ్రహణం పట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రస్తుతం నీట్ అడ్మిషన్లలో భాగంగా దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్ కౌన్సెలింగ్ కొనసాగుతున్నది. ఆలిండియా కోటా కింద రెండో రౌండ్‌కు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగుతున్నది. కొత్తగా కాలేజీలు మంజూరైన నేపథ్యంలో గడువును పెంచారు. ఇందులో తెలంగాణ నుంచి నాలుగు కాలేజీలు ఉన్నాయి. మహేశ్వరం, మెదక్, కుత్బుల్లాపూర్, యాదాద్రిలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఆలిండియా కోటా కింద 28 సీట్లను రిజర్వ్ చేశారు. రెండో రౌండ్లో ఈ సీట్లను కూడా జతచేశారు. కానీ రాష్ట్రంలో కన్వీనర్ కోటా సీట్ల భర్తీ మాత్రం నిలిచిపోయింది. ‘స్థానికత’ను నిర్ధారించడంలో ప్రభుత్వం విఫలం కావటం, హడావుడిగా జీవో33ను తీసుకురావటంతో అడ్మిషన్ల ప్రక్రియ న్యాయవివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. దీంతో సొంత రాష్ట్రంలో వైద్యవిద్య చదవాలన్న వేల మంది విద్యార్థుల కల త్రిశంకుస్వర్గంలో ఊగిసలాడుతున్నది.
భరోసా ఇవ్వని కాంగ్రెస్ ప్రభుత్వం
స్థానికత’ నిర్ధారణలో తీవ్రంగా విఫలమైన తెలంగాణ వైద్యారోగ్యశాఖ.. విద్యార్థులకు భరోసా కల్పించడంలోనూ నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నది. జీవో-33పై తమ వైఖరిని, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను విద్యార్థులకు ఎందుకు వివరించి చెప్పటం లేదని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. తమ తోటి విద్యార్థులకు అడ్మిషన్లు పూర్తవుతుంటే పిల్లలు మానసికంగా ఆందోళన చెందుతున్నారని వాపోతున్నారు. వాస్తవ పరిస్థితిని వివరిస్తూ ‘మీ భవిష్యత్తుకు ఢోకా లేదు’ అంటూ వైద్యారోగ్యశాఖ నుంచి గానీ, హెల్త్ యూనివర్సిటీ నుంచి గానీ ఒక ప్రకటన కూడా విడుదల చేయకపోవటం ఏమిటని నిలదీస్తున్నారు. యూనివర్సిటీకి వెళ్లి అడిగితే స్పందించే నాథుడే లేడని, ‘మాకేం తెలియదు, హైదరాబాద్‌కు వెళ్లి అడగండి’ అంటూ చేతులెత్తేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జరిగిన పరిణామాలన్నీ వివరిస్తూ, ప్రభుత్వ ఉద్దేశం ఏమిటో తెలియజేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ఆందోళన బాట తప్పదని స్పష్టం చేస్తున్నారు.
ఏపీలో నిరాటంకంగా అడ్మిషన్లు
ఉమ్మడి’ పాలన ముగిసిన నేపథ్యంలో స్థానికతను నిర్ధారించుకోవాల్సిన బాధ్యత ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ మీద పడింది. ఏపీలో ప్రభుత్వం ముందుచూపుతో వ్యవహరించింది. ఫిబ్రవరిలోనే ప్రత్యేక కమిటీ వేసి స్థానికతను నిర్ధారించటంతో ఎంబీబీఎస్ అడ్మిషన్లకు ఎలాంటి ఇబ్బంది కలగటం లేదు. ప్రస్తుతం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఆంధ్రా యూనివర్సిటీ, ఎస్వీయూ పరిధిలో మెరిట్ లిస్ట్‌ను విడుదల చేశారు. వివిధ కారణాలతో స్థానికంగా ఇంటర్ చదవలేని వారికి ‘ఏపీ నాన్‌లోకల్’ స్టేటస్ ఇచ్చి, సీట్లలో కోటా ఇచ్చి భర్తీ చేస్తున్నారు.