LPG Gas Shortage | హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 11 (నమస్తే తెలంగాణ): కాస్మొపాలిటన్ నగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌లో రాత్రీపగలు అన్న తేడా లేకుండా రోడ్డు పక్కన తోపుడు బండ్లు మొదలు స్టార్ హోటళ్ల వరకు ఏ సమయంలోనైనా ఏ అల్పాహారమైనా లభిస్తుంది. ఇక ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల మధ్య రోడ్‌సైడ్ టిఫిన్ సెంటర్లు, తోపుడు బండ్లు, ఉడుపి హోటళ్లు అల్పాహారం కోసం వచ్చేవారితో కిటకిటలాడుతుంటాయి. గ్యాస్ స్టౌలపై ఇడ్లీ, దోశ, పూరీ, బోండా, వడ వాసనలు ఘుమఘుమలాడుతూ నోరూరిస్తుంటాయి. కానీ బుధవారం ఉదయం నగరంలోని చాలా ప్రాంతాల్లో టిఫిన్ సెంటర్లు తమ పొయ్యి వెలిగించలేదు. ‘గ్యాస్ లేదు.. వండలేం’ అని బోర్డులు పెట్టేశాయి. దీంతో ఉదయమే టిఫిన్ల కోసం వాటి వద్దకు వచ్చిన వారు బోర్డు చూసి ఉసూరుమంటూ వెనుదిరిగారు. మరోవైపు నగరంలోని పలు హాస్టళ్లు సైతం టీ, టిఫిన్లు రద్దు చేశాయి. నగరంలో మళ్లీ లాక్డౌన్ నాటి దుస్థితి నెలకొన్నది.
వంట గ్యాస్ కొరత కారణంగా హైదరాబాద్‌లో హోటళ్లు, మెస్‌లు, పీజీ హాస్టళ్లు, మూసివేతకు చేరువయ్యాయి. చాలా హాస్టళ్లు ఉదయం పూట అందించే అల్పాహారం రద్దు చేశాయి. అనేక చిన్న హోటళ్లు సేవలను నిలిపివేశాయి. ఐటీ కారిడార్‌లో హోటల్స్ అసోసియేషన్స్ టీ, కాఫీ, టిఫిన్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. పరిస్థితి ఇలానే కొనసాగితే నగరంలో 90 శాతం ఫుడ్ ఇండస్ట్రీని షట్‌డౌన్ చేసుకోవాల్సిన దుస్థితి నెలకొంటుందని హోటల్స్ అసోసియేషన్లు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. మరోవైపు హాస్టల్స్ మూసివేస్తే నిరుద్యోగులు ఇంటి ముఖం పట్టాల్సిన పరిస్థితులు తలెత్తనున్నాయి. ముఖ్యంగా ఎస్ఆర్నగర్, అమీర్‌పేట్, కేపీహెచ్పీ, మాదాపూర్, కొండాపూర్, అశోక్‌నగర్, దిల్సుఖ్నగర్ వంటి ప్రాంతాల్లో చాలా హాస్టళ్లకు మూసివేత తప్ప మరోమార్గం కనిపించడం లేదు. దీంతో విద్యార్థులు, ఉద్యోగులు, కొలువు కోసం సన్నద్ధమయ్యే నిరుద్యోగులు నగరం వీడాల్సిన పరిస్థితి వస్తుందేమోనని భయభ్రాంతులకు గురవుతున్నారు.
ఇరాన్‌పై అమెరికా యుద్ధపు సెగలు హైదరాబాద్‌ను అతలాకుతలం చేస్తున్నాయి. చమురు, గ్యాస్ దిగుమతులు తగ్గిపోవడంతో హైదరాబాద్‌లో వాణిజ్య గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రమైంది. కమర్షియల్ గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో ఇప్పటికే బెంగళూరు, ముంబై నగరాల్లో భారీ సంఖ్యలో హోటల్స్ మూతపడ్డాయి. ఇప్పుడు ఆ ప్రభావం హైదరాబాద్‌పై పడుతున్నది. వండేందుకు ఎక్కువ సమయం పట్టే వంటకాలను పలు ప్రధాన ఇప్పటికే హోటల్స్ నిలిపివేశాయి. ముఖ్యంగా బిర్యానీతోపాటు మాంసాహార వంటకాలను నిలిపివేశాయి. ఇక హైదరాబాద్ ఐటీ కారిడార్స్ హోటల్స్ అసోసియేషన్ అయితే టీ, కాఫీలను కూడా తాత్కాలికంగా నిలిపివేసినట్టు ప్రకటించింది. కొన్ని వంటకాలు అందుబాటులో లేవంటూ మెనూలు పెడుతున్నారు. ప్రస్తుతం నిల్వ ఉన్న సిలిండర్లు అయిపోతుండటంతో హోటల్స్ మూసివేత తప్పదని అంటున్నారు. గ్యాస్ కొరత నేపథ్యంలో టిఫిన్స్, భోజనాల రేట్లు విపరీతంగా పెరుగుతున్నాయి. మీల్స్‌పై కనీసం రూ.15 వరకు, ఇడ్లీ, ఉప్మా వంటివాటిపై రూ.10 వరకు పెరిగింది. హోటల్స్, రెస్టారెంట్స్ సైతం 15 శాతం వరకు ధరలు పెంచేశాయి. స్విగ్గీ, జొమాటో తదితర ఫుడ్ యాప్‌లకు సైతం గిరాకీ తగ్గినట్టు డెలివరీ బాయ్స్ చెప్తున్నారు.
వంటగ్యాస్ కొరతతో అశోక్‌నగర్, అమీర్‌పేట, దిల్సుఖ్నగర్, ఎస్ఆర్ నగర్, కూకట్పల్లి, మాదాపూర్ తదితర ప్రాంతాల్లో వేలాదిగా ఉన్న వసతి గృహాలు మూడపడేందుకు సిద్ధమవుతున్నాయి. గ్యాస్ కొరత కారణంగా సుమారు 11 వేల హోటల్స్ తాళం వేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. దీంతో నిరుద్యోగులు ఇంటి బాట పట్టాల్సిన దుస్థితి వచ్చింది. తమ బతుకులు ఆగమయ్యాయంటూ శ్రీను అనే నిరుద్యోగి ఆవేదన వ్యక్తం చేశాడు. తమ హాస్టల్ మూసివేస్తున్నట్టు చెప్పారని.. మరో హాస్టల్‌కు వెళ్లడానికి ప్రయత్నిస్తే రెట్టింపు ధరలు వసూలు చేస్తున్నారని వాపోయాడు. అశోక్‌నగర్‌కు చెందిన రవి అనే హాస్టల్ నిర్వాహకుడు తనవద్ద 40 మంది ఉంటారని, రోజూ మూడు గ్యాస్ సిలిండర్లు వినియోగిస్తామని చెప్పాడు. గ్యాస్ కొరత కారణంగా ఇప్పుడు హాస్టల్ నడిపించడం కష్టంగా మారిందని అన్నాడు.
గ్యాస్ కొరతతో నగరవాసులు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలోనే విద్యుత్తు ఆధారంగా పనిచేసే పరికరాల కొనుగోలుకు మొగ్గుచూపుతున్నారు. దీంతో ఒక్కసారిగా ఇండక్షన్ స్టౌలు, ఎలక్ట్రిక్, స్మార్ట్ కుక్కర్లకు డిమాండ్ పెరిగింది. హోం అప్లయెన్సెస్ సంస్థలకు భారీ మొత్తంలో ఆర్డర్లు వస్తున్నాయి. ముందస్తు బుకింగ్‌లో భాగంగా డిమార్ట్, ఇతర సూపర్ మార్కెట్లు, షాపింగ్ మాల్స్ ప్రత్యేక మార్కెటింగ్ విధానంలో భాగంగా డిస్ట్రిబ్యూటర్ల నుంచి భారీ మొత్తంలో కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఎప్పటిలోగా యుద్ధ పరిస్థితులు మారుతాయో తెలియకపోవడంతో, మార్కెట్‌ను క్యాష్ చేసుకొనేందుకు వ్యాపారులు సమాయత్తమవుతున్నారు. వంటగ్యాస్‌తో సంబంధం లేకుండా ఉండే ఇండక్షన్ స్టౌస్, ఇండక్షన్ పాట్స్, మైక్రోవేవ్ పాట్ల ఆర్డర్లు ఎక్కువగా వస్తున్నాయని విద్యానగర్‌కు చెందిన హోం అప్లయన్స్ డిస్ట్రిబ్యూటర్ సత్యనారాయణ తెలిపారు. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా వాటి ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి.
నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లోని భారత్ గ్యాస్ ఏజెన్సీ వద్దకు బుధవారం పెద్దఎత్తున వినియోగదారులు చేరుకొని గంటల తరబడి క్యూలో నిలబడ్డారు. బారులు తీరినవారిని చూసి తనకు సిలిండర్ వస్తుందో? రాదో? అన్న బెంగతో 70 ఏండ్ల వృద్ధురాలు నారాయణమ్మ కిందపడిపోవడంతో గాయాలయ్యాయి. మరో మహిళ చంటి పిల్లవాడితో ఎర్రని ఎండలో నిలబడి పడిగాపులు కాసింది. మంత్రి జూపల్లి ఇలాకాలో గ్యాస్ కోసం ఇబ్బందులు పడుతుంటే అధికారులు పట్టించుకోవడం లేదని పలువురు మండిపడ్డారు. బుక్ చేసుకున్న వారికి సిలిండర్లు ఇప్పటికే డెలివరీ చేశామని ఏజెన్సీ డీలర్, సిబ్బంది చెప్పడంతో తమకు సిలిండర్లే రాలేదంటూ పలువురు నిలదీయడంతో ఉద్రిక్తత నెలకొన్నది. సిలిండర్లు బ్లాక్ మార్కెట్‌కు తరలించి సొమ్ము చేసుకుంటున్నారని నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఏజెన్సీ డీలర్‌ను వివరణ కోరగా.. రోజు విడిచి రోజు కొల్లాపూర్‌కు 342 గ్యాస్ సిలిండర్లు వస్తున్నాయని, మొత్తం 18 వేల కనెక్షన్లు ఉన్నాయని తెలిపారు. బయట మార్కెట్లోకి ఎలా వెళ్లాయో తెలియదని పేర్కొన్నారు.
గ్యాస్ సిలిండర్లను ఓవర్ బుకింగ్ చేయవద్దని, గ్యాస్ కొరతపై అనవసరంగా ఆందోళన చెందవద్దని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ వినియోగదారులకు సూచించింది. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. బుకింగ్‌లో సమస్యలు, గ్యాస్ సిలిండర్ల అక్రమ రవాణాపై 1967 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని కోరింది. గ్యాస్ సిలిండర్ల అక్రమ రవాణాపై విజిలెన్స్ విభాగం దాడులు నిర్వహిస్తున్నదని తెలిపింది. ఇటీవల నిర్వహించిన దాడుల్లో అక్రమంగా రవాణా చేస్తున్న 100 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించింది.